మహేశ్‌ ప్రెస్‌మీట్‌కు పవన్‌ ఫ్యాన్స్‌.. టెన్షన్‌

Mahesh Kathi Pressmeet at Somajiguda Pressclub - Sakshi

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ వద్ద స్వల్ప ఉద్రిక్తత

పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ను అడ్డుకున్న పోలీసులు

పవన్‌ అభిమానులపై నిప్పులు చెరిగిన మహేశ్‌ కత్తి

సాక్షి, హైదరాబాద్‌ : సినీ విమర్శకుడు మహేశ్‌ కత్తి, పవన్‌కళ్యాణ్‌ అభిమానుల మధ్య కొన్నాళ్లుగా కొనసాగుతున్న సోషల్‌ మీడియా వార్‌ మరింత వేడెక్కింది. తనతో చర్చించేందుకు పవన్‌ కళ్యాణ్‌, పూనం కౌర్‌, అభిమానులు ఎవరైనా ప్రెస్‌ క్లబ్‌కు రావాలని ఆయన సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే. అన్నట్లుగానే మహేశ్‌ కత్తి ఆదివారం ఉదయం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు వచ్చారు. పవన్‌ అభిమానులు సైతం రావడంతో ఇక్కడ స్పల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముందస్తుగానే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పవన్‌ అభిమానులను ప్రెస్‌క్లబ్‌లో అనుమతించకుండా అడ్డుకున్నారు. తన సవాల్‌ను ఎవరూ స్వీకరించకపోవడంతో మీడియాతో మాట్లాడుతూ.. ఆరు ప్రశ్నలు సంధించారు. 

నా తల్లి, భార్యను తిడితే ఊరుకోవాలా..?
రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదని, తాను పది ప్రశ్నలు వేస్తే, ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేని పవన్‌ కళ్యాణ్‌, ఆయన అభిమానులు తన తల్లిని, భార్యను నోటితో చెప్పలేని విధంగా బూతులు తిడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. పవన్ లేదా పూనం కౌర్ ను చర్చించేందుకు రమ్మని ఆహ్వానం పంపించానని, కానీ వారు రాలేదని అన్నాడు. తనను సామాజిక బహిష్కరణ చేయాలని కోన వెంకట్ చేసిన డిమాండును ప్రస్తావిస్తూ, ఓ దళితుడిగా తాను ఎన్నోసార్లు సామాజిక బహిష్కరణను చూశానన్నారు. సినీ ఇండస్ట్రీ నుంచి కూడా బహిష్కరించారని ఆరోపించారు. 

రేణుదేశాయ్‌ విషయంలో ఏం చేయని పవన్‌..
రేణుదేశాయ్ తన రెండో వివాహం గురించి ఒక్క మాట ప్రస్తావిస్తే, పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోయారని, ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తిని చంపేస్తామని హెచ్చరించారని గుర్తు చేసిన కత్తి.. కనీసం ఆ వ్యాఖ్యలను సైతం పవన్ ఖండించలేదని, ఇక ఆయన ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. ప్రశ్నిస్తానని, ప్రజలకు అండగా ఉంటానని చెప్పే పవన్.. తన అభిమానులను ఎంతమాత్రమూ కంట్రోల్ చేయలేకపోతున్నారని విమర్శించారు. తాను ఓ మామూలు మనిషినని, తనపై అభిమానులు చేస్తున్న విమర్శలను, దాడిని, ఒక్క మాట చెప్పి పవన్ అడ్డుకోలేక పోతున్నారని ఆరోపించారు. తాను ఎన్నడూ పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేయలేదని, రాజకీయ వ్యాఖ్యలు మాత్రమే చేశానని, వాటికి సమాధానం చెప్పలేని ఆయన, రాష్ట్రానికి ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు. తన ప్రాణాలకు అపాయం ఉందని, దీంతోనే ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తే, తనతో చర్చించేందుకు ఎవరూ రాలేదని ఆయన వాపోయారు.

పూనం కౌర్‌కు ప్రశ్నల వర్షం..
ఏపీ చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌ పదవి ఎలా వచ్చిందన్న కత్తి.. పవన్‌ మోసం చేశాడన్న భావనతో మీరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే మిమ్మల్ని కాపాడిందేవరు? మీ ఆసుపత్రి బిల్‌ కట్టిందేవరని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ మీ అమ్మను కలిసి ఏం ప్రామిస్ చేశారు? అది నెరవేర్చారా, లేదా? డైరెక్టర్ త్రివిక్రమ్ అంటే మీకు ఎందుకంత కోపం? ఓ క్షుద్రమాంత్రికుడితో కలసి త్రివిక్రమ్ పూజలు చేస్తుంటే, అక్కడ మీరు ఏం చేశారు? ఈ ప్రశ్నలకు పూనం కౌర్‌ సమాధానం చెప్పాలని మహేష్ డిమాండ్ చేశారు. తాను సంధించిన ప్రశ్నలకు సంబంధించి అన్ని ఆధారాలూ తన వద్ద ఉన్నాయని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top