ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వేటినీ ఆచరణలో అమలు చేయకుండా... వాటి ప్రచారానికే ఎన్డీయే ప్రభుత్వం పరిమితమైందని ఏఐసీసీ అధికారప్రతినిధి, ఎంపీ రాజీవ్ గౌడ విమర్శించారు.
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వేటినీ ఆచరణలో అమలు చేయకుండా... వాటి ప్రచారానికే ఎన్డీయే ప్రభుత్వం పరిమితమైందని ఏఐసీసీ అధికారప్రతినిధి, ఎంపీ రాజీవ్ గౌడ విమర్శించారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీతో కలసి సోమవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. యూపీఏ ఏడాది పాలన అంతా మాట లు, ప్రచారం, మోదీ విదేశీ పర్యటనలతోనే గడిచిపోయిందని వ్యాఖ్యానించారు. యూపీఏ అమలుచేసిన పథకాలకు పేర్లు మార్చి తమ పథకాలుగా చెప్పుకుంటోందని.. పేర్ల మార్పిడి ప్రభుత్వంగా మిగిలిపోతోందని ఎద్దేవా చేశారు.
మోదీ వైఫల్యాలపై దేశవ్యాప్త ప్రచారం చేస్తామని చెప్పారు. ఈ ఏడాదిలో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు. యూపీఏ హయాంలో ఆర్థికవ్యవస్థ నిలకడ వృద్ధిని సాధించిందన్నారు. ప్రపంచస్థాయిలో ఎన్నో ఆర్థికసంక్షోభాలు వచ్చినా భారత్‌ను ఏమీ చేయలేకపోవడానికి అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ అనుసరించిన విధానాలే కారణమని రాజీవ్‌గౌడ వివరించారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలపై కేంద్రం ఎలాంటి చర్యలనూ తీసుకోవడం లేదన్నారు. రైతులకు అండగా ఉండటానికి రాహుల్ పాదయాత్ర చేశారన్నారు.