5 నెలల సమయం కావాలి.. 

Need 5 months time to Municipal elections process complete - Sakshi

మున్సిపల్‌ ఎన్నికల పూర్తికి గడువు కోరిన సర్కారు 

హైకోర్టుకు వెల్లడించిన మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి 

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు కనీసం 151 రోజులు (5 నెలలు) సమయం కావాలని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం కోరింది. సమీప గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం, మేజర్‌ గ్రామాలను కొత్త మున్సిపాలిటీలుగా చేసేందుకు, ఆ తర్వాత వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు చేసేందుకు ఆ సమయం పడుతుందని తెలిపింది. ఈ మేరకు మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. 53 మున్సిపాలిటీలు, 3 మున్సిపల్‌ కార్పొరేషన్ల పాలకవర్గాల గడువు జూలై 2తో ముగిసిందని, ఈ లోగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికలు నిర్వహించాల్సిందిగా గతేడాది డిసెంబర్‌ 31న, ఈ ఏడాది మార్చి 28న ప్రభుత్వానికి లేఖలు రాసినా ఫలితం లేకపోవడంతో కోర్టుకెక్కింది. ఎన్నికల ప్రక్రియ చేపట్టేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కూడా మరో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలను బుధవారం విచారిస్తామని న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు పేర్కొన్నారు.  

అన్నింటికీ ఒకేసారి.. కష్టం! 
53 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లలో ఒక్క గ్రామపంచాయతీ విలీనం కూడా కాలేదని, వీటి ఎన్నికల విషయంలో ఉత్తర్వులు జారీ చేస్తే అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అఫిడవిట్‌లో హైకోర్టుకు నివేదించారు. జవహర్‌నగర్, నిజాంపేట, కొంపల్లి, మణికొండ, నార్సింగ్, బండ్లగూడ జాగీర్‌ మున్సిపాలిటీలుగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏర్పడ్డాయి. బడేపల్లి (జడ్చర్ల) నకిరేకల్‌ మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు వచ్చే ఏడాది డిసెంబర్‌ 15 వరకు ఉంది. గుండ్లపోచంపల్లి పాలకవర్గం గడువు జూన్‌ 1తో ముగిసిందన్నారు.

పాలకవర్గాల గడువు ముగిసిపోతున్నందున వాటన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కష్టమవుతుందని కౌంటర్‌లో తెలిపారు. ‘సమీపంలోని చిన్న గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడం, మేజర్‌ గ్రామాల్ని కొత్త మున్సిపాలిటీలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని జనవరి 19న జిల్లా కలెక్టర్లను ఆదేశించాం. దీంతో రాష్ట్రంలోని 131 గ్రామాలను సమీపంలోని 42 మున్సిపాలిటీలు, 173 గ్రామాలను 68 మున్సిపాలిటీలుగా మార్చాం. వీటికి ఎన్నికలు నిర్వహించాలంటే ఆయా గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు పూర్తి కావాలి. ఈలోగానే 14 పంచాయతీలను మున్సిపాలిటీలుగా చేయడాన్ని, 28 గ్రామాల్ని మున్సిపాలిటీల్లో విలీనం చేయొద్దన్న రిట్లను గత మార్చి 8న హైకోర్టు తోసిపుచ్చింది’అని అరవింద్‌ కుమార్‌ హైకోర్టుకు తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top