చైనా, ఫ్రాన్స్‌ల్లో ‘కంటి వెలుగు’ అద్దాల తయారీ

Manufacture of Eye Glass in China and France - Sakshi

     దేశంలోని పలు ప్రాంతాల్లో తయారు చేస్తున్నా సకాలంలో ఇవ్వని దుస్థితి 

     మరో 9 లక్షల చత్వారం కళ్లద్దాల తయారీకి సర్కారు ఏర్పాట్లు 

సాక్షి, హైదరాబాద్‌:  ‘కంటి వెలుగు’ లబ్ధిదారులకు ఇచ్చే చత్వారం కళ్లద్దాలను చైనా, ఫ్రాన్స్‌ సహా 4 దేశాల్లో తయారు చేయిస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో బెంగళూరు, హైదరాబాద్‌ వంటి 9 ప్రాంతాల్లో తయారు చేస్తున్నా అవస రం మేరకు సకాలంలో అందజేయడం కష్టంగా మారింది. దీంతో సంబంధిత కంపెనీ ఆయా దేశాల్లోనూ కళ్లద్దాలను తయారు చేయిస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ప్రభు త్వం కంటి వెలుగును ఈ ఏడాది ఆగస్టు 15న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 1.13 కోట్ల మందికి కంటి వెలుగు కింద కంటి పరీక్షలు నిర్వహించింది. అందులో 18.36 లక్షల మందికి రీడింగ్‌ గ్లాసులను అధికారులు అందజేశారు. మరో 14.13 లక్షల మందికి చత్వారం ఉన్నట్లు నిర్ధారించి 3.74 లక్షల మందికి అద్దాలు ఇచ్చారు. మరో లక్షన్నర వరకు జిల్లాలకు సరఫరా చేశారు. అవి జిల్లా వైద్యాధికారుల వద్ద పంచడానికి సిద్ధంగా ఉన్నాయి. జిల్లా వైద్యాధికారుల వద్ద ఉన్న వాటిని లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పంచాలని అనుకున్నారు. కానీ, కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుండటంతో అవి పంపిణీ చేయడానికి ఆలస్యమవుతోందని అధికారులు అంటున్నారు. ఉన్న వాటిని పంపిణీ చేయడానికి కూడా అధికారులు ప్రణాళిక వేసుకోకపోవడంపైన విమర్శలు వస్తున్నాయి.  

కళ్లద్దాల తయారీలో తీవ్ర జాప్యం
రీడింగ్‌ గ్లాసులు ముందుగానే తయారు చేసి కంటి వెలుగు శిబిరంలోనే అందజేస్తున్నారు. చత్వారం కళ్లద్దాల కోసం ప్రిస్కిప్షన్‌ రాసి ఇస్తున్నారు. వాటిని ప్రభుత్వమే తయా రు చేసి ఇస్తోంది. చత్వారం కళ్లద్దాలను ఒక్కొక్కరికి ఒక్కో రీతిన తయారు చేయాల్సి ఉంటుంది. అంటే, లక్షలాది మందికి లక్షలాది పద్ధతిలో ప్రత్యేకంగా తయారు చేయాల్సి ఉంటుంది. దీంతో వాటి తయారీకి అధిక సమయం తీసుకుంటుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో తొమ్మిది ప్రాంతాల్లో తయారు చేస్తున్నా లక్షలాదిగా సకాలంలో తయారు చేయని పరిస్థితి నెలకొందని అంటున్నారు. కాబట్టి ఇతర దేశాలకు పంపించారు. అయితే, పదిహేను నుంచి నెలరోజుల్లోనే ఇస్తామని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెప్పడంతో లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. సంబంధిత కంపెనీకి ముందే సొమ్ము ఇచ్చినందున సకాలంలో అందజేసేలా ఎందుకు ఒత్తిడి తేవడంలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. లక్షలాది మందికి సకాలంలో తయారు చేసి ఇవ్వాల్సి ఉన్నందున ఆ ప్రకారమే ప్రణాళిక రచించి ఉండాల్సింది అని పలువురు అంటున్నారు. తయారు చేసే కంపెనీ ఆలస్యం చేస్తున్నా పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినవస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top