పండంటి ఆదాయం

Mango Sales in Kothapet Fruit Market hyderabad - Sakshi

గడ్డిఅన్నారం మార్కెట్‌కు కాసుల పంట

ఏప్రిల్‌లో రూ.1.20 కోట్ల రాబడి

వెల్లువెత్తుతున్న మామిడి దిగుబడులు

సాక్షి,  సిటీబ్యూరో: ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ప్రస్తుత ఏప్రిల్‌ నెల ఆదాయం రూ.1.20 కోట్ల దాటింది. గ్రేటర్‌ పరిధిలోని అన్ని మార్కెట్‌లతో పోలిస్తే ఈ మార్కెట్‌ సొసైటీ ఆదాయంలో దూసుకుపోతోంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.8.62 కోట్ల ఆదాయం రాగా.. గత ఆర్థిక సంవత్సరం 2018–19లో రూ. 9.83 కోట్లు సమకూరాయి. ప్రస్తుతం 2019– 2020 ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్‌ నెలలో రికార్డు స్థాయిలో రూ.1.20 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది మార్కెట్‌ ఆదాయం వృద్ధి చెందినా అనుకున్న స్థాయిలో, కేంద్ర కార్యాలయం నిర్దేశించిన టార్గెట్‌ను పూర్తి చేయలేదు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ రూపొందించి అధికారులు ముందుకెళ్తున్నారు.  

ఇప్పటికే 2,92,319 క్వింటాళ్ల మామిడి దిగుమతులు
ఈ ఏడాది మామిడి సీజన్‌ నెలరోజుల ముందుగానే ప్రారంభమైంది. జనవరి 9 నుంచే మార్కెట్‌కు మామిడి రాక ప్రారంభమైంది. గత ఏడాది 1,59,549 క్వింటాళ్ల మామిడి దిగుమతులు జరిగాయి. ఈ ఏడాది శనివారం నాటికి 2,92,319 క్వింటాళ్లు వచ్చాయని  అధికారులు చెబుతున్నారు. శనివారం ఒక్కరోజే 14,314 క్వింటాళ్ల మామిడి పండ్లు మార్కెట్‌కు వచ్చాయి.  

ఆదాయం పెంపునకు ప్రత్యేక ప్రణాళికలు  
మార్కెట్‌ ఆదాయాన్ని పెంచడానకి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. రాత్రింభవళ్లూ మార్కెట్‌ ఇన్‌గేట్, ఔట్‌ గేట్‌ వద్ద నిఘా పెంచాం.. మార్కెట్‌లో క్రయ విక్రయాలపై ఎప్పటికప్పుడు కార్యదర్శులు, సూపరవైజర్లు తనిఖీలు నిర్వహించి లావాదేవీల్లో పారదర్శకతతో మార్కెట్‌ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎగుమతి చేసే వాహనాల లోడ్‌ తూకాల క్రాస్‌ చెక్‌ చేస్తున్నాం. తూకాల్లో తేడా వస్తే మళ్లీ తూకాలు వేస్తున్నాం. ఆ తూకాల ఆధారంగా మార్కెట్‌ ఫీజు వసూలు చేస్తున్నాం.      – వెంకటేశం, గడ్డిఅన్నారం మార్కెట్‌ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top