15 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతు

MRPS Give Support To Congress Party In 15 MP Seats - Sakshi

నాగర్‌కర్నూల్‌లో మల్లు రవిని ఓడించాలని పిలుపు 

సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డికి మద్దతు 

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ 

జడ్చర్ల టౌన్‌: రాష్ట్రంలో ఈ నెల 11న జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో తాము నాగర్‌కర్నూల్, సికింద్రాబాద్‌ మినహా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన 15 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. శనివారం సాయంత్రం జడ్చర్లలోని చంద్రగార్డెన్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై విశ్వాసం ఉంచి పార్లమెంట్‌ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నామన్నారు.

అయితే సికింద్రాబాద్‌ స్థానంలో బీజేపీ నుంచి కిషన్‌రెడ్డి పోటీలో ఉన్నారని, ఆయన తమ ఉద్యమానికి ముందు నుంచి మద్దతు పలకడం వల్ల ఆయనకు మద్దతు ఇస్తున్నామన్నారు. పార్లమెంట్‌ పరిధిలో ఎమ్మార్పీఎస్‌ తరపున కిషన్‌రెడ్డి గెలుపు కోసం పనిచేస్తామన్నారు. అలాగే నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి మాదిగ వర్గానికి చెందిన సిట్టింగ్‌ ఎంపీ నంది ఎల్లయ్యను తప్పించి మాల వర్గానికి చెందిన మల్లు రవికి టికెట్‌ ఇచ్చినందున మద్దతు ఇవ్వడం లేదన్నారు. ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో నిమగ్నమైనందున ఆలస్యంగా వచ్చి ముఖ్యకార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం ప్రకటన చేస్తున్నామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వ్యక్తి ఎంపీగా ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. ఈ కారణంగానే తాము నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ స్థానంలో మల్లు రవికి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించామన్నారు.

గతంలో మందా జగన్నాథం, నంది ఎల్లయ్య వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించారని, అలాంటి స్థానం నుంచి తాము మల్లు రవికి ఎలా మద్దతు ఇస్తామని ప్రశ్నించారు. ఆ పార్లమెంట్‌లో బరిలో ఉన్న ఇద్దరు మాదిగల్లో ఎవరికి మద్దతు ఇస్తామనేది ఈ నెల 9న ప్రకటిస్తామన్నారు. ఏపీలో తాము నోటాకు ఓటేస్తున్నామని, అన్ని పార్టీలు తమను మోసం చేసినందుకే అలా చేస్తున్నామని ప్రకటించారు. అంతకు ముందు ఆయన మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌లోని ముఖ్య నాయకులతో విడివిడిగా సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగయ్య, వెంకటయ్య, నాగరాజు, బాలరాజు, శ్రీను, జాతీయ నాయకులు నిరంజన్, శివ, విష్ణు, విల్సన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top