అడ్డగోలుగా ఆధార్‌ కేంద్రాలు

Majority Aadhaar centers across the state are privately owned - Sakshi

‘ప్రభుత్వ కార్యాలయ ఆవరణ’లో ఏర్పాటు నిబంధనకు నీళ్లు

రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ సెంటర్లు ప్రైవేటు స్థలాల్లోనే

జీపీఎస్‌ లొకేషన్లలో నిర్వహణ తేలినా సర్వీసులను రద్దు చేయని యంత్రాంగం

ఆధార్‌ కేంద్రాల్లో నిర్వహణపై నిఘా లేకపోవడంతో వసూళ్లకు పాల్పడుతున్న వైనం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆధార్‌ కేంద్రాలు అస్తవ్యస్తంగా మారాయి. ప్రభుత్వ కార్యాలయాల పరిధిలోనే వాటిని నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ ఈ నిబంధన ఆచరణలోకి రావడం లేదు. వెరసి ఈ కేంద్రాల నిర్వహణ అడ్డదిడ్డంగా మారింది. ఆధార్‌ నమోదు, మార్పుల విషయంలో అవకతవకలకు చెక్‌ పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో నిర్వహించాలనే నిబంధనను సర్కారు తీసుకొచ్చింది. అవకతవకలకు పాల్ప డినప్పుడు అక్కడికక్కడే వెంటనే ఫిర్యాదు చేసే వీలుంటుందనే భావనతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు స్థలాల్లో ఉన్న కేంద్రాలను  ప్రభుత్వ ఆవరణలోకి తరలించాలని సమాచార సాంకేతికశాఖ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఈ నిబంధనలు అమల్లోకి తేవాలని స్పష్టం చేసింది.

నిర్వహణ ఇష్టానుసారం...
ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆవరణలోనే ఆధార్‌ కేంద్రాలను నిర్వహించాలనే నిబంధనను నిర్వాహకులు అటకెక్కించారు. నిర్దేశిత ప్రాంతానికి ఆధార్‌ కేంద్రాన్ని తరలించాలని జిల్లా కలెక్టర్ల నుంచి సూచనలు అందినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం వాటిని మార్చలేదు. పలు రకాల సాకులను చూపుతూ వాటిని ప్రైవేటు స్థలాల్లోనే నిర్వహిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వ ఆవరణలో ఆధార్‌ కేంద్రాన్ని నిర్వహిస్తే నిబంధనల ప్రకారం వ్యవహరించాలనే ఆందోళనతోనే సాకులు వెతుకుతూ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 973 ఆధార్‌ నమోదు కేంద్రాలున్నాయి. ఇందులో మీ–సేవా ఫ్రాంచైజీ (ఈఎస్‌డీ)కి చెందినవి 460 సెంటర్లున్నాయి. ప్రస్తుతమున్న వాటిలో ఈఎస్‌డీ ఎక్కువ భాగం ఉన్నప్పటికీ వాటి నిర్వహణ కోసం జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ కార్యాలయాల్లో లొకేషన్లు సైతం కేటాయించారు. సీఎస్‌సీ (కామన్‌ సర్వీస్‌ సెంటర్‌) ద్వారా నిర్వహిస్తున్న కేంద్రాలు పూర్తిగా ప్రైవేటు ప్రాంతాల్లోనే నిర్వహిస్తున్నారు.

లొకేషన్‌ చూపినా చర్యలు శూన్యం..
ఆధార్‌ కేంద్రాలను ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించే అంశాన్ని ఆన్‌లైన్‌ ద్వారా పరిశీలించవచ్చు. ఈ మేరకు సమాచార సాంకేతిక శాఖ వద్ద పరిజ్ఞానం ఉంది. ఆధార్‌ నమోదు సిస్టంను ఆన్‌ చేసిన వెంటనే అందులో జీపీఎస్‌ ద్వారా లొకేషన్‌ కనిపిస్తుంది. నిర్దే శిత లొకేషన్‌లో ఉంటేనే అను మతి ఇచ్చే అవకాశం ఉన్నతాధి కారులకు ఉంది. ప్రైవేటు లొకేషన్‌ చూపితే వెంటనే సర్వీ సును రద్దు చేయొచ్చు. కానీ స్పష్టమైన ఆదేశాలిచ్చిన అధికారులు అమలు తీరును మాత్రం పట్టించు కోవడం లేదు. ఈ కేంద్రాల నిర్వహణకు సంబంధించి జిల్లా స్థాయిలో జిల్లా మేనేజర్లు (డీఎం) నిఘా, పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతున్నారు. కొన్నిచోట్ల డీఎం లు అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తు న్నాయి. ప్రైవేటు ప్రాంతాల్లోనే నిర్వహిస్తామంటూ కొందరు ఆధార్‌ కేంద్రాల నిర్వాహకులు డీఎంల చేతులు తడుపు తున్నారు. దీంతో ఇష్టానుసారంగా కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సెంటర్లలో ఆధార్‌ నమోదుకు రూ. 100 నుంచి రూ. 250 వరకు వసూలు చేస్తున్నారు. ఆధార్‌ వివరాల్లో తప్పుల సవరణ, చిరునామా మార్పులు తదితరాలకు సంబంధించి రూ. 500పైబడి వసూలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదులు సైతం అందుతున్నాయి. కేంద్రాలపై నిఘా లేకపోవడంతో ఈ తంతు సాగుతున్నట్లు తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top