నిర్లక్ష్యంపై బిగుసుకుంటున్న ఉచ్చు!

Government Serious On Covid Patients Dead Body Transportation In Nizamabad - Sakshi

నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్లక్ష్యం

చర్యలకు ఉపక్రమించిన వైద్య ఆరోగ్య శాఖ

మార్చురీ సిబ్బందికి మెమోలు జారీ

సాక్షి, నిజామాబాద్: జిల్లా ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఉచ్చు బిగుసుకుంటోంది. కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని ఆటోలో తరలించిన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సీరియస్ అయింది. నిజామబాద్ ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ నిబంధనల ఉల్లంఘనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే నలుగురు వైద్యులతో కమిటీ ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్యశాఖ తాజాగా మార్చురీ సిబ్బందికి మెమోలు జారీ చేసింది. 

కాగా, కోవిడ్‌తో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఆటోలో తరలించిన దారుణ ఘటన నిజామాబాద్‌లో శనివారం చోటు చేసుకుంది. నిబంధనలు ప్రకారం కరోనా వైరస్ ద్వారా మృతిచెందిన వ్యక్తి మృతదేహాన్ని అంబులెన్స్ లేదా ఎస్కార్ట్ వాహనంలో సిబ్బంది పీపీఈ కిట్లు  ధరించి జాగ్రత్తగా తరలించాల్సి ఉంటుంది. ఇక ఆటో డ్రైవర్‌తో పాటు అందులులో ఉన్న మరో వ్యక్తి కూడా ఎలాంటి  కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. ఒకేసారి ముగ్గురు కరోనా రోగులు మరణించడంతో ఒక్కటే అంబులెన్స్‌ అందుబాటులో ఉందని, అందువల్ల ఆటోలో తరలించామని ప్రభుత్వాసుపత్రి వర్గాలు తమ చర్యను సమర్థించుకున్నాయి.
(కరోనా రోగి పట్ల అమానుష ప్రవర్తన)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top