నిజామాబాద్‌లో బలమేంటో.. చూపిద్దాం..

Nizamabad Farmer MP Candidates Start Campaign - Sakshi

ఎన్నికల ప్రచారం ప్రారంభించిన రైతన్నలు 

ఎన్నికల్లో నిలబడిన రైతులకే ఓటెయ్యాలని తీర్మానం 

ప్రచార ఖర్చులకు స్వచ్ఛందంగా చందాలు

పసుపు, ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంటు ఎన్నికల బరిలో నిలిచిన రైతులు ప్రచారాన్ని ప్రారంభించారు. రైతుల సమస్యను ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ప్రచార అస్త్రాలుగా మాత్రమే ఉప యోగించుకుంటున్నాయని రైతు ప్రతినిధులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల బరిలో నిలబడిన రైతులకే రైతాంగం ఓట్లు వేసి బలాన్ని ప్రదర్శించాలని కోరారు. 
ఆర్మూర్‌: గెలుపుపై ఎలాంటి ఆశలు లేకున్నప్పటికీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతు బలం ఏంటో చూపించాలని, అందుకోసం పార్లమెంటు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడిన రైతులకే రైతులందరూ ఓటేయ్యాలని రైతు నాయకులు విజ్ఞప్తి చేశారు. ఐక్యంగా ఉంటే రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెరిగి రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. పసుపు, ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధర కోసం ఎన్నికల పోరులో నిలిచి నామినేషన్లు వేసిన రైతులు సోమవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆర్మూర్‌ మండలం ఆలూర్, దేగాం గ్రామాలు, ముప్కాల్‌ మండలం కొత్తపల్లిలో రైతులు ప్రచారం చేశారు. ఆలూర్‌ గ్రామంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో 45 మంది నామినేషన్లు వేసిన రైతులు పాల్గొని ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు, ఎర్రజొన్న రైతులను నిర్లక్ష్యం చేస్తున్న తీరును, రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంత రైతాంగం దళారులు, సీడ్‌ వ్యాపారుల చేతుల్లో మోస పోతున్న వైనాన్ని వివరించారు.

రైతుల డిమాండ్ల సాధన కోసం రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలను ప్రస్తావించారు. సమస్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిలో ఉన్నప్పటికీ పసుపు, ఎర్రజొన్న రైతులను ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా మాత్రమే ఉపయోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఓట్ల కోసం రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీలు గుప్పించి అధికారంలోకి రాగానే ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. దీంతో పసుపు, ఎర్రజొన్నలను పండించే రైతాంగం ప్రతి ఏటా కోట్ల రూపాయలను నష్టపోతోందన్నారు. అందుకే తాము చేపట్టిన ఉద్యమంలో భాగంగా 178 మంది రైతులు పార్లమెంట్‌ ఎన్నికల్లో నామినేషన్లు వేసారన్నారు. రైతులకు వ్యక్తిగతంగా ఏదో ఒక రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నప్పటికీ ఆయా పార్టీలు రైతుల సమస్యల పరిష్కారానికి ముందుకు రావడం లేదన్నారు.

అందుకే రైతులు తమతో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నామని రైతు ప్రతినిధులు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు రాజ్యం అంటూ రైతులను నిర్లక్ష్యం చేస్తున్న నేపథ్యంలో రైతుల బలాన్ని వారికి రుచి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  ఆలూర్, కొత్తపల్లి గ్రామాలకు చెందిన రైతులు తమ గ్రామం నుంచి నామినేషన్లు వేసిన రైతులకు పూర్తి మద్దతును ప్రకటించారు. ఆయా గ్రామాల్లో ఎలాంటి రాజకీయ పార్టీ జెండాను ఎగరనివ్వబోమని, ప్రచారం సైతం నిర్వహించనివ్వమని తీర్మానాలు చేసారు.

ఎన్నికల ప్రచారానికి విరాళాల అందజేత.. 
పార్లమెంట్‌ ఎన్నికల్లో నామినేషన్లు వేసిన రైతుల ఎన్నికల ప్రచారం కోసం రైతులు విరాళాలు అందజేసారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని నిజామాబాద్, జగిత్యాల జిల్లాల పరిధిలో రైతు నాయకులు విస్తృతంగా పర్యటించాల్సి ఉన్నందున వారికి ఖర్చుల నిమిత్తం ఈ విరాళాలను అందజేసారు. రైతు నాయకులు జోలె పట్టి విరాళాలను స్వీకరించారు. ఈ ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top