నిర్లక్ష్యమే కాటేసింది | Negligence kills | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యమే కాటేసింది

Jul 17 2015 11:33 PM | Updated on Oct 1 2018 4:01 PM

రాత్రిపూట కరెంట్ ఓ కౌలు రైతు కుటుంబంలో చీకటిని నింపింది. బావి వద్ద మోటార్ నడవకపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద

మెదక్ రూరల్ : రాత్రిపూట కరెంట్ ఓ కౌలు రైతు కుటుంబంలో చీకటిని నింపింది. బావి వద్ద మోటార్ నడవకపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ప్యూజ్ వేసేందుకు ప్రయత్నిస్తూ కౌలు రైతు మృతి చెందడంతో మెదక్ మండల పరిధిలోని అవుసులపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన తాడెపు సాలయ్య(35) నిరుపేద. భార్య సుగుణ, తల్లితో పాటు పదేళ్లలోపు ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవిస్తున్నాడు. వ్యవసాయం తప్ప మరేపని తెలియని సాలయ్య స్థానికంగా ఓ రైతు పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నాడు.

శుక్రవారం వరి నాటు వేయాలని నిర్ణయించుని ఆ పనుల్లో నిమగ్నమయ్యాడు. రాత్రిపూట కరెంట్ కావడంతో పొలానికి నీరు పెట్టేందుకు గురువారం రాత్రి భోజనం చేసి 10గంటల ప్రాంతంలో బావి వద్దకు వెళ్లాడు. కరెంట్ ఉన్నా మోటార్ నడవకపోవడంతో పెద్దచెరువు సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లి పరిశీలించాడు. ప్యూజ్ పోయిందని గమనించి వేసేందుకు ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆఫ్ చేసేందుకు ఏబీ స్విచ్ హ్యాడిల్‌ను పట్టుకోగా షాక్ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ క్రమంలో పెద్ద శబ్దం రావడాన్ని గమనించిన స్థానిక రైతులు అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే సాలయ్య విగతజీవిగా పడి ఉన్నాడని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్సై వినాయక్‌రెడ్డి, తనసిబ్బందితో హుటాహుటిన ఘటన స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

 అధికారుల నిర్లక్షంతోనే..
 ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యంతోనే కౌలు రైతు సాలయ్య విద్యుదాఘాతంతో మృతి చెందాడని స్థానిక రైతులు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఎల్‌టీవైర్ పైననే 11కేవీ(హైటెన్షన్) వైర్లు ఉండడంతో ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆఫ్ చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి సాలయ్య మృతి చెంది ఉంటాడని పేర్కొన్నారు. హైటెన్షన్ వైర్లు తొలగించాలని సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని, దీంతో ప్రమాదం చోటు చేసుకుందని ఆరోపించారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని కోరారు.

 సాలయ్య కుటుంబానికి అండగా ఉంటాం
 విద్యుదాఘాతంతో మృతి చెందిన కౌలు రైతు సాలయ్య కుటుంబానికి అండగా ఉంటామని అసెంబ్లీ డిప్యూటీ స్వీపకర్ పద్మాదేవేందర్‌రెడ్డి చెప్పారు. మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement