‘మీ సేవ’లో నగదు

New System Mee Seva Centers In Adilabad Telangana - Sakshi

ఆదిలాబాద్‌అర్బన్‌: బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలంటే ఎటీఎంలు, బ్యాంకులకే వెళ్లాల్సిన అవసరం లేదు. దగ్గరలో ఉన్న మీ సేవ కేంద్రాల్లోనూ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకు అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. బ్యాంకు పేరు, ఆధార్‌ నంబర్‌ చెప్పి బయోమెట్రిక్‌ ఇస్తే సరిపోతుంది. డబ్బులు చేతికొస్తాయి. ఈ కొత్త విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. మీ సేవ కేంద్రాల ద్వారా నగదు చెల్లింపులకు ఆర్‌బీఐ కూడా ఆమోదం తెలపడంతో ప్రభుత్వం నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో పైలెట్‌ ప్రాజెక్టు కింద ఆగస్టు 1 నుంచి ప్రారంభించింది.

వచ్చే అక్టోబర్‌ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాలోని అన్ని మీ సేవ కేంద్రాల్లో ఈ విధానాన్ని అక్టోబర్‌ నుంచి ప్రారంభించే సాధ్యాసాధ్యాలపై మీసేవ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో ఏర్పడిన నగదు కొరత, పెద్దనోట్ల రద్దు తర్వాత వచ్చిన నగదు సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని అందుబాటులో తెచ్చింది.

పనిచేసేదిలా..
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇదే రీతిలో ఆధార్‌ సమన్వయంతో డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ‘ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టం’(ఏఈపీఎస్‌)ను ప్రవేశపెట్టింది. ఈ సిస్టం ద్వారా మీ సేవ కేంద్రానికి వెళ్లి డబ్బు డ్రా చేసుకోవచ్చు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పాటించే నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ మార్గదర్శకాలను అనుసరించి ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆధార్‌ నంబర్, బ్యాంకు పేరు చెప్పి బయోమెట్రిక్‌ వివరాలు ఇవ్వాలి. బ్యాంకు ఖాతా నంబర్‌ చెప్పకుండానే డబ్బు డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది.

త్వరలో మీ సేవలో ఈ సిస్టం అందుబాటులోకి రానుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తికి వివిధ రకాల నాలుగు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయనుకుందాం.. డబ్బు డ్రా చేసేందుకు సదరు వ్యక్తి మీ సేవ కేంద్రానికి వచ్చినప్పుడు ఆధార్‌ వివరాలు చెప్పాలి. ఇదివరకే బ్యాంకు ఖాతాకు ఆధార్‌ నంబర్‌ అనుసంధానమై ఉంది. మీ సేవ నిర్వాహకులు ఏఈపీఎస్‌ సిస్టంలో ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేయగానే ఆ వ్యక్తి పేరు మీద ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నాయనేది స్పష్టంగా కన్పిస్తాయి. వ్యక్తి అభిప్రాయం మేరకు సదరు బ్యాంకు ఖాతా నుంచి డబ్బు డ్రా చేసి రశీదుతోపాటు నగదును మీసేవ నిర్వాహకులు సదరు వ్యక్తికి అందజేస్తారు. ఇలా ఒక రోజులో ఒక వ్యక్తి గరిష్టంగా రూ.10 వేలు మాత్రమే తీసుకునే వెసులుబాటు ఉంది.
 
జిల్లాలో ఇలా.. 
జిల్లాలో అన్ని చోట బ్యాంకు బ్రాంచీలు అందుబాటులో లేవు. కానీ.. మీ సేవ కేంద్రాలు పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్నాయి. దీని దృష్ట్యా మీ సేవ కేంద్రాల ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసిస్తే.. నగదు కొరతను అధిగమించవచ్చనే దిశగా ప్రభుత్వ ఆలోచన చేస్తోంది. జిల్లాలోని 18 మండలాల పరిధిలో మొత్తం 93 వివిధ బ్యాంకు బ్రాంచీలు ఉన్నాయి. ఈ బ్రాంచీల పరిధిలో ప్రస్తుతం 12,86,171 మంది ఖాతాదారులు ఉన్నారు. జిల్లాలో 76 మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. బ్యాంకు బ్రాంచీల కన్నా మీ సేవ కేంద్రాలు తక్కువగా ఉన్నా.. ఎక్కువ శాతం మీ సేవ సెంటర్లు గ్రామాల్లోనే ఉన్నాయి. మీసేవ కార్యకలాపాలు ఎక్కువగా నగదు రూపంలోనే జరుగుతుంటాయి.

వివిధ రకాల సర్టిఫికెట్లు, ధ్రువపత్రాల జారీ, కరెంట్‌ బిల్లుల రూపంలో మీ సేవలకు వచ్చిన నగదును బ్యాంకు లావాదేవీలకు వాడనున్నారు. ఆధార్‌ ఆధారిత లావాదేవీలను ప్రవేశపెట్టడంతో ఇటు బ్యాంకులకు.. అటు మీ సేవ నిర్వాహకులకు ప్రయోజనం చేకూరే అవకాశాలున్నాయి. బ్యాంకు తరఫున లావాదేవీలు నిర్వహించినందుకు మీ సేవ కేంద్రం ఆపరేటర్లకు అదనపు ఆధాయం లభిస్తుంది. మీ సేవలకు వివిధ రకాల సేవలు అందించినందుకు చార్జీల రూపంలో వచ్చిన మొత్తాన్ని ఈఎస్డీ విభాగానికి పంపేందుకు ఆపరేటర్లు బ్యాంకుకు వెళ్లి డిపాజిట్‌ చేయాల్సి వస్తోంది. ఇలా డిపాజిట్‌ చేసినందుకుగాను సహజంగానే బ్యాంకు క్యాష్‌ హ్యాడ్లింగ్‌ చార్జీలు వసూలు చేస్తున్నాయి. దీంతో ఆపరేటర్లు తమ కష్టార్జీతాన్ని ఈ రూపంలో కోల్పోవాల్సి వస్తోంది. తాజా విధానంతో వినియోగదారులకే సొమ్ము అందించడంతో బ్యాంకుకు చెల్లించే చార్జీలు తగ్గడంతోపాటు అదనపు ఆదాయం రానున్నదని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
 
అక్టోబర్‌ నుంచి  ప్రారంభం కావచ్చు 
మీ సేవ కేంద్రాల్లో బ్యాంకు సేవలను అక్టోబర్‌ నుంచి ప్రారంభించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పైలెట్‌ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఆగస్టు 1 నుంచి సేవలు ప్రారంభమయ్యాయి. ఈ విధానంతో నగదు కొరత అనేది ఉండదు. ఖాతాదారులకు బ్యాంకులు, ఏటీఎం చుట్టూ తిరిగే ఇబ్బందులు తప్పుతాయి. – రఘువీర్‌సింగ్, మీసేవ జిల్లా కో–ఆర్డినేటర్, ఆదిలాబాద్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top