వరాల..వాన

MP Kavitha Talk On Union Budget 2019 - Sakshi

సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో వరాల జల్లు కురిసింది. రైతులు, కార్మికులు, ఉద్యోగులతో పాటు మధ్య తరగతి ప్రజలకు ఊరట నిచ్చింది. ముఖ్యంగా రైతులకు బలమైన ఊరట, వేతన జీవికి పన్ను మినహాయింపులు భారీగా లభించాయి. త్వరలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ప్రజలందరినీ ఆకట్టుకునేలా.. అందరికీ ప్రయోజనం కలిగించేలా పలు అంశాలను ఈ 2019–20 తాత్కాలిక బడ్జెట్‌లో చేర్చారు. అందరికీ మేలు జరిగేలా బడ్జెట్‌ ఉంటుందన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన ‘ఎన్నికల’ల బడ్జెట్‌ను పీయూష్‌ గోయల్‌ ద్వారా శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

ఈ బడ్జెట్‌లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన పలువురు రైతులు, కార్మికులు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధుకు తోడు ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా పేద రైతులకు ఏడాదికి రూ.6వేలు మూడు విడతల్లో ఇవ్వనున్నట్లు ప్రకటించడం ఊరట. అలాగే అసంఘటిత కార్మికులకు పెన్షన్, ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు, రైతుల కోసం కేంద్రం పద్దుల్లో పెద్దపీట వేసింది. ఈ బడ్జెట్‌పై మొత్తంగా అన్నివర్గాల నుంచి సంతృప్తి వ్యక్తమవుతుండగా.. కొన్ని రాజకీయ పక్షాలు మాత్రం ఓట్లను రాబట్టే ఎన్నికల బడ్జెట్‌గా వర్ణిస్తున్నాయి.

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో గుంట నుంచి 1.25 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు 2,74,368 మంది కాగా, 1.25 నుంచి 2.5 ఎకరాలున్న వారు 1,72,669 మంది, 2.5 నుంచి 5 ఎకరాలున్న వారు 1,45,008 మంది రైతులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.6000 నగదు బదిలీ పథకం వల్ల మొత్తం 5,92,045 మందికి లబ్ది చేకూరనుంది. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ఐదెకరాల్లోపు భూమి ఉండే ప్రతి రైతుకు మూడు వాయిదాల్లో ఈ మొత్తం వారి ఖాతాలకు బదిలీ చేయనున్నారు.

ఈ పథకం 2018 డిసెంబర్‌ నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొనడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. 
రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌కు రూ.750 కోట్ల కేటాయించగా, దీంతో పాటు పాడిపరిశ్రమ, మత్స్య పరిశ్రమకు చెందిన రైతులు తీసుకొన్న కిసాన్‌ క్రెడిట్‌ కార్డు రుణాలపై 2శాతం వడ్డీ రాయితీ లభించనుంది. ప్రకృతి విపత్తులకు గురైన ప్రాంతాల్లోని రైతులు తీసుకొన్న రుణాలపై 2శాతం వడ్డీ రాయితీ, సకాలంలో చెల్లింపులు చేసిన వారికి 3శాతం వడ్డీ రాయితీ వర్తింపజేయనుండటం శుభపరిణామం.

అసంఘటిత కార్మికులకు అండ..
అసంఘటిత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం కొత్త పింఛన్‌ పథకం ప్రకటించింది. ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్‌ పేరుతో ప్రవేశపెట్టనున్న ఈ పింఛన్‌ పథకం ద్వారా 60 ఏళ్లు నిండిన వారందరికీ నెలకు రూ.3వేలు పింఛన్‌ రానుంది. ఇందుకోసం నెలకు రూ.100 చొప్పున కార్మికులు ప్రీమియం చెల్లించాలి. దీనిద్వారా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 12,45,806 మందికి మేలు జరుగనుంది. ఇందులో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కూలీల సంఖ్య 5,84,654 మంది ఉండగా, భవనాలు, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం తదితర రంగాల్లో 6,61,052 మంది కార్మికులు ఉన్నట్లు ప్రభుత్వ నివేదికల ద్వారా తెలుస్తోంది.

వేతనజీవులకు ఊరట...
వేతన జీవులకు, పింఛన్‌దారులకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ఊరట కల్పించింది. ఆదాయపు పన్ను పరిమితిని రూ.5లక్షలకు పెంచింది. వార్షిక ఆదాయం రూ.5లక్షల వరకూ ఉన్న వారు ఇకపై ఆదాయపుపన్ను చెల్లించనవసరం లేదు. పొదుపు, పెట్టుబడులతో కలిపి రూ.6.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిమితి రూ.40వేల నుంచి రూ.50వేలకు పెంచారు. పోస్టల్, బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్‌ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. టీడీఎస్‌ పరిమితి రూ.10 వేల నుంచి రూ.40 వేలకు పెంచారు.

మహిళలు, మహిళా ఉద్యోగులకు భరోసా...
మహిళల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వారి అనేక రాయితీలను ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాలలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఇప్పటికే 6కోట్ల మందికి ఎల్‌పీజీ కనెక్షన్లు ఇచ్చిన కేంద్రం మరో రెండు కోట్ల కనెక్షన్లను ప్రకటించింది. దీంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సుమారు 30 వేల వరకు కనెక్షన్లు రానున్నాయి. మాతృత్వయోజన పథకం కింద మహిళ ఉద్యోగులకు 26 వారాల సెలవులు ఇవ్వడం హర్షనీయం. సుమారు 23,478 మంది మహిళ ఉద్యోగులకు 26 వారాల సెలవు దినాలు వర్తించనున్నాయి.

అంగన్‌వాడీలకు పెరగునున్న వేతనం
మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న మహిళా టీచర్లు, ఆయాలకు వేతనాలను 50 శాతం పెంచడం వల్ల ఉమ్మడి జిల్లాలో 6,235 మంది వేతనాలు పెరగనున్నాయి. అంగన్‌వాడీ టీచర్లకు రూ.10,500 వస్తుండగా రూ.1,500 పెంచినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా ఇంకా అమల్లోకి రావడం లేదు. అదేవిధంగా ఆయాలకు రూ.7,500లకు అదనంగా రూ.750 పెంచినట్లు ప్రకటించినా, ప్రస్తుతం రూ.7,500 వస్తోంది.

కొత్తపల్లి–మనోహర్‌బాద్‌ లైన్‌కు రూ.200 కోట్లు...
ఈ బడ్జెట్‌లో రైల్వేశాఖకు రూ.64,587 కోట్లు కేటాయించినట్లు పేర్కొనగా... గతంతో పోలిస్తే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు బాగానే విదిల్చారు. కరీంనగర్‌ జిల్లా పరిధిలోని కొత్తపల్లి నుంచి మనోహరాబాద్‌ 150 కిలోమీటర్ల దూరం రైల్వేలైన్‌ను 2006–07లో ప్రతిపాదించారు. ఆ సమయంలో దాని ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,160 కోట్లు. గడిచిన నాలుగేళ్లుగా ప్రతీ ఏటా రూ.137 కోట్లు కేటాయించగా ప్రస్తుతం మొదటి విడతలో భాగంగా 32 కిలోమీటర్ల దూరం వరకు మనోహరాబాద్‌–గజ్వేల్‌ మధ్య పనులు పూర్తయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులకు రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రతిపాదించారు. 
కాజీపేట–బల్హర్షా మధ్య 202 కిలోమీటర్ల దూరం వరకు మూడవ రైల్వే ట్రాక్‌ ఏర్పాటు చేయాలని 2015–16వ ఆర్థిక సంవత్సరంలోనే నిర్ణయించి రూ.2,063 కోట్లు అంచనా వేశారు. గడిచిన నాలుగేళ్లుగా రూ.360 కోట్లు కేటాయించగా ప్రస్తుత పనుల నిమిత్తం రూ.265 కోట్లు కేటాయించేందుకు ప్రతిపాదించారు. ఇప్పటికే రాఘవపూర్‌ నుంచి మందమర్రి వరకు మూడవ రైల్వే ట్రాక్‌ వినియోగంలోకి రాగా రాఘవపూర్‌–పొత్కపల్లి–బిజిగిరిషరీఫ్‌–ఉప్పల్‌ మధ్య రెండవ విడత పనులు చేపట్టేందుకు నిధులను కేటాయించాలని ప్రతిపాదించారు.

రైతుబంధును కాపీ కొట్టిన కేంద్రం
తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని కేంద్రం కాపీ కొట్టింది. ఈ బడ్జెట్‌ ఓటర్లను ఆకట్టుకునేలా ఉంది. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రాజకీయ లబ్దికి ప్రాధాన్యం ఇచ్చారు. బడ్జెట్‌లో చెప్పిన అంశాలు అమలు కావడం సాధ్యం కాదని తెలిసినా ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి అమలులో ఇబ్బందులు వస్తాయి. రాష్ట్రానికి రావాల్సిన వాటిని ఐదేళ్లలో చాలా సాధించాం. చట్టంలో లేకపోయినా తెలంగాణకు ఎయిమ్స్‌ సాధించాం. ఇంకా చాలా అంశాలకు సంబంధించి గెజిట్‌ విడుదల కావాల్సి ఉంది. – బోయినపల్లి వినోద్‌కుమార్, కరీంనగర్‌ ఎంపీ

కేసీఆర్‌ పథకాలను  ఫాలో అయిన కేంద్రం
కేసీఆర్‌ ఆలోచనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ లాభం జరుగుతున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. మన రాష్ట్రంలో ఎకరానికి, ఫసల్‌కు రూ.5వేలు ఇస్తున్నం. కేంద్రం మాత్రం రెండున్నర హెక్టార్లకు అంటే 5 ఎకరాలకు రూ.6వేల చొప్పున ఇచ్చేలా బడ్జెట్‌లో ప్రవేశపెట్టింది. సంస్కరణలు చేపట్టాం.. సంక్షేమం చేస్తున్నామని బీజేపీ నేతలు చెబుతున్నరు. కానీ నల్లధనం ఎంత మేరకు వెనక్కి తీసుకువచ్చారో... నోట్ల రద్దు తర్వాత ఎన్ని డబ్బులు తిరిగి వచ్చాయో  చెప్పలేని పరిస్థితి. అయితే సంక్షేమం అని చెప్పి తెలంగాణ మోడల్‌ మొత్తం తీసుకున్నరు సంతోషం. – కల్వకుంట్ల కవిత, నిజామాబాద్‌ ఎంపీ

ఓట్ల కోసమే మభ్యపెట్టే బడ్జెట్‌
కేంద్ర బడ్జెట్‌ తీరు చూస్తుంటే ప్రజలను మభ్యపెట్టి మరోసారి అధికారంలోకి వచ్చేందుకే చేసిన ప్రయత్నంగా కనబడుతోంది. నాలుగున్నరేళ్లుగా రైతాంగం సమస్యలపై ఊసేత్తని బీజేపీ సర్కార్‌ ఒక్కసారిగా రైతుల కోసం ఎకరాకు రూ.6వేలు అంటూ వరాలు కురిపించడం రానున్న ఎన్నికల్లో లబ్ది పొందేందుకేనని అర్థమవుతోంది. మోడీ అధికారంలోకి వచ్చాక వంటనూనె, చక్కెర, పప్పుధాన్యాలను దిగుమతి చేసుకున్నారు. ఈ దిగుమతులు వ్యవసాయరంగ సంక్షోభాన్ని తెలుపుతున్నాయి. కాంగ్రెస్‌ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడితే మోడీ సర్కార్‌ నిర్వీర్యం చేసింది. –కటుకం మృత్యుంజయం, డీసీసీ అధ్యక్షుడు 
 
సామాన్యులకు లాభం లేదు.. 

ఇది ఓట్ల బడ్జెట్‌ మాత్రమే. దీంతో సామాన్య ప్రజలకు న్యాయం జరగదు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. ఐదెకరాల లోపు ఉన్న రైతులకు రూ.6వేలు మూడు విడతలుగా చెల్లించడం కంటి తుడుపు మాత్రమే.  ఉద్యోగాలివ్వడంలో విఫలమయ్యారు. రాజ్యాంగ వ్యవస్థలను మోడీ నిర్వీర్యం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మోడీ సర్కార్‌పై ప్రజలు సర్జికల్‌ స్ట్రయిక్‌ చేస్తారు. –అంబటి జోజిరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top