గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు విస్తరించాలి 

Medical services should be extended in rural areas - Sakshi

రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌  

ప్రాణాంతకంగా తలసేమియా,సికిల్‌సెల్‌ వ్యాధులు 

దేశంలో 3 నుంచి 4 కోట్ల మంది బాధపడుతున్నారు 

ఆయుష్మాన్‌ భారత్‌ కింద రూ.800 కోట్ల ఖర్చు 

ప్రతిమ ఆసుపత్రిలో తలసేమియా విభాగం ప్రారంభం 

హాజరైన మహారాష్ట్ర, తెలంగాణ గవర్నర్లు విద్యాసాగర్‌రావు, నరసింహన్‌ 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు విస్తరించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ అన్నారు. కరీంనగర్‌ మండలం నగునూరులోని ప్రతిమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ కళాశాలలో తలసేమియా విభాగాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో వైద్యులు, వైద్య విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దేశంలో తలసేమియా, సికిల్‌సెల్‌ వ్యాధులు ప్రాణాంతకంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాధితో మూడు నుంచి నాలుగు కోట్ల మంది బాధపడుతున్నారని తెలిపారు. ప్రముఖ నగరాల్లో కూడా ఈ వ్యాధి కనిపిస్తోందని తెలిపారు. పోలియో, స్మాల్‌పాక్స్‌ల్లా నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో భారత వైద్యులకు మంచి గుర్తింపు ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ యోజన పథకం కింద ఇప్పటికే ఆరు లక్షల మంది ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకోగా, రూ.800 కోట్లు ఖర్చయిందని రాష్ట్రపతి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ సమస్యలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. లక్ష్య సమూహాల మధ్య ఒక అవగాహన కలిగించడం, వారికి సకాలంలో సలహాలు ఇచ్చి సమస్య పరిష్కారం చూపడం ఒక ముఖ్యమైన ఘట్టంగా తీసుకోవాలన్నారు. గిరిజన వర్గాలలో ముఖ్యంగా జన్యుపరమైన రక్త రుగ్మతలను నిర్మూలించడం కోసం ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ రంగ ఆసుపత్రుల నుంచి ఆరోగ్యం–రక్షణ నిపుణులు, సమాజంలో స్వచ్ఛంద సంస్థలతో కలసి పనిచేయాలని రాష్ట్రపతి సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి కోవింద్‌ అత్యంత ప్రతిభ కనబర్చిన ఐదుగురు విద్యార్థులకు గోల్డ్‌ మెడల్స్‌ను అందజేశారు.  

ఆరోగ్య తెలంగాణ కోసం అవగాహన అవసరం : గవర్నర్‌ నరసింహన్‌ 
ఆరోగ్య తెలంగాణ సాధించాలంటే గ్రామీణులంతా ఆరోగ్యంగా ఉండాలని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. తలసేమియా తదితర వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరి పాత్ర కీలకమన్నారు. మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌. విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. హెల్త్‌ ఫర్‌ ఆల్‌ అనే నినాదంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందుకు పెళ్లికి ముందే అందరూ వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హోంమంత్రి మహ్మద్‌ మహమూద్‌ అలీ, ఎంపీ బి.వినోద్‌కుమార్, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ప్రతిమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ చైర్మన్‌ బి.శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top