మెదక్‌లో లెక్క తేలింది..

Medak Constituency MLA Candidates Campaigning Start - Sakshi

రెండు స్థానాల నుంచి బరిలో 19 మంది అభ్యర్థులు

మెదక్‌ నుంచి 12 మంది, నర్సాపూర్‌లో ఏడుగురు 

మెదక్‌ స్థానం నుంచి టీజేఎస్‌ ఉపసంహరణ

బరిలో అన్నదమ్ములు శశిధర్‌రెడ్డి – ఉపేందర్‌రెడ్డి 

నర్సాపూర్‌లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల విత్‌డ్రా

ఊపందుకోనున్న ఎన్నికల ప్రచారం 

ఎన్నికల ప్రక్రియలో రెండు ప్రధాన ఘట్టాలు ముగిసాయి. దీంతో రెండు స్థానాల నుంచి పోటీలో ఉండే అభ్యర్థులెవరో ఖరారయింది. మెదక్, నర్సాపూర్‌ నుంచి మొత్తం 31 నామినేషన్లు దాఖలయ్యాయి.       స్క్రూటినీలో తిరస్కరించినవి, అభ్యర్థుల ఉపసంహరణ తర్వాత ఆ సంఖ్య 19గా తేలింది. ఇప్పుడు అందరి దృష్టి మెదక్‌ నుంచి పోటీలో ఉన్న అన్నదమ్ములు శశిధర్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డిలపైనే ఉంది. ప్రత్యర్థులెవరో తేలడంతో అభ్యర్థులు వారి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికలకు ఇంకా కేవలం పట్టుమని పదిహేను రోజులు కూడా లేవు. ఈ కొద్ది సమయంలో విజయం సాధించడానికి అన్ని రకాల ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. అందరూ ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. 

సాక్షి,మెదక్‌  : ,మెదక్‌ జిల్లాలోని రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్న అభ్యర్థుల లెక్క తేలింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారంతో ముగిసింది. 19 మంది అభ్యర్థులు బరిలో ఉంటున్నారు. మెదక్‌ స్థానం నుంచి పన్నెండు, నర్సాపూర్‌ నుంచి ఏడుగురు పోటీలో ఉన్నారు. మెదక్‌ స్థానం నుంచి నామినేషన్‌ వేసిన టీజేఎస్‌ పోటీ నుంచి తప్పుకుంది. ఆ పార్టీ అభ్యర్థి జనార్దన్‌రెడ్డి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఆయన తరఫున న్యాయవాది బాలయ్య మెదక్‌ ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్‌ వీరబ్రహ్మచారికి నామినేషన్‌ ఉపసంహరణ పత్రాలను అందజేశారు. మాజీ ఎమ్మెల్యే పి.శశిధర్‌రెడ్డి విత్‌డ్రా చేసుకుంటారని ప్రచారం జరిగినా.. ఆయన నామినేషన్‌ ఉపసంహరించుకోలేదు.

దీంతో మెదక్‌ నియోకజవర్గం నుంచి అన్నదమ్ములు ఉపేందర్‌రెడ్డి(కాంగ్రెస్‌), శశిధర్‌రెడ్డి(ఎన్‌సీపీ) పోటీలో ఉన్నారు. నర్సాపూర్‌ నియోజకవర్గం నుంచి ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు యాదగిరి, పుర్ర ఊశయ్య నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.  ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్‌ఎస్‌ నుంచి పద్మాదేవేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి అమ్మారెడ్డిగారి ఉపేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి ఆకుల రాజయ్య, బీఎస్పీ నుంచి అశోక్‌కుమార్, ఎన్సీపీ నుంచి శశిధర్‌రెడ్డి పోటీలో ఉన్నారు.

ఎన్నికల కమిషన్‌ గుర్తింపు పొందిన పార్టీల నుంచి ఐదుగురు అభ్యర్థులతోపాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులున్నారు.   నర్సాపూర్‌ నుంచి ప్రధానంగా  టీఆర్‌ఎస్‌ నుంచి మదన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి సునీతారెడ్డి, బీజేపీ నుంచి గోపీ, బీఎస్పీ నుంచి సోమన్నగారి లక్ష్మీ, సీపీఎం నుంచి మల్లేశం పోటీ చేయనున్నారు. వీరితోపాటు మనపార్టీ తరఫున దిగంబర్‌ ముదిరాజ్, స్వతంత్ర అభ్యర్థి నవీన్‌ పోటీలో ఉన్నారు. 
ఆసక్తిగా అన్నదమ్ముల పోటీ..
మహాకూటమిలో మెదక్‌ టికెట్‌ దక్కించుకున్న టీజేఎస్‌ చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుంది. పొత్తులో భాగంగా మెదక్‌ టికెట్‌ను టీజేఎస్‌ అభ్యర్థి జనార్దన్‌రెడ్డికి ఇచ్చారు. అయితే కాంగ్రెస్‌ తరఫున ఉపేందర్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి బీఫామ్‌ అందజేసింది. పొత్తు ధర్మం పాటించని కాంగ్రెస్‌ వైఖరిపై టీజేఎస్‌ నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయింది. కాంగ్రెస్‌ అభ్యర్థిని పోటీ నుంచి తప్పుకోవాలని టీజేఎస్‌ కోరినప్పటికీ స్నేహపూర్వక పోటీ పేరిట  ఎన్నికల బరిలో నుంచి తప్పుకునేందుకు కాంగ్రెస్‌ నిరాకరించంది.

దీంతో టీజేఎస్‌ అభ్యర్థి పోటి నుంచి తప్పుకోవాని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌ వైఖరి వల్లే తాను పోటీలో నుంచి తప్పుకున్నానని, భవిష్యత్‌ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తారని ఆయన తెలిపారు.  మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి నామినేషన్‌ ఉపసంహరించుకుంటారని ముందుగా ప్రచారం సాగింది. కాంగ్రెస్‌ అభ్యర్థి ఉపేందర్‌రెడ్డి తన çసోదరుడైనా ఆయన నామినేషన్‌ విత్‌డ్రా చేసుకునేలా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఆయన నామినేషన్‌ ఉపసంహరించుకునేందుకు నిరాకరించారు.  అన్నదమ్ముళ్లు ఇద్దరు ఎన్నికల్లో పోటీ చేయడంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. 
ఊపందుకోనున్న ఎన్నికల ప్రచారం 
ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించారు. ఎన్నికలకు ఇంకా రెండు వారాలు సమయం ఉండటంతో అభ్యర్థులంతా ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమవుతున్నారు. ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థులు స్టార్‌ క్యాంపెయినర్‌లను రంగంలో దింపేందుకు సిద్ధం అవుతున్నారు

నర్సాపూర్‌ నియోకజవర్గం.. 
అభ్యర్థి పేరు                         పార్టీ
చిలుముల మదన్‌రెడ్డి          టీఆర్‌ఎస్‌
వాకిటి సునీత                     కాంగ్రెస్‌
అజ్జమర్రి మల్లేశం                  సీపీఎం
సింగాయపల్లి గోపి                 బీజేపీ
సోమన్నగారి లక్ష్మి               బీఎస్పీ
మన్నె దిగంబర్‌ ముదిరాజ్‌    మన పార్టీ
నవీన్‌                               స్వతంత్ర

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top