పాతిక మంది ఔట్‌!

No tickets for 25 sitting TRS MLAs - Sakshi

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను తప్పించే యోచనలో టీఆర్‌ఎస్‌

ప్రతికూల పరిస్థితులు, సర్వే నివేదికల ఆధారంగానే..

ఎన్నికలకు ఏడాది ముందే అభ్యర్థుల ఎంపిక కసరత్తు

పార్టీ సీనియర్లతో కేసీఆర్‌ చర్చలు

తప్పించే జాబితాలో ‘ఫిరాయింపు’ ఎమ్మెల్యేలు కూడా!

రెబెల్‌గా దిగితే ఓట్లు చీలే ఐదారు చోట్ల కుటుంబ సభ్యులకు చాన్స్‌

సాక్షి, హైదరాబాద్‌ : వచ్చే ఎన్నికల కోసం అధికార పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది. ఇంకా ఏడాది సమయం ఉండగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యేల పనితీరు, గెలుపు అవకాశాలను సమీక్షించడంతోపాటు విపక్ష ఎమ్మెల్యేలున్న చోట దీటైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు సర్వేలు చేయిస్తోంది. గత ఏడాదిన్నరగా పలు సంస్థలతో సర్వేలు చేయిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వాటి వివరాలు బయటికి రాకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. పలు నియోజకవర్గాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను ఇప్పటికే వ్యక్తిగతంగా పిలిపించుకుని హెచ్చరించిన ముఖ్యమంత్రి... కొంతకాలంగా సర్వే వివరాలను తానే స్వయంగా సమీక్షించుకుంటున్నారు. కొందరిని హెచ్చరించినా ఫలితం లేదని గుర్తించిన ఆయన.. వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకూడదని నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.
 
నాలుగు సర్వేల సమీక్షతో.. 
నాలుగు సర్వేలను సమీక్షించిన తరువాత పాతిక మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు సీఎం కేసీఆర్‌ గుర్తించినట్లు తెలిసింది. అందులో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నట్లు సమాచారం. మంత్రుల్లో కొందరిని పార్లమెంట్‌కు పంపే ప్రతిపాదనను కూడా కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న మంత్రి చందూలాల్‌ స్థానంలో ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్‌ ఇచ్చే అవకాశముంది. మరో ఐదుగురు మంత్రుల్లో ముగ్గురిని పార్లమెంట్‌కు పోటీ చేయించడం దాదాపుగా ఖాయమైందన్న ప్రచారం జరుగుతోంది. మిగతా ఇద్దరు మంత్రులకు టికెట్లు ఇచ్చే విషయంలో తుది దాకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చని అంటున్నారు. అవసరమైతే వారిని ఇతర నియోజకవర్గాల నుంచి పోటీ చేయించే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఉత్తర తెలంగాణ ఎమ్మెల్యేలే ఎక్కువగా.. 
ప్రభుత్వపరంగా టీఆర్‌ఎస్‌ పరిస్థితి బాగుందని సర్వేలు చెబుతున్నా.. పార్టీ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఓ సీనియర్‌ ఎమ్మెల్యే భూవివాదాల్లో తలదూర్చి ప్రజల్లో చులకన అయ్యారని నిఘా విభాగం నివేదిక ఇచ్చిందని తెలిసింది. అదే జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇక ఉత్తర తెలంగాణలో వ్యతిరేకత ఎదుర్కొంటున్న వారిలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వారికి మళ్లీ టికెట్‌ ఇస్తే గెలుపు అవకాశాలు తక్కువేనని సర్వేల్లో వెల్లడైనట్లు సమాచారం. ఖమ్మం జిల్లాలో ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యేల్లోనూ ఇద్దరి పరిస్థితి దారుణంగా ఉందని, వారు గెలిచే అవకాశం లేదని నిర్ధారించుకున్నట్లు తెలిసింది. మొత్తంగా ఉత్తర తెలంగాణలో 15 నుంచి 18 మంది సిట్టింగులకు తిరిగి టికెట్లు దక్కకపోవచ్చని అంటున్నారు. వారిలో ఇద్దరు ముగ్గురు రెబల్‌గా పోటీచేస్తే భారీగా ఓట్లు చీల్చే అవకాశమున్న దృష్ట్యా.. వారి కుటుంబ సభ్యులకు టికెట్‌ ఇవ్వవచ్చని అంటున్నారు.

దక్షిణంలో కాంగ్రెస్‌ను ఎదుర్కొనే వ్యూహం 
ఉత్తర తెలంగాణతో పోలిస్తే దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ గణనీయంగా పుంజుకున్నట్లు సర్వే నివేదికలు చెబుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు అధికార పార్టీ కొత్త వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. నల్లగొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని యోచిస్తోంది. ఈ జిల్లాల్లో కూడా 7 నుంచి 10 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అందులో ముగ్గురు మంత్రులు కూడా ఉన్నట్లు సమాచారం. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోకి వచ్చే ఓ పార్లమెంట్‌ స్థానం నుంచి ప్రస్తుత మంత్రి ఒకరిని పోటీ చేయించాలని ముఖ్యమంత్రి దాదాపుగా నిర్ణయానికి వచ్చారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. నల్లగొండ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. వారికి టికెట్లు ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు. ఇక ఓ సిట్టింగ్‌ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో గెలిచే అవకాశమున్నా పక్కనే ఉన్న మరో నియోజకవర్గానికి మార్చే అవకాశముందని తెలుస్తోంది.

గ్రేటర్‌లో బలోపేతానికి ప్రణాళిక 
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అత్యధిక శాసనసభ స్థానాలను కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్‌ వ్యూహాలు పన్నుతోంది. మజ్లిస్‌ ప్రభావమున్న ఏడు నియోజకవర్గాలు తప్పించి మిగతా చోట్ల అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో టీఆర్‌ఎస్‌ కంటే టీడీపీ ఎక్కువ శాతం ఓట్లు సాధించింది. ఈసారి టీడీపీ అభ్యర్థులను కూడా నిలిపే పరిస్థితిలో లేనందున ఆ ఓటు బ్యాంకును అనుకూలంగా మలుచుకోవాలన్నది టీఆర్‌ఎస్‌ వ్యూహం. ఇందుకు తగ్గట్లే ఇటీవల కాలంలో వ్యూహాలను మార్చుకుంటూ వచ్చింది. ఓ సామాజికవర్గం వారి ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే టీడీపీ ఓటు బ్యాంకు యధావిధిగా టీఆర్‌ఎస్‌కు బదిలీ అవుతుందని చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక గ్రేటర్‌ పరిధలోని కాంగ్రెస్‌ నేతలు ముఖేశ్‌గౌడ్, దానం నాగేందర్‌ టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. వారితో పాటు ద్వితీయ శ్రేణి నేతలనూ పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top