ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ | Membership Registration program in bjp party | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ

Nov 24 2014 4:10 AM | Updated on Mar 28 2019 8:37 PM

తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యమ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే కాకుండా 2019లో అధికారమే లక్ష్యంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు సభ్యత్వ నమోదు చేపట్టాలని ఆ పార్టీ శాసనసభా పక్ష నేత కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు.

హన్మకొండ : తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యమ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే కాకుండా 2019లో అధికారమే లక్ష్యంగా బీజేపీ నాయకు లు, కార్యకర్తలు సభ్యత్వ నమోదు చేపట్టాలని ఆ పార్టీ శాసనసభా పక్ష నేత కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. హన్మకొండ ఎన్జీవోస్ కాలనీలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ సభ్యత్వా న్ని నమోదు ఆయన ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పార్టీ సభ్యత్వ నమోదుపై శ్రేణులు దృష్టి సారించాలని సూచించారు.
 
ముందుచూపు లేని రాష్ట్ర ప్రభుత్వం..
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, వాగ్దానాల అమలుపై తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహరిస్తోందని లక్ష్మణ్ దుయ్యబట్టారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోగా, సీఎం కేసీఆర్ ఉద్యమ నేతగానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పూర్తిస్థాయి సీఎంగా పనిచేయడం లేదని, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కుటుంబాలకు భరోసా ఇవ్వడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. లక్ష ఉద్యోగా లు ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, కనీసం  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. అయితే, రాజకీయ ఉద్యోగాలు మాత్రం భర్తీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఇక కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య మాట దేవుడెరుగు... ఉన్న పాఠశాలలను రేషనలైజేషన్ పేరిట మూసివేతకు కుట్ర పన్నారని విమర్శించారు. అలాగే, ఫాస్ట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థులకు, పింఛన్లు కుదించడం ద్వారా లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం లేదని.. రాష్ట్రీయ ఏక్‌తా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హైదరాబాద్ వస్తే సీఎం కేసీఆర్ కానీ మంత్రులు కానీ కలవలేదని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం కేంద్రంతో సఖ్యతగా మెలుగుతూ నిధుల మంజూరు చేయించుకోవాలని లక్ష్మణ్ హితవు పలికారు.
 
యథాతథ స్థితికి మేం వ్యతిరేకం..
రాష్ట్ర శాసనసభలో అధికార, ప్రతిపక్షాలు కుమ్మక్కై శంషాబాద్ విమానాశ్రయం టెర్మినల్ పేరు మార్చకుండా యథాతథ స్థితి కొనసాగించాలని తీర్మానం ప్రవేశపెట్టాయని లక్ష్మణ్ ఆరోపించారు. విమానాశ్రయం టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని బీజేపీ తెలంగాణ శా ఖ వ్యతిరేకిస్తోందని.. ఈ విషయం అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చినప్పుడు రాష్ట్రానికి చెందిన పీవీ.నర్సింహారావు, కొమురం భీం సహా ఐదు పేర్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాలని కోరినట్లు తెలిపారు. అయితే, దీన్ని పట్టిం చుకోకుండా యథాతథ స్థితిని కొనసాగించేలా తీర్మానం ప్రవేశపెడితే తాము అభ్యంతరం చెప్పామన్నారు. కానీ రాజీవ్‌గాంధీ పేరు కొనసాగించేలా తీర్మానించిన అధికార పక్షానికి ఆయనపై ఎందుకు అంత ప్రేమో అర్థం కావడం లేదని లక్ష్మణ్ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు, కార్యదర్శి రావు పద్మ, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎర్రబెల్లి రాంమోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, మందాడి సత్యనారాయణరెడ్డి, నాయకులు నాగపురి రాజమౌళి, కాసర్ల రాంరెడ్డి, డాక్టర్ విజయ్‌చందర్‌రెడ్డి, గాదె రాంబాబు, మల్లాడి తిరుపతి రెడ్డి, చిలుక విజయారావు, దిలీప్, శ్రీరాముల మురళీమనోహర్, దుప్పటి భద్రయ్య, ఏదునూరి భవాని, రవళి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement