రేపు ప్రోటెం స్పీకర్‌ ప్రమాణం

Mumtaz Ahmad will be sworn in as Protem Speaker - Sakshi

రాజ్‌భవన్‌లో సాయంత్రం 5గంటలకు

17 నుంచి శాసనసభ సమావేశాలు 

సాక్షి, హైదరాబాద్‌: మజ్లిస్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ బుధవారం ప్రోటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. చార్మినార్‌ స్థానం నుంచి గెలిచిన ముంతాజ్‌ అహ్మద్‌.. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌లో సాయంత్రం 5 గంటలకు ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ప్రోటెం స్పీకర్‌గా ముంతాజ్‌ అహ్మద్‌ అధ్యక్షతన గురువారం 11.30 గంటలకు కొత్త శాసనసభ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. నూతనంగా ఎన్నికైన శాసనసభ సభ్యులతో ప్రోటెం స్పీకర్‌ ప్రమాణం చేయించనున్నారు. రెండుగంటల పాటు కొనసాగే ఈ కార్యక్రమం తర్వాత.. మధ్యాహ్నం జూబ్లీహాల్‌ ప్రాంగణంలోని కౌన్సిల్‌ లాన్స్‌లో శాసనసభ సభ్యులకు ప్రభుత్వం విందు ఏర్పాటుచేసింది. అనంతరం అదేరోజు.. స్పీకర్‌ ఎన్నిక షెడ్యూల్‌ ప్రకటన, నామినేషన్ల స్వీకరణ జరపనున్నారు. జనవరి 18న స్పీకర్‌ ఎన్నిక నిర్వహిస్తారు.

తర్వాత కొత్త స్పీకర్‌ అధ్యక్షతన సభాకార్యక్రమాలు సాగుతాయి. స్పీకర్‌ అధ్యక్షతన శాసనసభ సలహా సంఘం (బీఏసీ) సమావేశమై ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగంపై (19న) నిర్ణయం తీసుకోనుంది. జనవరి 20న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టడం, దానికి సభ ఆమోదం తెలపడం జరుగుతుంది. మొత్తంగా జనవరి 17 నుండి 20 వరకు శాసనసభ కార్యకలాపాలు జరగనున్నాయి. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్‌.. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏకాదశినాడు (జనవరి 17న) శాసనసభ కార్యకలాపాలు ఆరంభించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top