నిర్భయతో అభయం ఉందా?

Nirbhaya Special Story For Women Protection - Sakshi

‘ఒక హంతకుడు శరీరాన్ని మాత్రమే చంపుతాడు, కానీ ఒక రేపిస్టు ఆత్మను చంపేస్తాడు. బాధితురాలిపైనా, ఆ కుటుంబం పైనా శారీరకంగా, మానసికంగా, భావోద్వేగాల పరంగా పడే ప్రభావం జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది’అని ఓ కేసు విచారణ సమయంలో జస్టిస్‌ కృష్ణ అయ్యర్‌ అన్నారు. ఇవాళ, రేపు మహిళలపై జరిగే నేరాలు ఘోరాల్లో శరీరాన్ని, ఆత్మని రెండూ చంపేయడం ఎక్కువైపోయింది. దీనికి కారణం నిర్భయ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయకపోవడమే. తర్వాత కాలంలో నిర్భయ చట్టానికి మరింత పదును పెట్టారు కానీ ఆ చట్టం కింద శిక్షలు వేయడంలో అలసత్వం కనిపిస్తోంది. పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యంతో నేరాలకు అడ్డుకట్ట పడలేదన్న విమర్శలున్నాయి.

జాతీయ నేర గణాంక నమోదు సంస్థ దేశవ్యాప్తంగా లైంగిక నేరాలకు పాల్పడిన 4.5 లక్షల మంది వివరాలను డిజిటలైజ్‌ చేసింది. అయితే అత్యాచార కేసుల్లో శిక్షలు పూర్తిగా పడటం లేదు. ఏళ్ల తరబడి కేసులు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. అత్యాచార కేసుల్లో 1973లో 44శాతం మందికి శిక్షలు పడ్డాయి. అదే 2016 నాటికి శిక్షలు పడిన కేసులు 18.9 శాతానికి పడిపోయాయి. ప్రతీ 4 కేసుల్లో 1 కేసులో మాత్రమే శిక్ష పడుతోంది. ఇక కోర్టులు తగిన సంఖ్యలో లేకపోవడం, కోర్టుల్లో న్యాయమూర్తులు, సిబ్బంది కొరతతో పెండింగ్‌ కేసులు ఎక్కువైపోతున్నాయి. కేవలం అత్యాచార కేసులు విచారించడానికి వెయ్యికి పైగా ప్రత్యేక కోర్టులు ఏర్పరచాల్సిన అవసరం ఉందని సర్వేలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా 727 జిల్లాల్లో ఏకకాలంలో అత్యాచార నిందితులకు కఠిన శిక్షలు విధిస్తేనే భారత్‌లో మహిళల భద్రత ఒక గేమ్‌ ఛేంజర్‌గా మారుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

నీరుకారిపోతున్న నిర్భయ నిధులు
నిర్భయ ఘటన తర్వాత అప్పడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం మహిళలకు అండ దండగా ఉండటానికి రూ.వెయ్యి కోట్ల నిధులతో కార్పస్‌ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. అదిప్పుడు రూ.3,600 కోట్లకు చేరుకుంది. ఈ నిధుల విడుదల్లో కేంద్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుంటే వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిధుల వాడకాన్ని నీరు కారుస్తున్నాయి. 2013లో ఈ ని«ధుల్ని ఏర్పాటు చేసినప్పటికీ విడుదల మాత్రం 2015 నుంచే జరుగుతోంది. కేంద్రం విడుదల చేసిన నిధులే 42 శాతమైతే.. రాష్ట్రాలు వాటిని 20 శాతం కూడా వాడకపోవడంతో మహిళల భద్రత గాల్లో దీపంలా మారింది. 

మహిళల రక్షణకు నిధుల్ని విడుదల చేస్తున్న పథకాలివీ... 

  • ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సపోర్ట్‌ సిస్టమ్‌
  • సెంట్రల్‌ విక్టిమ్‌ కాంపన్సేషన్‌ ఫండ్‌ 
  • సైబర్‌ క్రైమ్‌ అగైనెస్ట్‌ వుమెన్‌ అండ్‌ చిల్డ్రన్‌
  • వన్‌ స్టాప్‌ స్కీమ్‌... మహిళా పోలీసు వాలంటీర్‌
  • యూనివర్సలైజేషన్‌ ఆఫ్‌ వుమెన్‌ హెల్ప్‌లైన్‌ స్కీమ్‌

పైసా కూడా వినియోగించని రాష్ట్రాలు

  • మణిపూర్‌
  • మహారాష్ట్ర
  • లక్షద్వీప్‌ 
     
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top