త్వరలో మరిన్ని శిల్పారామాలు

More shilparamam will be soon - Sakshi

చేతివృత్తులకు మరింత ఊతం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఉప్పల్‌ మినీ శిల్పారామాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు

హైదరాబాద్‌: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను సంరక్షించడంతో పాటు చేతి వృత్తుల కళాకారులకు ఉపాధి కల్పించడమే శిల్పారామం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, టూరిజం, సాంస్కృతిక, పురాతత్వశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఉప్పల్‌లో ఏర్పాటుచేసిన మినీ శిల్పారామం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, పశుసంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు.

శిల్పారామాన్ని ఆదరించాలని ఆయన ప్రజలను కోరారు. తెలంగాణలోని అన్ని జిల్లాలు సాంస్కృతిక సాంప్రదాయాలకు నెలవని, దానిని దృష్టిలో పెట్టుకొని ప్రతి జిల్లాకు ఒక శిల్పారామం నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ఉప్పల్‌లో ఏర్పాటుచేసిన శిల్పారామం ఉప్పల్‌ పరిసర ప్రాంతాలైన కాప్రా, ఎల్బీనగర్, ఘట్‌కేసర్, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాలకు ఉల్లాసాన్ని ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ.. కళలను, కళాకారులను, చేతి వృత్తుల మీద ఆధారపడిన వారికి శిల్పారామం తోడుగా ఉంటుందన్నారు.

స్వయం ఉపాధితో పాటు ఆహ్లాదాన్ని కూడా పంచుతుందన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాల ద్వారా ఇక్కడి భగాయత్‌ రైతులు 12 సంవత్సరాలు అనేక ఇబ్బందులు పడ్డారని, కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులంతా ఆనందంతో ఉన్నారని, ఉప్పల్‌ రూపురేఖలు మార్చారని గుర్తు చేశారు. ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుల త్యాగంతోనే మెట్రో రైల్‌ స్టేషన్‌ నిలబడిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో భాగంగా రైతులకు ఎకరానికి వెయ్యి గజాలు, సీలింగ్‌ భూముల రైతులకు 600 గజాల చొప్పున కేటాయించిందని, సీలింగ్‌ భూములకు కూడా వెయ్యి గజాలు కేటాయించాలని, మెట్రోలో భూములు కోల్పోయిన వారికి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని మంత్రులను కోరారు. దానికి సానుకూలంగా స్పందించిన మంత్రులు ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి రైతుల సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే భగాయత్‌ భూముల్లో కొందరికి వీధి పోట్ల ప్లాట్లు లాటరీలో కేటాయించారని వాటిని మార్చాలని కొందరు రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు.

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పందించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్‌ మేకల అనలా హన్మంత్‌రెడ్డి, కార్పొరేటర్‌ గొల్లూరి అంజయ్య, శిల్పారామం ప్రత్యేక అధికారి కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు. మంత్రులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటుచేసిన సాంస్కృతిక కళా ప్రదర్శనలు డప్పులు, డోలు వాయిద్యాలు, నృత్యాలు, ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top