రుణ ప్రణాళిక ఖరారు 

Minalizing Loan Plans Medak Agriculture - Sakshi

సాక్షి, మెదక్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకర్ల వార్షిక రుణ ప్రణాళిక విడుదలైంది. గత ఆర్థిక సంవత్సరం రూ.1,876 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్దేశించుకోగా.. ఈ సారి రూ.2,262 కోట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఆర్థిక సంవత్సరం కంటే రూ.386 కోట్లు అదనంగా కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి రూ.1,850 కోట్లు.. ఇతరత్రా రూ.412 కోట్ల రుణాలను అందజేయనున్నారు.

వ్యవసాయానికి రూ.450 కోట్లు అదనం
2018–19 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి రూ.1,400 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 65 శాతం లక్ష్యాన్ని చేరినట్లు కలెక్టర్‌ ధర్మారెడ్డి వెల్లడించారు. అదేవిధంగా.. ఇతర రుణాల పంపిణీకి సంబంధించి రూ.476 కోట్లు కేటాయించారు. ఇందులో 50 శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యవసాయ రుణాలకు సంబంధించి పంపిణీ లక్ష్యం రూ.1,850 కోట్లు.. ఇతర రుణాలు రూ.412 కోట్లుగా నిర్ధారించారు. వ్యవసాయ రంగానికి రూ.450 కోట్లు పెంచగా.. ఇతర రుణాలకు 64 కోట్లు కోత విధించారు.

రుణ పంపిణీ లక్ష్యాన్ని చేరుకోవాలి : కలెక్టర్‌ 
జిల్లాలోని ప్రతి బ్యాంకు తప్పనిసరిగా తమకు నిర్దేశించిన మేరకు రుణాల పంపిణీ లక్ష్యాన్ని చేరుకుని  జిల్లాను ప్రగతిపథంలో నడిపించేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. మెదక్‌ పట్టణంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం ఆయన బ్యాంకర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణ ప్రణాళికను విడుదల చేశారు. మహిళా సంఘాలు, బ్యాంకు లింకేజీకి సంబంధించిన వాల్‌పోస్టర్లు, మహిళా స్వయం సహాయక సంఘాల 2019–20 వార్షిక ప్రణాళికను సైతం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ బ్యాంకుల వారీగా వ్యవసాయ పంట రుణాల లక్ష్యాలు, సాధించిన పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కొన్ని బ్యాంకులు మినహా ఆశించిన స్థాయిలో రుణాలు మంజూరు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో అయినా లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.

అంతా బ్యాంకర్ల చేతిలోనే..
వ్యవసాయ, ఇతర రుణాల పంపిణీకి సంబంధించి ప్రతి ఏటా రుణ ప్రణాళిక ఖరారు చేస్తున్నారు. అయితే ఎప్పుడు కూడా వందశాతం లక్ష్యాన్ని చేరుకున్న దాఖలాలు లేవు. ఇందుకు బ్యాంకర్లే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. పలు కొర్రీలతో రైతులు, ఇతర వర్గాలకు రుణాలు అందజేయడం లేదనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వ యంత్రాంగం పలుమార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించి హెచ్చరించినప్పటికీ ఫలితం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనైనా పూర్తి స్థాయిలో రుణ లక్ష్యాన్ని చేరుకుంటారా.. లేదా.. అనేది వేచి చూడాల్సిందే.

ప్రతి అధికారి కృషి చేయాలి..
ప్రతి బ్యాంకుకు తమ శాఖ పరిధిలో కొంత రుణ లక్ష్యాన్ని నిర్ధేశించామని.. దీన్ని  చేరుకునేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని కలెక్టర్‌ సూచించారు. ప్రతి బ్యాంకు తప్పనిసరిగా వ్యవసాయ రుణాలను రైతులకు అందజేయాలన్నారు. వ్యవసాయ రుణాల పంపిణీలో కొన్ని బ్యాంకులు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని.. ఇది తగదన్నారు. ప్రతి సమావేశంలో బ్యాంకులు పంపిణీ చేయాల్సిన రుణ లక్ష్యాన్ని వివరిస్తున్నామని.. కొందరు బ్యాంకర్లు దానికనుగుణంగా వ్యవహరించడం లేదన్నారు. ఇదే కొనసాగితే సదరు బ్యాంకులపై చర్యలకు సిఫారసు చేయనున్నట్లు హెచ్చరించారు.

ముద్ర రుణాల పంపిణీలో నిర్లక్ష్యంపై సీరియస్‌..
ప్రభుత్వం చిన్న, మధ్య తరగతి వ్యాపారుల కోసం ముద్ర, స్టాండ్‌ అప్, పీఎంఈజీపీ పథకాల కింద రుణాలను అందజేస్తోందని కలెక్టర్‌ వివరించారు. వ్యాపారులు వీటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందడం ఈ పథకాల ముఖ్య ఉద్దేశమన్నారు. కానీ.. బ్యాంకులు ఈ రుణాల మంజూరులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయన్నారు. ముద్ర రుణాల మంజూరు కోసం తమను ఎవరు సంప్రదించడం లేదని ఒక బ్యాంకు మేనేజర్‌ చెప్పగా.. కలెక్టర్‌ సీరియస్‌ అయ్యారు. ఏ విధమైన సెక్యూరిటీ లేకుండా రూ.50 వేలు ఇచ్చే పథకానికి.. మీ దగ్గరకు ఎవరూ రావడం లేదా.. అని ప్రశ్నించారు. వచ్చే వారికి అనేక రకాలుగా షరతులు విధించడం లేదా.. అంటూ అసహనం వ్యక్తం చేశారు. తమ పరిధిలో లేదు అనే సమాధానాల వల్ల చిరు వ్యాపారులు బ్యాంకుల వద్దకు రావడం మానేశారని కలెక్టర్‌ అన్నారు. 

బ్యానర్‌ ప్రదర్శించండి..
ముందుగా ప్రతి బ్యాంకు తప్పనిసరిగా మా బ్యాంకులో ముద్ర రుణాలు ఇవ్వబడును అనే బ్యానర్‌ ప్రదర్శించాలని ఆదేశించారు. అవసరమున్న వారు బ్యాంకులో సంప్రదించగా.. తిరస్కరించినట్లు తెలిస్తే సంబంధిత బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీటితోపాటు పెండింగ్‌లో ఉన్న స్టాండప్, పీఎంఈజీíపీ రుణాలను త్వరగా అందజేయాలని సూచించారు. ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన కార్యక్రమం కింద జిల్లాలో పంటవేసే ప్రతిరైతు బీమా చేయించుకునేలా చూడాలని, బ్యాంకు అధికారులు ఈ ప్రక్రియపై దృష్టి సారించాలని çకలెక్టర్‌ సూచించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని విషయాలు రైతులకు తెలియజేసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారిని ఆదేశించారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సీతారామారావు, లీడ్‌బ్యాంకు జిల్లా మేనేజర్‌ నాగరాజు, నాబార్డు ఏపీఎం సీసిల్‌ తిమోతి, లీడ్‌ జిల్లా అధికారి వెంకటేశ్, డీఏఓ పరశురాం నాయక్, ఈడీ ఎస్సీ కార్పొరేషన్‌ దేవయ్య, డీడబ్ల్యూ జ్యోతిపద్మ, డీటీడబ్ల్యూఓ వసంతరావు, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, పరిశ్రమల శాఖ జీఏం తిరుపతయ్య, బీసీడబ్ల్యూ సుధాకర్‌తోపాటు బ్యాంకు మేనేజర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top