ఎన్‌ఆర్‌ఐ మహిళలు మరింత సేఫ్‌

Mahender Reddy Inaugurates NRI Women Safety Cell - Sakshi

‘విమెన్స్‌ సేఫ్టీ వింగ్‌’లో ఎన్‌ఆర్‌ఐ విభాగం ప్రారంభం 

సాక్షి, హైదరాబాద్‌ : విదేశాల్లో వైవాహిక సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలకు అన్ని రకాల సాయం అందించేందుకు విమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఐ విమెన్‌ సేఫ్టీ సెల్‌ విభాగం సిద్ధంగా ఉంటుందని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం లక్డీకాపూల్‌లోని విమెన్‌ సేఫ్టీ వింగ్‌లో ఎన్‌ఆర్‌ఐ విమెన్‌ సేఫ్టీ సెల్‌ను ఆయన ప్రారంభించారు. ఎన్‌ఆర్‌ఐ మహిళలకు ఎదురయ్యే కుటుంబ వేధింపుల పరిష్కారానికి ఎన్జీవోలు కూడా కలిసిరావాలని పిలుపునిచ్చారు. బాధితులకు న్యాయపరంగా సలహాలు, కౌన్సెలింగ్‌తోపాటు చట్టపరంగా ఈ విభాగం అన్ని రకాల సాయం అందిస్తుందని చెప్పారు. నిందితులకు శిక్షపడేలా, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుందని వివరించారు.

విమెన్‌ సేఫ్టీ వింగ్‌ చీఫ్, ఐజీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. ఈ విభాగం ఎన్‌ఆర్‌ఐ బాధిత మహిళల కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దర్యాప్తు అధికారులకు తగిన ఆదేశాలు, సూచనలు ఇస్తుందని తెలిపారు. ఎన్‌ఆర్‌ఐ వివాహాల్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారం, భారతీయులుగా వారికి ఉన్న హక్కులు, చట్టాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. దీనికోసం 14 దేశాల ఎంబసీలు, విదేశాంగ వ్యవహారాల శాఖతో అవగాహన కుదుర్చుకున్నామని వెల్లడించారు. డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ వైజయంతి మాట్లాడుతూ.. కేసుల నమోదులో డాక్యుమెంటేషన్‌ చాలా కీలకమైనదని, ఈ విషయంలో తమ ప్రాసిక్యూటర్లు న్యాయసలహాలు అందజేస్తారని తెలిపారు. విమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్, ఎస్పీ (సీఐడీ) సుమతి మాట్లాడుతూ.. ఈ విభాగం న్యాయనిపుణులతో బాధితులకు పూర్తి న్యాయం చేసేలా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజినల్‌ పాస్‌పోర్ట్‌ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి, నీలా ఎన్జీవో ప్రతినిధి మమతా రఘువీర్, రాష్ట్ర మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ త్రిపురాన వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top