ఎస్సీ, ఎస్టీ చట్టాల బాధ్యత కమిషన్‌దే

Minister Kadiyam Srihari Errolla Srinivas Sworn in Ravindra Bharati  - Sakshi

సంక్షేమ పథకాల అమలు తీరునూ అధ్యయనం చేయాలి:కడియం 

కమిషన్‌ చైర్మన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్‌ బాధ్యతల స్వీకరణ

సాక్షి, హైదరాబాద్‌: షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల కోసం రూపొందించిన చట్టాలను అమలు చేయడంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ పాత్ర కీలకమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరునూ అధ్యయనం చేయాలని, ప్రతి లబ్ధిదారుకు సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా నియమితులైన ఎర్రోళ్ల శ్రీనివాస్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కడియం మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతను శ్రీనివాస్‌ సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఎస్సీ, ఎస్టీల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.  

ప్రతి ఒక్కరికీ అవకాశం
టీఆర్‌ఎస్‌ పార్టీలో ప్రతి కార్యకర్తకు అవకాశం వస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డ శ్రీనివాస్‌కు సీఎం కేసీఆర్‌ ఈ బాధ్యతలు అప్పగించారన్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను కమిషన్‌ అరికట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగితే కమిషన్‌ సహించదని, ఫోన్‌లో లేదా ఎస్సెమ్మెస్‌ పెట్టినా కమిషన్‌ స్పందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, నాయిని నర్సింహారెడ్డి, జోగు రామన్న, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top