ఆ మూడింటికి నో నోటిఫికేషన్‌ 

No notification To those three seats - Sakshi

అనర్హతతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలపై హైకోర్టుకు ఈసీ, ప్రభుత్వం హామీ

హామీని రికార్డ్‌ చేసుకున్న న్యాయమూర్తి  

సాక్షి, హైదరాబాద్‌: అనర్హత వేటు వల్ల శానసమండలిలో ఖాళీ అయిన 3 స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయబోమని, ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోబోమని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు హామీ ఇచ్చాయి. రెగ్యులర్‌గా ఖాళీ అయిన స్థానాలకు మాత్రమే రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ చేస్తామని తెలి పాయి. ఈ హామీని నమోదు చేసుకున్న న్యా యస్థానం, అనర్హతవేటును సవాలు చేస్తూ తన ముందున్న వ్యాజ్యాలను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండ రామ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులను కారణంగా చూపుతూ తమపై అనర్హత వేటు వేస్తూ మండలి చైర్మన్‌ ఇటీవల జారీచేసిన ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, వాటిని రద్దు చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీలు రాములు నాయక్, యాదవరెడ్డిలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.  

నామినేటెడ్‌ వ్యక్తికి అనర్హత వర్తించదు.. 
రాములు నాయక్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ సామాజిక సేవ కేటగిరి కింద ఎమ్మెల్సీగా నామినేట్‌ అయ్యారన్నారు. ఆయన ఏ పార్టీ గుర్తుపై గెలుపొందలేదన్నారు. ఏదైనా పార్టీ లేదా ఏదైనా పార్టీ గుర్తుపై గెలిచి ఆ తర్వాత మరోపార్టీలోకి ఫిరాయించినప్పుడు మాత్రమే అనర్హత వర్తిస్తుందని తెలిపారు. పిటిషనర్‌ ఫలానా పార్టీకి చెందిన వారనేందుకు ఫిర్యాదు లో ఎటువంటి ఆధారాలు చూపలేదన్నారు. నామినేట్‌ అయిన వ్యక్తికి అనర్హత వర్తించదని చెప్పినా, మండలి చైర్మన్‌ వినిపించుకోకుండా అనర్హత వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోర్టును కోరారు. యాదవరెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది దేశాయ్‌ ప్రకాశ్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మీడియా కథనాల ఆధారంగా పిటిషనర్‌పై ఫిర్యాదుదారులు మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశారన్నారు.

ఈ కథనాల్లో ఉన్న వాస్తవం ఎంతో తెలుసుకోకుండా చైర్మన్‌ పిటిషనర్‌పై అనర్హత వేటు వేశా రని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి అధికార పార్టీలోకి ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు చేసినా మండలి చైర్మన్‌ పట్టించుకోలేదని, ఇప్పుడు అధికార పార్టీ వారి ఫిర్యాదులపై మాత్రం తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్నారని చెప్పా రు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ, సింగిల్‌ జడ్జి, ధర్మాసనం, ఆ తరువాత సుప్రీం కోర్టు ఇలా కేసు తేలేటప్పటికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుందని వ్యాఖ్యానించారు.  రాములు నాయక్‌ నామినేషన్‌తోపాటు ఎన్ని కకు సంబంధించి రికార్డులను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనికి ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, ధర్మాసనం ముందు ఈ రికార్డులను సమర్పిస్తామని చెప్పారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top