శివార్ల అభివృద్ధికే రేడియల్‌ రోడ్లు

Radial roads with suburban development - Sakshi

ఐటీ, మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌

హెచ్‌సీయూ డిపో – వట్టినాగులపల్లి రేడియల్‌ రోడ్డుకు శంకుస్థాపన 

హైదరాబాద్‌: నగర శివారు ప్రాంతాలను అభివృద్ధి పరిచేందుకు రేడియల్‌ రోడ్లకు శ్రీకారం చుట్టినట్లు ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. హెచ్‌సీయూ డిపో నుంచి వట్టినాగులపల్లి వరకు రూ. 152 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రేడియల్‌ రోడ్డు పనులకు శేరిలింగంపల్లి నల్లగండ్ల హుడాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పి.మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌ గౌడ్‌లతో కలసి కేటీఆర్‌ మంగళవారం శంకుస్థాపన చేశారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్యను తగ్గించేందుకు రేడియల్‌ రోడ్లు నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా కేటీఆర్‌ వివరించారు.

35 రేడియల్‌ రోడ్లకు గాను ఇప్పటికే హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో 17 రేడియల్‌ రోడ్ల పనులు పూర్తయ్యాయని, ఆర్‌ అండ్‌ బీ ఆధ్వర్యంలో నాలుగు రోడ్ల పనులు చేపట్టామని తెలిపారు. రేడియల్‌ రోడ్లతో నల్లగండ్ల, తెల్లాపూర్, వట్టినాగులపల్లి, గచ్చిబౌలి ప్రాంతాల వారికి ట్రాఫిక్‌ సమస్య తీరడంతో పాటు ఐటీ ఉద్యోగులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందన్నారు. మిగిలిన 14 రేడియల్‌ రోడ్లనూ హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నామన్నారు. మహానగరంలో ఐటీ సంస్థలు, కొత్త తరం నాలెడ్జ్‌ ఇండస్ట్రీస్‌ వెస్ట్‌జోన్‌ పరిధిలోని గచ్చిబౌలి ప్రాంతంలోనే వస్తున్నాయన్నారు. దీంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రమవుతుందన్నారు. మౌలిక వసతులు, రేడియల్, గ్రిడ్‌ రోడ్లతో ఐటీ, ఇతర సంస్థలు నగరానికి నాలుగువైపులా విస్తరించే అవకాశం ఉందని.. అందుకోసం ప్రభుత్వం ప్ర«ణాళికలు చేస్తోందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఓఆర్‌ఆర్‌తో పాటుగా రీజినల్‌ రింగ్‌ రోడ్డును 350 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నట్లు కేటీఆర్‌ వివరించారు. 

హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌కు మాస్టర్‌ ప్లాన్‌ 
హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌)కు స్పష్టమైన ప్రణాళికతో మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. తద్వారా ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా కిలోమీటర్‌ చొప్పన ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి చేస్తామన్నారు. అవసరమైతే రెండు కిలోమీటర్లకు కూడా విస్తరించనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్, డ్రైనేజీ తదితర సమస్యలు భవిష్యత్తులో తలెత్తకుండా ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిపారు.

రీజినల్‌ రింగ్‌ రోడ్డు పూర్తయితే కొత్తగా రాబోతున్న హైదరాబాద్‌ ఫార్మా సిటీ, దండుమల్కాపూర్‌ వద్ద తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ కార్పొరేషన్, కొత్తగా 350 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న మీడియం స్కేల్‌ ఇండస్ట్రీస్‌ పార్కు అభివృద్ధి చెందుతాయన్నారు. ఎస్‌ఆర్‌డీపీ ఫలాలు 2018లో వస్తాయన్నారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కోరినట్టుగా నల్లగండ్ల నుంచి నేరుగా శేరిలింగంపల్లి మున్సిపల్‌ ఆఫీస్‌ వరకు అర కిలోమీటర్‌ మేర కొత్త రోడ్డు అవకాశాలను పరిశీలించి మంజూరు చేయాలని జోనల్‌ కమిషనర్‌ హరిచందనను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top