నారాయణపేట... నాలుగు లైన్ల బాట 

MLA Rajender Reddy Foundation Four Lines  Roadworks Narayanpet - Sakshi

నారాయణపేట: ఇటీవలే మనుగడలోకి వచ్చిన నారాయణపేట జిల్లాలో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు రూ.18.65 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. మండలంలోని సింగారం చౌరస్తా నుంచి యాద్గీర్‌ రోడ్డులోని ఎర్రగుట్ట సీమీపం వరకు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులకు ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద శంకుస్థాపన చేశారు.
 
రూ.18.65 కోట్లతో రోడ్డు నిర్మాణం 
సింగారం చౌరస్తా నుంచి యాద్గీర్‌రోడ్డు ఎర్రగుట్ట సమీపం వరకు 5 కిలోమీటర్ల మేర రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించనున్నారు. ఇందుకు గాను 2018 అక్టోబర్‌ 17న జీఓ 566ను ఆర్‌అండ్‌బీ శాఖ విడుదల చేసింది. ఈ మేరకు రూ.18.65 కోట్ల అంచనా వ్యయం కాగా.. టెండర్లు కూడా పూర్తయ్యాయి. ఈ పనులకు సంబంధించి ఈనెల 11వ తేదీన అగ్రిమెంట్‌ కాగా.. ఏడాదిలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.

వాహనదారులకు ఊరట 
నారాయణపేట నూతన జిల్లాలో అభివృద్ధికి తొలి అడుగు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణంతో ఆరంభమైంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే సింగారం చౌరస్తా మక్తల్, నారాయణపేట నియోజకవర్గాలకు కేంద్ర బిందువుగా మారనుంది. మక్తల్‌ నుంచి సింగారం చౌరస్తా 26 కిలోమీటర్లు, మరికల్‌ నుంచి సింగారం చౌరస్తా 26 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే మద్దూర్, కోస్గి మండలాల వారికి సైతం భూనేడ్‌ నుంచి వస్తే వారికి నారాయణపేట అందుకున్నట్లుంది.

సింగారం నుంచి 5 కిలోమీటర్ల వరకు నాలుగులైన్ల రోడ్డు విస్తరణ జరుగుతుండడంతో ఈ ప్రాంత వాహనదారులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న నారాయణపేటలో అంతరాష్ట్ర రహదారిగా నాలుగు లైన్ల విస్తరణ జరగుతుండడంతో ఆటు కర్ణాటక, ఇటు తెలంగాణ ప్రాంత వాహనదారులకు ఊరట లభించనుంది. ఇక పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా హైదరాబాద్, రాయచూర్‌ ప్రాంతాలకు వెళ్లేందుకు రవాణా వ్యవస్థ మెరుగుపడినట్లేనని 
భావిస్తున్నారు.
 
డివైడర్లు.. పచ్చదనం 
నాలుగులైన్ల రోడ్డు 100 ఫీట్ల వెడల్పుతో 5 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా మధ్యలో డివైడర్, బట్లర్‌ఫ్‌లై లైట్లు ఏర్పాటుచేసి మొక్కలు నాటనున్నట్లు అధికారులు తెలిపారు. తద్వారా జిల్లా కేంద్రంలోకి ప్రవేశించే ప్రాంతం సుందరంగా మారుతుందని భావిస్తున్నారు.

‘పేట’ అభివృద్ధికి శుభపరిణామం 
నారాయణపేట కొత్త జిల్లాలో నాలుగులైన్ల రోడ్డు నిర్మాణం అభివృద్ధికి శుభపరిణామని ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి అన్నారు. రవాణా వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే వ్యాపార, విద్య రంగాలకు అనువుగా మారుతుందని తెలిపారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు నారాయణపేట కేంద్రబిందువుగా ఉందని.. బంగారం, చేనేత రంగాలు ఇక్కడ ప్రసిద్ధి గాంచాయని వివరించారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట జిల్లాలను అగ్రగామిగా నిలిపేందుకు చేస్తున్న కృషికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె అనసూయ, మార్కెట్‌ చైర్మన్‌ సరాఫ్‌ నాగరాజు, ఆర్‌అండ్‌బీ అధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top