కేసీఆర్ సోషనల్ ఇంజినీర్‌: హరీష్‌

Minister Harish Rao Prises CM Kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాలుగేళ్ల ప్రగతి-ప్రాజెక్టుల్లో సాగునీటి నిర్వహణపై ఖైరతాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ కార్యాలయంలో గురువారం రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ ఎస్‌కే జోషీ, నాగార్జునసాగర్, నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు చెందిన ఇంజినీర్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా హారీష్‌రావు మాట్లాడుతూ..‘ ముఖ్యమంత్రి కేసీఆర్ సోషనల్ ఇంజినీర్‌, ఆయనకు వ్యవసాయంపై మంచి అవగాహన ఉంది. సాగునీటి రంగంలో గణనీయమైన ప్రగతి సాధించాం. గత నాలుగేళ్లుగా 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాం. ఈ ఏడాది 10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. విపక్షాలు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా వ్యూహాత్మకంగా అడుగులు వేశాం. ఈ ఏడాది 5 లక్షల 50వేల ఎకరాలకు అదనంగా సాగునీరందించాం. శ్రీరాం సాగర్‌, పోచంపాడు, నిజాం సాగర్ ద్వారా ఒక్కొక్క టీఎంసీకి 13021 ఎకరాలకు నీరందించి చరిత్ర సృష్టించారు.

అధికారుల సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైంది.ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్దతి ద్వారా పంట దిగుబడి పెరిగింది. మహిళా ఇంజినీర్లు కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్తగా 650 మంది ఇంజినీర్లు వచ్చారు. వాళ్లకు సీనియర్లు మార్గనిర్దేశం చేయాలి’ అని హరీశ్‌ రావు సూచించారు. నీటి విడుదల కోసం గతంలో ధర్నాలు, రాస్తారోకోలు జరిగేవని...ఇప్పుడు ఒక్క ధర్నా లేకుండా 13లక్షల 57వేల  ఎకరాలకు నీరిచ్చామని అన్నారు. ఈ సారి జరిగి అసెంబ్లీ సమావేశాల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా తమ ప్రాంతంలో నీళ్లు రావడంలేదని ఫిర్యాదు చేయలేదని తెలిపారు. రైతు గుండెల్లో సీఎం కేసీఆర్‌, ఇంజనీర్లు చిరస్థాయిగా నిలిచిపోతారు. పెద్దపల్లి, మంథని నియోజకవర్గాలకు నీరిచ్చిన ఘనత తమదే’  అని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top