కరోనాను జయించినా.. మరణం తప్పలేదు

Man Died in Accident After Successful Recovery From Coronavirus In Nizamabad - Sakshi

సాక్షి, ఎల్లారెడ్డి: హైదరాబాద్‌లో ఉండే మేనమామ వద్దకు వెళ్తే కరోనా సోకింది.. ధైర్యంతో ఆ మహమ్మారిని జయించిన యువకుడు ఆనందంగా ఇంటి బాట పట్టారు. కానీ, విధికి కన్ను కుట్టింది. మార్గమధ్యలోనే మృత్యువు వెంటాడింది. ఈ విషాదకర ఘటనలో ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి గ్రామానికి చెందిన గుజ్జరి విజయ్‌కుమార్‌ (17) దుర్మరణం చెందాడు. అసలేం జరిగిందంటే.. గ్రామానికి చెందిన విజయ్‌కుమార్‌ ఇంటర్‌ చదువుతున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో అతడు హైదరాబాద్‌లో ఉండే మేన మామ వద్దకు వెళ్లాడు. అక్కడ మెస్‌లో వంట పనులు చేసే మేనమామతో పాటు విజయ్‌కూ కరోనా సోకింది.

దీంతో ఇద్దరు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందారు. రెండ్రోజుల క్రితం కరోనా నెగెటివ్‌ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. శుక్రవారం రాత్రి మామ, అల్లుడు కలిసి మేనమామ స్వగ్రామమైన మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేటకు బైక్‌పై బయల్దేరారు. అయితే, మనోహరాబాద్‌ శివారులో యూటర్న్‌ తీసుకుంటున్న లారీని వీరి బైక్‌ ఢీకొట్టింది. మేనమామ అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన విజయ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. శనివారం కళ్యాణి గ్రామంలో అతడి అంత్యక్రియలు నిర్వహించారు.   
(చదవండి: నిర్లక్ష్యంపై బిగుసుకుంటున్న ఉచ్చు!)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top