దిగివచ్చిన మద్యం సిండికేట్‌.. 

Merchants Reduced the Price of Alcohol with Task Force Police Raids - Sakshi

అధిక ధరలపై కొరడా ఝళిపించిన హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ 

అక్టోబర్‌ నెల ప్రత్యేక ధరకు స్వస్తి 

పెంచిన రూ.10ని ఎత్తివేసిన వ్యాపారులు 

మోర్తాడ్‌(బాల్కొండ): అక్టోబర్‌ నెల కోసం ప్రత్యేక ధరను అమలు చేసిన మద్యం సిండికేట్‌ దిగివచ్చింది. ఒక్కో సీసాపై రూ.10 ధర పెంచగా ఆ ధరను ఎత్తివేసి పాత పద్దతిలోనే ఎంఆర్‌పీ ధరకు మద్యంను విక్రయిస్తున్నారు. గడచిన సెప్టెంబర్‌ 30తోనే మద్యం దుకాణాల లైసెన్స్‌కు గడువు ముగిసిపోయింది. అయితే కొత్త మద్యం పాలసీ అమలు కావడానికి కొంత సమయం పట్టడంతో అక్టోబర్‌ నెల కోసం లైసెన్స్‌లను రెన్యూవల్‌ చేశారు. లైసెన్స్‌ ఫీజు ఎక్కువ చెల్లించడం, తమకు లాభం తగ్గిపోవడంతో రూ.10 ధర అదనంగా విక్రయించడానికి మద్యం వ్యాపారులు ఎక్సైజ్‌ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారనే వ్యాఖ్యలు వినిపించాయి. అయితే ఎక్కువ ధరలకు మద్యం విక్రయించడంపై ఫిర్యాదులు అందినా స్థానిక ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోక పోవడంతో కొందరు హైదరాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందికి ఫిర్యాదు చేశారు.

దీంతో స్పందించి ఆ అధికారులు మద్యం అమ్మకాలపై నిఘా ఉంచి రెండు దుకాణాల నిర్వాహకులకు రూ.2లక్షల వరకు జరిమానా విధించారు. ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు హెచ్చరించడంతో మద్యం సిండికేట్‌ దిగివచ్చింది. మొదట్లో ప్రత్యేక ధరను అమలు చేసినా కేసులకు జడిసి పాత పద్దతిలోనే మద్యం విక్రయాలకు ఓకే చెప్పారు. మద్యం సిండికేట్‌ దిగివచ్చి ఎంఆర్‌పీ ధరలకే మద్యం విక్రయిస్తుండటంతో మందు బాబుల జేబులకు చిల్లు పడటం ఆగిపోయింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top