ఫార్మాసిటీకి ‘నిమ్జ్‌’ హోదా

NIMZ Status For Hyderabad Pharma City - Sakshi

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆమోదం

2016లోనే సూత్రప్రాయ అంగీకారం

తాజాగా తుది ఆమోదం తెలిపిన కేంద్రం

రూ.3,418 కోట్ల గ్రాంటు ఇవ్వాలని కోరిన రాష్ట్రం

సాక్షి, హైదరాబాద్‌: ఫార్మా రంగం విస్తరణ, నూతన పెట్టుబడులు ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ‘హైదరాబాద్‌ ఫార్మాసిటీ’కి జాతీయ పెట్టుబడులు, ప్రోత్సాహక మండలి (నిమ్జ్‌) హోదా ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం తుది ఆమోదం తెలిపింది. 2015లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మాసిటీకి నిమ్జ్‌ హోదా ఇచ్చేందుకు కేంద్ర పరిశ్రమల శాఖ పరిధిలోని పరిశ్రమల ప్రోత్సాహక విధాన విభాగం (డిప్‌) 2016 జనవరి 22న సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఫార్మాసిటీకి సంబంధించిన టెక్నో ఎకనామిక్‌ ఫీజిబిలిటీ రిపోర్టు (సాంకేతిక ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక)తో పాటు అభివృద్ధి ప్రణాళిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సమరి్పంచింది. ఈ నివేదికలను కూలంకషంగా పరిశీలించిన కేంద్ర పరిశ్రమల శాఖ ఫార్మాసిటీకి నిమ్జ్‌ హోదా కలి్పంచాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఈ నెల 10న తుది ఆమోదం తెలపడంతో పాటు, రాష్ట్రానికి సమాచారం అందించింది. నిమ్జ్‌ హోదాకు పూర్తి స్థాయిలో ఆమోదం లభించిన నేపథ్యంలో ఫార్మాసిటీలో బాహ్య, అంతర్గత మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం నుంచి గ్రాంటు రూపంలో సాయం అందుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.

నిధుల వేటలో రాష్ట్ర ప్రభుత్వం
ఫార్మాసిటీ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16,395 కోట్లు కాగా, నిమ్జ్‌ హోదా ద్వారా మౌలిక సదుపాయాలకు రూ.6 వేల కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఫార్మాసిటీలో బాహ్య, అంతర్గత మౌలిక, సాంకేతిక సదుపాయాలకు రూ.6 వేల కోట్లు ఇవ్వాలని ‘డిప్‌’కు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతిపాదనలు సమర్పించింది. తొలి విడతలో రూ.1,500 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తంచేసినా నిధులు విడుదల కాలేదు. దీంతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ అక్టోబర్‌ 19న ఫార్మాసిటీ అభివృద్ధికి నిధులు ఇవ్వాలంటూ మరోమారు ప్రతిపాదనలు సమరి్పంచారు. ఫార్మాసిటీ తొలి దశ అభివృద్ధిలో భాగంగా రోడ్లు, నీటి సరఫరా తదితర బాహ్య సదుపాయాలకు రూ.1,318 కోట్లు, అంతర్గత సదుపాయాల కోసం రూ.2,100 కోట్లు, మొత్తంగా రూ.3,418 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. కేంద్రం చేపట్టిన ‘మేకిన్‌ ఇండియా’లో భాగంగా ప్రపంచ శ్రేణి ఫార్మాసిటీని అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి కూడా ఈ అంశాన్ని ఇటీవల లోక్‌సభలో ప్రస్తావించారు.

5.6 లక్షల మందికి ఉపాధి
రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో 19,333 ఎకరాల్లో ఏర్పాటు చేసే హైదరాబాద్‌ ఫార్మాసిటీ ద్వారా 5.6 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. మౌలిక సదుపాయాలు కల్పిస్తే రూ.64 వేల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉందని భావిస్తోంది. దీంతో మౌలిక సదుపాయాల కల్పనను త్వరితగతిన పూర్తి చేసేందుకు టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో ‘హైదరా బాద్‌ ఫార్మాసిటీ లిమిటెడ్‌’ పేరిట స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ) కూడా ఏర్పాటు చేశారు. ఫార్మాసిటీలో అంతర్గత మౌలిక సౌకర్యాల కు అవసరమైన నిధుల కోసం ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకుకు ప్రతిపాదనలు సమరి్పంచింది. ఫార్మాసిటీని ప్రధాన రహదారులతో అనుసంధానిస్తూ సుమారు రూ.400 కోట్లతో రహదారుల విస్తరణ, విద్యుత్‌ లైన్ల ఏర్పాటు వంటి పనులు కూడా ఎస్‌పీవీ చేపట్టింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top