ఎంత పనిచేశావమ్మా !


-

- పసిబిడ్డ గొంతు కోసి, తనూ కోసుకున్న తల్లి

- అంతలోనే పుట్టుకొచ్చిన మమకారం

- బిడ్డను రక్షించాలంటూ వీధుల్లోకి పరుగులు

- తల్లికి తప్పిన ప్రమాదం

- విషమ స్థితిలోనే బాబు

అశ్వారావుపేట : తల్లి క్షణికావేశం పసిబిడ్డ ప్రాణాలనే బలిగొనేందుకు, తానూ తనువు చాలించేందుకు పురిగొల్పింది.



వెంటనే తేరుకుని బిడ్డ ప్రాణాలకు బతికించాలని ఆ తల్లి కన్నీరుమున్నీరైంది. వీధుల వెంట పెరుగెత్తింది. కలకలం రేపిన ఈ ఘటన అశ్వారావుపేట మండలంలోని గాండ్లగూడెం తండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తండాకు చెందిన హలావత్ ప్రియాంక, అదే గ్రామానికి చెందిన భూక్యా చిట్టిబాబు ఏడాదిన్నర క్రితం ఒకరినొకరు ఇష్టపడటంతో ఇరువురి కుటుంబ సభ్యులు వారికి వివాహం జరిపించారు. వీరికి మూడు నెలల క్రితం ఒక బాబు జన్మించాడు. చిట్టిబాబు అదే గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.



మూడు రోజుల క్రితం భార్యాభర్తలు గొడవపడ్డారు. అప్పటి నుంచి ఇద్దరూ ముభావంగా ఉంటున్నారు. కాగా గురువారం ఉదయం చిట్టిబాబు పనికి వెళ్లే సమయానికి అన్నం, కూర వండలేదని ఆగ్రహించి వెళ్లిపోయాడు. దీంతో మనస్థాపానికి గురైన ప్రియాంక ఇంటిలోని బ్లేడుతో కన్నకొడుకు మెడను కోసి, తను కూడా మెడను కోసుకుంది. రక్తస్రావం అధికం కావడంతో మూడు నెలల పండంటి పసికందు ఆర్తనాదాలు అమ్మతనాన్ని గుర్తు చేశాయి. వెంటనే తన బిడ్డను కాపాడండంటూ కేకలు వేస్తూ ఇంటిలో నుంచి బయటకు పరుగులు పెట్టింది.



రక్తమోడుతున్న తల్లీబిడ్డలను చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా నిష్చేష్టులయ్యారు. వెంటనే తేరుకుని ఇద్దరి గొంతులకు గుడ్డలు చుట్టి అశ్వారావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించి తల్లికి ప్రమాదం లేదని చెప్పారు. లేత శరీరం కావడంతో బాబు గొంతు అధికంగా తెగిందని.. శ్వాస అందకపోవడంతో ఆక్సిజన్ అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించాలని సూచించారు.

 

కాగా అశ్వారావుపేట ప్రభుత్వాసుపత్రికి అంబులెన్స్ లేకపోవడంతో దాదాపు గంటకు పైగా బాలుడిని ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలోనే ఉంచారు. అనంతరం 108  ద్వారా సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి నుంచి అంబులెన్స్ ద్వారా ఖమ్మం తరలించారు. బాలుడి పరిస్థితి ఇంకా విషయంగానే ఉందని బంధువులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top