కిక్కిరిసిన కేస్లాపూర్‌

Nagoba Temple - Sakshi

జాతరను తలపించిన నాగుల పంచమి పూజలు

నాగోబాను దర్శించుకున్న  ఎంపీ నగేశ్, ఏటీడబ్ల్యూ చైర్మన్‌ లక్కేరావు

ఇంద్రవెల్లి(ఖానాపూర్‌) : నాగుల పంచమి పండుగ సందర్భంగా బుధవారం మండలంలోని కేస్లాపూర్‌ నాగోబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. భారీగా తరలిరావడంతో జాతరను తలపించింది. ఉదయం నుంచే మండలంలోపాటు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు, మెస్రం వంశీయులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేష్, ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్‌ కనక లక్కేరావు హాజరై నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

మెస్రం వంశీయులు నాగుల పంచమి పండుగ సందర్భంగా సంప్రదాయ పద్ధతిలో వండిన జొన్న గట్కాను వారి ఆచారం ప్రకారం మోదుగ ఆకుల్లో భోజనం చేశారు. ఆలయ పరిసర ప్రాంతంలో దుకాణాలు, రంగుల రాట్నాలు, సర్కస్‌లు ఏర్పాటు చేయడంతో భక్తులు ఉల్లాసంగా గడిపారు.  మొదటి రోజు నాగుల పంచమి పూజలకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ముత్నూర్‌ నుంచి కేస్లాపూర్‌ వరకు మూడు కిలోమీటర్ల వరకు ట్రాపిక్‌ జాం అయింది. దీంతో ముత్నూర్‌ నుంచి కాలనడకన నాగోబా ఆలయానికి వెళ్లి భక్తులు పూజలు చేశారు. నాగుల పంచమి పూజలు గురువారం వరకు కొనసాగుతాయని మెస్రం వంశీయులు తెలిపారు.

ఆకట్టుకున్న ఆటల పోటీలు

ఈ సందర్భంగా శ్రీ నాగోబా యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటల పోటీలు అకట్టుకున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచే కాక మహారాష్ట్రలోని కిన్వట్‌ తదితర ప్రాంతాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. సుమారు 20కు పైగా వాలీబాల్‌ జట్లు, 42 కబడ్డీ జట్లు పాలొగన్నాయి. ఈ పోటీలను ఎంపీ గోడం నగేశ్, ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్‌ కనక లక్కేరావు ప్రారంభించారు.

కార్యక్రమంలో ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్, జెడ్పీటీసీ దేవ్‌పూజే సంగీత, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు గడ్గే సుబాష్, కృష్ణకుమార్, పెందోర్‌ తులసీరాం, జీవీ రమణ, నాగోబా ఆలయ కమిటీ చైర్మన్‌ మెస్రం ఆనంద్‌రావ్, మాజీ సర్పంచ్‌ మెస్రం నాగ్‌నాథ్, మెస్రం వంశీయులు మెస్రం చిన్ను, మెస్రం హనుమంత్‌రావ్, కోసు, మెస్రం వంశం ఉద్యోగస్తులు మెస్రం శేఖర్, మెస్రం దేవ్‌రావ్‌ ఉన్నారు. 

పోలీసు భారీ బందోబస్తు

కేస్లాపూర్‌ నాగోబా ఆలయంలో పూజలకు వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉట్నూర్‌ సీఐ వినోద్‌ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ట్రాపిక్‌ సమస్య తలెత్తకుండా ముత్నూర్‌ నుంచి కేస్లాపూర్‌ వరకు ప్రత్యేకంగా పోలీసులతో గస్తీ ఏర్పాటు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top