ఆ ఇంట ఆనందిని | nadini is safe now in ranga reddy district | Sakshi
Sakshi News home page

ఆ ఇంట ఆనందిని

Jan 14 2015 9:42 AM | Updated on Oct 8 2018 5:04 PM

బోరుబావిలో పడిన బాలిక క్షేమంగా బయటపడింది.

పరిగి, కుల్కచర్ల: బోరుబావిలో పడిన బాలిక క్షేమంగా బయటపడింది. బావిలోని ఓ రాయి ఆ చిన్నారి ప్రాణం నిలిపింది. బోరుబావిలో 10 ఫీట్ల లోతులో ఉన్న రాయి చిన్నారిని మరింత కిందకు జారకుండా ఆపింది. దీంతో సహాయక చర్యలు వేగంగా చేపట్టి జిల్లా యంత్రాంగం నందిని అలియాస్ అంజలిని(6) ప్రాణాలతో కాపాడగలిగింది. మంగళవారం సాయంత్రం జిల్లాలో సంచలనం రేపిన ఈ సంఘటన చివరకు సుఖాంతమైంది.
 
మహబూబ్‌నగర్ జిల్లా కోస్గీ మండల పరిధిలోని ముదిరెడ్డిపల్లి తండాకు చెందిన లక్ష్మణ్, బుజ్జిబాయి దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఆ నలుగురిలో నందిని(6) వారికి చివరి సంతానం. బతుకుదెరువు కోసం లక్ష్మణ్ దుబాయికి బుజ్జిబాయి పూణె వలస వెళ్లారు. అయితే కుమారులు పెద్దవాళ్లు కావడంతో ముదిరెడ్డిపల్లి తండాలోనే ఉంటూ చదువుకుంటున్నారు. ఇక ఇద్దరు కుమార్తెలు చిన్నవారు కావడంతో వారిని గోవిందుపల్లిలోని తన తల్లిగారింట వదిలి బుజ్జిబాయి వలస వెళ్లింది. ఈక్రమంలో మంగళవారం అమ్మమ్మ సీతాబాయి, తాత భోజ్యానాయక్‌లు తండా సమీపంలోని పొలంలో పనికి వెళ్లగా నందిని(6) కూడా వారితోపాటే వెళ్లింది. అప్పటివరకు అక్కడ ఆడుకున్న బాలిక సాయంత్రం సమయంలో కనిపించలేదు. ఇంటికి వెళ్లి ఉండవచ్చని ఊహించి వారిద్దరూ తండాకు వచ్చారు. అయితే సాయంత్రం 6 గంటల వరకు కూడా అక్కడ చిన్నారి జాడ లేకపోవడంతో ఆందోళనకు గురైన వృద్ధులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతుక్కుంటూ మళ్లీ పొలానికి వెళ్లారు. పొలంలో ఉన్న బోరుబావిలో శబ్దాలు వినిపించగా అందులో పరిశీలించారు. ఆ బావి నుంచి మరింత స్పష్టంగా నందిని ఏడుపు వినిపిస్తుండటంతో చిన్నారి అందులో పడిపోయిందని స్పష్టమైంది.
 
 రెండున్నర గంటలపాటు సహాయక చర్యలు
 చిన్నారి బావిలో చిక్కుకున్న వార్త మీడియాకు తెలియడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చిన్నారి ప్రాణాలకు కోసం ప్రార్థించారు. కొన్ని రోజుల క్రితం మంచాలలో జరిగిన బోరుబావి ఘటన మరవక ముందే జిల్లాలో మరో ఘటన చోటు చేసుకోవడం జిల్లా ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. గతంలో మంచాలలో కొన్ని రోజులపాటు సాగిన సహాయక చర్యల్లో చివరికి చిన్నారిని ప్రాణాలతో కాపడలేకపోయారు. ఇక ఇక్కడ కూడా ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని జిల్లావాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే బావిని గతంలో పూడ్చడానికి యత్నించినా పని పూర్తి చేయలేదు. ఇక బోరుబావిలో పది ఫీట్ల కింద ఉన్న రాయి చిన్నారి మరింత లోతుకు జారకుండా అడ్డుకుంది.

చిన్నారి బోరుబావిలో పడిందన్న విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ రాములు హుటాహుటినా పోలీసులకు, 108కు సమాచారం అందించారు. ఇక రాత్రి 7 గంటల వరకు జేసీబీ, పోలీసులు, 108 వాహనం ఘటనా స్థలానికి చేరకున్నాయి. 108 సిబ్బంది బోరుబావిలో చిన్నారికి ఆక్సిజన్ అందించగా జేసీబీ బోరుబావికి సమాంతరంగా తవ్వకం ప్రారంభించింది. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో బోరుబావి నుంచి చిన్నారిని విజయవంతంగా బయటకు తీశారు. అయితే చిన్నారి ప్రాణాలకు ఎలాంటి అపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ వెంటనే చిన్నారిని 108లో మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement