పోస్టింగ్‌ కోసం కేటీఆర్‌ సంతకం ఫోర్జరీ!

Minister KTR Signature Forgery In Nalgonda - Sakshi

ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌ పోస్టు కోసం ప్రయత్నం

మంత్రి కేటీఆర్‌ ఇచ్చినట్లుగా రికమెండేషన్‌ లెటర్‌ సృష్టి

ఫోర్జరీ లేఖతో ఆ పోస్టులో కొనసాగుతున్న ఓ మహిళా అధికారి

అన్నీ తెలిసి చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు

ముందుగా ఆమె ఓ స్కూల్‌కు ప్రధానోపాధ్యాయురాలు.. ఆ విధులను పక్కన పెట్టి జిల్లా కేంద్రంలోనే సుదీర్ఘంగా వివిధ పోస్టుల్లో ఇన్‌చార్జ్‌ అధికారిగా కొనసాగారు. తాను ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న జిల్లా ఓపెన్‌ స్కూల్స్‌ కో–ఆర్డినేటర్‌ పోస్టులోనే కొనసాగేందుకు ఏ అధికారీ చేయకూడని సాహసం చేశారు. ఏకంగా రాష్ట్ర ఐ.టీ., మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్‌) సంతకాన్ని ఫోర్జరీ చేసి ఒక రికమెండేషన్‌ లెటర్‌ సృష్టించి డీఈఓకు అందజేశారు..!!

సాక్షి, నల్లగొండ: జిల్లా ఓపెన్‌ స్కూల్స్‌ కో–ఆర్డినేటర్‌ పోస్టు వ్యవహారం విద్యాశాఖ పరువు తీస్తోంది. ఈ పోస్టులో కొనసాగేందుకు రావులపెంట జెడ్పీ బాలికల హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలిగా ఉన్న మనావత్‌ మంగళ ఓపెన్స్‌ స్కూల్స్‌ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఓ రెండు వారాల కిందట ఆమెను ఇన్‌చార్జ్‌ బాధ్యతలను తొలగించాలని ఓపెన్స్‌ స్కూల్స్‌ సొసైటీ కమిషనర్‌నుంచి జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు అందాయి. కానీ, ఆమెను ఇప్పటికీ అదే పోస్టులో కొనసాగిస్తున్నారు. దీనివెనుక పెద్ద తతంగమే నడిచిందన్న ఆరోపణలు ఉన్నాయి.

ప్రస్తుత కో ఆర్డినేటర్‌ మంగళ స్థానంలో సూర్యాపేట జిల్లాకు చెందిన మరొక ఉపాధ్యాయుడికి ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పజెప్పాలని ఉత్తర్వులు కూడా ఇచ్చారు. కానీ ఆయనను జిల్లా విద్యాశాఖ అధికారి విధుల్లో చేర్చుకోలేదు. అయితే.. ఓపెన్స్‌ స్కూల్స్‌ కో ఆర్డినేటర్‌గా విధులు నిర్వహించడానికి ప్రధానోపాధ్యాయులే అర్హులని, సదరు ఉత్తర్వులు తెచ్చుకున్న ఉపాధ్యాయుడు స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌కు చెందిన వాడు కావడంతో ఎవరిని కొనసాగించాలో తేల్చుకోలేక ఆ స్కూల్‌ అసిస్టెంట్‌ను విధుల్లో చేర్చుకోలేదని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

కాగా, తననే ఆ పోస్టులో కొనసాగించాలని, మంత్రి సిఫారసు లేఖ తెచ్చుకుంటానని ఇన్‌చార్జ్‌ కోఆర్డినేటర్‌... డీఈఓను కోరడంతో గడువు ఇచ్చారని సమాచారం. ఈలోగా మంత్రి కేటీఆర్‌ సంతకంతో ఆయన లెటర్‌ హెడ్‌పై ఓపెన్‌ స్కూల్స్‌ సొసైటీ కమిషనర్‌కు లేఖ రాసినట్లు ఓ నకిలీ రికమెండేషన్‌ లేఖను సృష్టించారు. ఆ లేఖలో.. రావులపెంట జెడ్పీ గర్ల్స్‌ హైస్కూల్‌ ప్రిన్సిపల్‌ మంగళను జిల్లా కో ఆర్డినేటర్‌గా కొనసాగించాలని సిఫారసు చేస్తున్నట్లు తయారు చేశారు. ఈ లేఖను డీఈఓకు అందజేసి ప్రస్తుతం ఆ మహిళా అధికారి కోఆర్డినేటర్‌ పోస్టులో కొనసాగుతున్నారు. అయితే.. ఈ కొనసాగింపునకు సంబంధించి ఓపెన్‌ స్కూల్స్‌ సొసైటీ కమిషనర్‌ నుంచి జిల్లా విద్యాశాఖ అధికారికి ఎలాంటి ఉత్తర్వులూ అందలేదని సమాచారం. కేవలం ఈ ఫోర్జరీ లేఖ ఆధారంగానే జిల్లా విద్యాశాఖ అధికారి, మంగళ అనే హెచ్‌ఎంను కో ఆర్డినేటర్‌గా కొనసాగిస్తున్నారని విధితమవుతోంది.

మంత్రి కేటీఆర్‌ పేషీ ఆరా !
రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి రికమెండేషన్‌ లెటర్‌ సృష్టించిన వ్యవహారం ఆ మంత్రి పేషీ అధికా రుల దృష్టికి వెళ్లింది. ఈ లెటర్‌ హెడ్‌ మంత్రికి సంబంధించింది కాకపోవడం, సంతకం కూడా మంత్రిది కాదని, ఫోర్జరీ చేశారని గుర్తించిన అధికారులు ఈ విషయాన్ని రాష్ట్ర ఓపెన్స్‌ స్కూల్స్‌ సొసైటీ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. జిల్లా మంత్రి దృష్టికి తీసుకెళ్లకుండా ఒక జిల్లాకు సంబంధించిన పోస్టింగులు, ఇతర పాలనా వ్యవహారాల్లో మరో మంత్రి రికమెండేషన్‌ లెటర్‌ ఇచ్చే అవకాశం లేదని చెబు తున్నారు. ఫోర్జరీ లేఖను సృష్టించిన బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని, ఈ వ్యవహారాన్ని ఆ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. 

ఉమ్మడి జిల్లాలో 80 స్కూళ్లకు అధికారి
ఓపెన్‌ స్కూల్స్‌ పాలనా వ్యవహారాల విషయానికి వస్తే ఉమ్మడి జిల్లాలో ఓపెన్‌ స్కూల్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో 80 స్కూళ్లు నడుస్తున్నాయి. వీటిల్లో పదో తరగతి, ఇంటర్‌మీడియట్‌ క్లాసులను నిర్వహిస్తున్నారు. సెలవు రోజుల్లో ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో ఓపెన్స్‌ స్కూల్‌ విద్యార్థులకు తరగతులు జరుగుతున్నాయి. రెగ్యులర్‌ విద్యార్థులు, ఆ అకడమిక్‌ కేలండర్‌తో సంబంధం లేకుండా ఓపెన్‌ స్కూల్స్‌ విద్యార్థులకు పరీక్షలకు కూడా వేరే సమయాల్లో జరుపుతారు. జిల్లా ఓపెన్‌ స్కూల్‌ సొసైటీకి డైట్‌లో కూడా ఓపెన్‌ కాలేజీ ఉంది. ఈ స్కూళ్లన్నింటినీ కో ఆర్డినేట్‌ చేసే బాధ్యత జిల్లా కో ఆర్డినేటర్‌ది. ఇన్‌చార్జ్‌ పోస్టు కావడంతో అదనపు వేతనం కూడా లభిస్తుంది. అంతే కాకుండా జిల్లా స్థాయి అధికారి పోస్టు కూడా కావడం, పని ఒత్తిడి పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో కో ఆర్డినేటర్‌ పోస్టుకు డిమాండ్‌ పెరిగింది.

క్లారిఫికేషన్‌ కోసం ఉన్నతాధికారులకు లేఖ రాశాం 
ఓపెన్‌ స్కూల్స్‌ కో ఆర్డినేటర్‌గా ఓ స్కూల్‌ అసిస్టెంట్‌కు పోస్టింగ్‌ ఇచ్చిన మాట వాస్తవమే. అయితే.. కో ఆర్డినేటర్‌ పోస్టుకు ప్రధానోపాధ్యాయులు అర్హులు. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులకు లేఖ రాశాం. అందుకే ఆ ఉపాధ్యాయుడిని విధుల్లో చేర్చుకోలేదు. కో ఆర్డినేటర్‌గా తననే కొనసాగించాలని మంగళ మంత్రి నుంచి సిఫారసు లేఖ తీసుకువచ్చారు. దీంతో ప్రస్తుతం ఆమెనే కో ఆర్డినేటర్‌గా కొనసాగిస్తున్నాం.
 – సరోజినీదేవి, డీఈఓ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top