Padmadevendarreddy
-
మహా కూటమికి మహా ఓటమి తప్పదు
కౌడిపల్లి(నర్సాపూర్): కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్రావాదులకు తాకట్టుపెట్టిందని, మహా కూటమికి మహా ఓటమి తప్పదని తాజా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం కౌడిపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ బైక్ షోరూంను ప్రారంభించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే ఆంధ్రపాలకులతో పొత్తులు పెటుకుంటోందని తెలిపారు. ప్రజలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబుకు తాకట్టుపెడుతున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులు, కృష్ణ, గోదావరి జలాలో వాటాను హైకోర్టు విభజనను అడ్డుకున్న చంద్రబాబుతో దోస్తికట్టిన మహాకూటమికి ప్రజలు మహాఓటమితో బుద్ధి చెపుతారని తెలిపారు. మాజీ మంత్రి సునీతారెడ్డి గజ్వేల్‌లో ఓ మాట నర్సాపూర్‌లో ఓ మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు తెలంగాణలో ప్రాజెక్టులు కట్టలేదు కాని అడ్డుకోవడంలో మాత్రం ముందున్నారని తెలిపారు. ప్రజలు మరోసారి టీఆర్ఎస్ను గెలిపించి అభివృద్ధి పనులు, నీళ్లు, నిధుల నిర్ణయాలు ఇక్కడే కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఢిల్లీలో నిర్ణయాలు జరిగే పార్టీలకు ప్రజలు గట్టి బుద్ధి చెపుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శివాంజనేయులు, నాయకులు రంగారెడ్డి, సత్యనారాయణగౌడ్, నరసింహాగౌడ్, వెంకట్‌రెడ్డి, బైక్ షోరూం నిర్వాహకులు ఆర్ కృష్ణగౌడ్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యమే కాటేసింది
మెదక్ రూరల్ : రాత్రిపూట కరెంట్ ఓ కౌలు రైతు కుటుంబంలో చీకటిని నింపింది. బావి వద్ద మోటార్ నడవకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ వద్ద ప్యూజ్ వేసేందుకు ప్రయత్నిస్తూ కౌలు రైతు మృతి చెందడంతో మెదక్ మండల పరిధిలోని అవుసులపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన తాడెపు సాలయ్య(35) నిరుపేద. భార్య సుగుణ, తల్లితో పాటు పదేళ్లలోపు ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవిస్తున్నాడు. వ్యవసాయం తప్ప మరేపని తెలియని సాలయ్య స్థానికంగా ఓ రైతు పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నాడు. శుక్రవారం వరి నాటు వేయాలని నిర్ణయించుని ఆ పనుల్లో నిమగ్నమయ్యాడు. రాత్రిపూట కరెంట్ కావడంతో పొలానికి నీరు పెట్టేందుకు గురువారం రాత్రి భోజనం చేసి 10గంటల ప్రాంతంలో బావి వద్దకు వెళ్లాడు. కరెంట్ ఉన్నా మోటార్ నడవకపోవడంతో పెద్దచెరువు సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి పరిశీలించాడు. ప్యూజ్ పోయిందని గమనించి వేసేందుకు ట్రాన్స్ఫార్మర్ను ఆఫ్ చేసేందుకు ఏబీ స్విచ్ హ్యాడిల్‌ను పట్టుకోగా షాక్ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ క్రమంలో పెద్ద శబ్దం రావడాన్ని గమనించిన స్థానిక రైతులు అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే సాలయ్య విగతజీవిగా పడి ఉన్నాడని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్సై వినాయక్‌రెడ్డి, తనసిబ్బందితో హుటాహుటిన ఘటన స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అధికారుల నిర్లక్షంతోనే.. ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యంతోనే కౌలు రైతు సాలయ్య విద్యుదాఘాతంతో మృతి చెందాడని స్థానిక రైతులు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎల్టీవైర్ పైననే 11కేవీ(హైటెన్షన్) వైర్లు ఉండడంతో ట్రాన్స్ఫార్మర్ను ఆఫ్ చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి సాలయ్య మృతి చెంది ఉంటాడని పేర్కొన్నారు. హైటెన్షన్ వైర్లు తొలగించాలని సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని, దీంతో ప్రమాదం చోటు చేసుకుందని ఆరోపించారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని కోరారు. సాలయ్య కుటుంబానికి అండగా ఉంటాం విద్యుదాఘాతంతో మృతి చెందిన కౌలు రైతు సాలయ్య కుటుంబానికి అండగా ఉంటామని అసెంబ్లీ డిప్యూటీ స్వీపకర్ పద్మాదేవేందర్‌రెడ్డి చెప్పారు. మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. -
అండగా ఉంటా
మొన్నటివరకు తెలంగాణ ఉద్యమంలో కాలికి బలపం కట్టుకుని ఊరూవాడా తిరిగిన మహిళా నేత.. నిన్నటికి నిన్న ప్రజాభిమానంతో ప్రత్యర్థులను మట్టికరిపించి అసెంబ్లీలో అడుగుపెట్టిన మెతుకుసీమ ధీరవనిత.. ఇపుడు తెలంగాణ తొలిఉప సభాపతిగా సభను సమర్థవంతంగా, హుందాగా నడుపుతూ అందరి మన్ననలు చూరగొంటున్న మహిళా నేత.. ఆమే పద్మాదేవేందర్‌రెడ్డి. ప్రజాప్రతినిధిగా నిత్యం బిజీగా ఉండే ఆమె, ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. రామాయంపేట మండలం డి.ధర్మారం గ్రామానికి వెళ్లి ‘సాక్షి’ విలేకరిగా జనం గుండెను తడిమి చూశారు. డిప్యూటీ స్పీకర్ గ్రామానికి వస్తున్న విషయం తెలుసుకున్న పల్లె జనం పిల్లా పాపలతో కలిసి ఊరు పొలిమేర వద్ద ఆమెకు ఘనస్వాగతం పలికారు. డప్పుల దరువు...పల్లె నాట్యాలతో గ్రామంలోకి తీసుకు వెళ్లారు. గ్రామం ముంగిట్లో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన పద్మాదేవేందర్‌రెడ్డి...అక్కడి నుంచి చౌకధర దుకాణం వద్దకు చేరుకుని ‘సాక్షి’ విలేకరిగా జనం సమస్యలు తెలుసుకున్నారు. ‘కూడు గింజలకు ఇగ రంది లేదమ్మా’ అని వెంకటలక్ష్మి అనే గృహిణి చెప్పినప్పుడు ఆత్మసంతృప్తితో పద్మాదేవేందర్‌రెడ్డి కళ్లు చెమ్మగిల్లాయి. డిప్యూటీ స్పీకర్: ఏమ్మా బాగున్నారా? డి.ధర్మారం ప్రజలు : బాగున్నాం మేడం... డిప్యూటీ స్పీకర్: అందరికీ రేషన్ అందిందా? డి.ధర్మారం ప్రజలు : ఎవరి నోటి నుంచి మాట రాలేదు. డిప్యూటీ స్పీకర్: ఏం మాట్లాడరు? డీలర్ బియ్యం ఇవ్వటం లేదా? డి.ధర్మారం ప్రజలు :: అయ్యో... అట్టేమీ లేదమ్మా. డిప్యూటీ స్పీకర్: నీ పేరు చెప్పమ్మా? నీ సమస్య ఏమిటి? ఎనబోయిన సత్తెవ్వ: అమ్మా... ఎనిదేళ్ల నుంచి కారట్ల నా మొగని పేరు లేదు. కారటు దిగినప్పుడు ఆయన పట్నం బతకబోయిండు.తల్లి మగ్గురు పేరే ఉంది. నెలకు 12 కిలోల బియ్యమొస్తే ఏం సరిపోతాయమ్మ. పిట్ల నర్సమ్మ: నాకు కూడా అట్నే అయిందమ్మా. నాకు ఇద్దరు పిల్లలు. చిన్నోనికి 12 ఏండ్లు. ఆధార్ లేదని కారట్ల పేరెక్కియలేదు. రామాయంపేటకు తీసుకపోయి దింపుకొచ్చిన. ఇప్పుడు పేరు ఎక్కిత్తమని సార్ చెప్పిండు. డిప్యూటీ స్పీకర్: ఇంతకు ముందు ఎన్ని కిలోల బియ్యం వచ్చేవి? మీకు సరిపోయేదా? సరస్వతి: అమ్మా..! ఒళ్లలువ కట్టం చేసుకుంటం. కడపునిండా తింటం. రెండు పూటల తింటే నెలకు ఎట్టా లేదన్నా ఇంటిళ్లిపాదికి కలిపి 40 కిలోల బియ్యం పడుతయి. సార్కారోళ్లు ఇన్నాళ్లు ఎంత మంది ఉన్నరు అని సూడకుండ 20 కిలోల బియ్యం ఇస్తే 15 రోజులకే సరిపోయేవి. సుట్టపోడు అస్తే 10 రోజులకు కూడా సరిపోవు. బయట కొందామంటే కిలో బియ్యం (దొడ్డు బియ్యం) రూ.25 ..రూ.30 పలుకుతోంది. ఆలుమగలం కట్టపడితే రోజు రెండు, మూడోందలు దొరుకుతయి. దాంట్లెనే మొగొళ్లు ఇంత ఏసుకుంటరా..! ఇంకేం ఉంటమయ్మ. సెప్పుకుంటే అమ్మలక్కలు సెప్పుకున్నది అంటరు గానీ...తినీ, తినక పస్తులు పండుకునేదాన్ని. (ఆమెను డిప్యూటీ స్పీకర్ ఆప్యాయం దగ్గరకు తీసుకున్నారు. ఇక నుంచి ఆ కష్టాలుండవని భరోసా ఇచ్చారు) డిప్యూటీ స్పీకర్: ఇప్పుడు ప్రభుత్వం ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం ఇస్తుంది కదా? ఇప్పుడెలా ఉందమ్మా? వెంకటలక్ష్మి: ఇప్పుడు జర నయమే నమ్మా... గంజిలకు ఉప్పుగల్లు తోడయినట్టు. మనిషికి ఆరు కిలోల బియ్యం ఇత్తన్రు. ఎంత మంది ఉంటే అన్ని ఆర్లు ఇత్తున్నరు. కూడు గింజలకు రంది లేకుంటయిదమ్మా. రేషన్ కింద ఇస్తున్న ఉప్పు, నూనె, పప్పు, మిరపకాయలు అసలు సరిపోట్లేదమ్మా... బియ్యం పెంచినట్టే వాటిని పెంచితే మీకు పుణ్ణెం వస్తదమ్మా. మీ పేరు చెప్పుకొని పేదోళ్లం రెండు పూటలైనా కడుపు నిండా తింటాం. డిప్యటీ స్పీకర్: నీ సమస్య ఏమిటో చెప్పమ్మా? ఉడుత యశోద: బీడీ కంపెనోళ్లు నెలల 10 రోజులు కూడా పనిత్తలేరు. ఉప్పు, పప్పుకు శానా ఇబ్బందైతంది. బయట కైకిలి కూడా దొరుకుత లేదు. పిల్లలను బతుకు ఏంగావాలే.. మా బతుకు ఎట్టా ఎల్లదీసుకోవాలే. మాకట్టం మీకు తెలుసుకదమ్మా..మీరు కంపెనోళ్లతో మాట్టాడి మాకు దారి సూపించురి. కార్డున్న బీడీ కార్మికులకు రూ 1,000 పింఛన్ ఇస్తే బాగుంటదమ్మా. డిప్యూటీ స్పీకర్: నువ్వు ఏదో మాట్లాడాలను కుంటున్నావు? నర్సయ్య: మేడం గారు.. నాకు అసలే రేషన్ కార్డు లేదమ్మా.. ఊళ్లె ఆధార్ కారటు దింపుకున్నప్పుడు నా కుటుంబం అంతా బీదర్ల బతుకుతున్నాం. మాకెవ్వలు సెప్పలేదు. ఊళ్లె మాకు ఆధార్ కారటు లేదు. ఊళ్లె సర్వే జేత్తున్నరు....కేసీఆర్ సారు అందరిని రమ్మన్నడు అని జెప్తే అప్పుడు ఊళ్లకొచ్చినం. అప్పటి నుంచి ఊళ్లనే ఉంటున్న. రేషన్ కారటుకు కూడా దరఖాస్తు పెట్టుకుంటే ఆధార్ కార్డు ఉందా? అని సారోళ్లు అడిగిండ్రు. ఆదేదో తెల్వక నోరెళ్లబెట్టిన. కుటుంబంమంతా కలిసి నెల రోజుల కింద రామాయంపేటకు పోయి మీ సేవల ఆధార్ దిగినం గానీ..ఇంత వరకు రాలే. నాకు రేషన్ బియ్యం ఇయ్యరని చెప్తున్నారు. డిప్యూటీ స్పీకర్: ఆహార భద్రత కార్డుకు నువ్వు అర్హుడవే. నువ్వు ఎలాగు మీసేవలో ఆధార్ దిగానని చెప్తున్నావు కాబట్టి, అది రాగానే అధికారులు నీకు ఆహార భద్రత కార్డు అందిస్తారు. అంత వరకు నీ పాత కార్డు మీదనే నువ్వు బియ్యం తీసుకోవచ్చు. (అక్కడే ఉన్న ఓ విద్యార్థితో డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ..) డిప్యూటీ స్పీకర్: ఏం తమ్ముడు ఎలా ఉన్నావు. చదువు ఎలా సాగుతోంది? వినోద్ : మేడం.. మా ఊరి పేరు మీకు తెలుసు కదా..! దొంగల ధర్మారం. మీది ఏ ఊరంటే సెప్పుకుంటానికి ఇబ్బందిగా ఉంది. ఊరు పేరుతో కాలేజీలో ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తున్నరు. పేరు మార్పించురి. డిప్యూటీ స్పీకర్: అవును మీకు ఆ సమస్య ఉందని నాకు తెలుసు. మీరు గమనిస్తూనే ఉంటారు.. మీ మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయో అని మీ ఊరు పేరును డి. ధర్మారం అని పలుకుతున్నా. జిల్లా కలెక్టర్‌కు చెప్పాను తమ్ముడూ. త్వరలోనే మీ ఊరు పేరును సర్వోదయ నగర్ అని మార్చబోతున్నారు. (గ్రామస్తులంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.) ఆ ముచ్చటా తీరింది... ‘‘ఎమ్మెల్యేగా...డిప్యూటీ స్పీకర్‌గా...ఇంత చేసినా... జర్నలిస్టుగా పనిచేయలేకపోయానే అనే అసంతృప్తి ఏదో మూల ఉండేది. ‘సాక్షి’ కల్పించిన వెసులుబాటుతో ఆ ముచ్చటా తీరింది. వీఐపీ రిపోర్టర్‌గా జనం మధ్యకు తీసుకువచ్చి..వారి సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం కల్పించిన ‘సాక్షి’కి ధన్యవాదాలు’’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రజెంటేషన్: వర్ధెల్లి వెంకటేశ్వర్లు ఫొటోలు: కె.సతీష్