భగీరథ యత్నం

Mission Bhageeratha Works Running Slow  Due To Officials Negligence - Sakshi

కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు సమీపంలో జరుగుతున్న పనులు

100హెచ్‌పీ సామర్థ్యం కలిగిన 25మోటార్ల ద్వారా నీటి ఎత్తిపోతలు  

త్వరలోనే ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల ప్రజలకు తాగునీరు

కొల్లాపూర్‌ : ఇంటింటికి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు సమీపంలో మిషన్‌భగీరథ కోసం కృష్ణానది నీటిని ఎత్తిపోసేందుకు నెలరోజులుగా అధికారులు పనులు నిర్వహిస్తున్నారు. కృష్ణానది బ్యాక్‌వాటర్‌ ఆధారంగా నిర్మించిన మిషన్‌ భగీరథ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 14 నియోజకవర్గాలు, రంగారెడ్డి జిల్లాలో 3 నియోజకవర్గాల్లోని మొత్తం 81మండలాలకు రక్షిత తాగునీరు అందించేందుకు ఎల్లూరులో మిషన్‌ భగీరథ పనులు చేపట్టారు. రూ.5,478 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఎల్లూరు వద్ద రూ.120కోట్ల వ్యయంతో పంప్‌హౌజ్, ఫిల్టర్‌బెడ్స్‌ నిర్మించారు. ప్రతి ఏడాది 10 టీఎంసీల కృష్ణానది నీటిని వినియోగించే విధంగా పనులు పూర్తిచేశారు. ప్రాజెక్టుకు మొదట్లో కోతిగుండు ప్రాంతం నుంచి కృష్ణానది నీటిని పంపింగ్‌ చేయాలని అధికారులు భావించారు. తర్వాత కేఎల్‌ఐ ప్రాజెక్టులోని ఎల్లూరు రిజర్వాయర్‌ నుంచి నీటిని వాడుకునే విధంగా ప్రణాళికలు తయారుచేశారు.  

రెండు నెలలుగా నీటి సరఫరా.. 
కేఎల్‌ఐ ప్రాజెక్టులో భాగమైన ఎల్లూరు రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్థ్యం కేవలం 0.35టీఎంసీలు మాత్రమే. కేఎల్‌ఐ ప్రాజెక్టు మోటార్ల ద్వారా ఈ రిజర్వాయర్‌ను నింపి, అక్కడి నుంచి మిషన్‌ భగీరథ పరిధిలోని గ్రామాలకు నీటిని సరఫరా చేపడుతున్నారు. ఈ ఏడాది జనవరిలోనే నీటివిడుదల చేపట్టాలని ప్రభుత్వం భావించినప్పటికీ పనుల్లో జాప్యం, సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యమైంది. అయితే ఇటీవల కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు అధికారులు తాగునీటి సరఫరా చేపట్టారు. కొల్లాపూర్‌ మున్సిపాలిటీతో పాటు కొన్ని గ్రామాలకు రెండు నెలలుగా మిషన్‌ భగీరథ నీళ్లు అందుతున్నాయి. ప్రాజెక్టు పనులు దాదాపుగా పూర్తికావడంతో ఈ నెలాఖరులోగా మిషన్‌ భగీరథ పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు నీటిని సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు. 

తగ్గిన నీటిమట్టం కారణంగా..
కృష్ణానదిలో నీటిమట్టం తగ్గిపోవడంతో కేఎల్‌ఐ అప్రోచ్‌ చానల్‌కు నీళ్లు అందడం లేదు. రెండు నెలల క్రితం వరకూ కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా నీటిని పంపింగ్‌ చేసి ఎల్లూరు రిజర్వాయర్‌ను నింపారు. ఈ నీళ్లనే కొల్లాపూర్‌ నియోజకవర్గానికి సరఫరా చేస్తున్నారు. నెల వ్యవధిలోనే సగం రిజర్వాయర్‌ ఖాళీ అయ్యింది. అప్రోచ్‌చానల్‌కు నీళ్లు అందేలా కిలోమీటర్‌ లోపల అధికారులు అడ్డుకట్టలు వేశారు. అయినా పంపింగ్‌కు సరిపోయినన్ని నీళ్లు రాకపోవడంతో కేఎల్‌ఐ ప్రాజెక్టుకు 2.3కి.మీ.దూరంలో కోతిగుండు వద్ద అడ్డుకట్ట నిర్మాణానికి చర్యలు చేపట్టారు. 

నెలరోజులుగా పనులు  
కోతిగుండు ప్రాంతంలో నది బ్యాక్‌వాటర్‌లో ప్రస్తుతం అడ్డుకట్ట నిర్మిస్తున్నారు. ఇందుకోసం రూ.6కోట్ల నిధులు కేటాయించారు. నెల రోజులుగా పనులు కొనసాగుతున్నాయి. నీటిపారుదల శాఖ, మిషన్‌ భగీరథ అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఎప్పటికప్పుడు పనుల ప్రగతిని సమీక్షిస్తున్నారు. అడ్డుకట్ట వేసిన ప్రాంతం వరకు విద్యుత్‌ లైనింగ్‌ పనులు చేపట్టారు. కేఎల్‌ఐ ప్రాజెక్టు సబ్‌స్టేషన్‌ నుంచి విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసున్నారు. 150స్తంభాలను పాతారు. వైరింగ్‌ పనులు జరుగుతున్నాయి. అడ్డుకట్టపై 100హెచ్‌పీ సామ ర్థ్యం కలిగిన 25 పంప్‌మోటార్లను బిగించి నీటిని కేఎల్‌ఐ అప్రోచ్‌చానల్‌లోకి ఎత్తిపోసే విధంగా పనులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అడ్డుకట్టపై రోలింగ్‌ పనులు సాగుతున్నాయి.

త్వరలోనే మోటార్ల ఏర్పాటు
కృష్ణానది నీటిమట్టం తగ్గిపోవడంతో కోతిగుండు నుంచి పంప్‌ మోటార్ల ద్వారా మిషన్‌భగీరథకు నీటిని పంపింగ్‌ చేసే విధంగా పను లు చేపట్టాం. నీటి మట్టం తగ్గినప్పుడు ఈ కట్టపై మోటార్లు ఏర్పాటుచేసి పంపింగ్‌ చేస్తాం. వరదలు వచ్చే సమయానికి మళ్లీ మోటార్లను ఒడ్డుకు చేర్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుతం అడ్డుకట్టను పటిష్టంగా నిర్మించేందుకు రోలింగ్‌ పనులు జరుగుతున్నాయి. మూడు రోజుల్లో మోటార్లు ఎల్లూరుకు చేరుకుంటాయి. త్వరగా పనులు పూర్తిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. నీటి ఎత్తిపోత ప్రారంభమైన వెంటనే ప్రాజెక్టు పరిధిలోని మిగతా నియోజకవర్గాలకు కూడా నీటి సరఫరా చేపడతాం. 
– రాజు, డీఈఈ  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top