కాంగ్రెస్, టీడీపీ పొత్తు అనైతికం

Mahender Reddy Comments On In Rangareddy - Sakshi

మొయినాబాద్‌: కాంగ్రెస్‌ 48 ఏళ్లు, టీడీపీ 15 ఏళ్లు పాలించి తెలంగాణకు ఏం ఒరగబెట్టాయని ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ ప్రశ్నించారు. ఇప్పుడు ఆ రెండు పార్టీలు రాష్ట్రాన్ని పూర్తిగా ముంచేందుకు ఒక్కటయ్యాయని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తు అనైతికమన్నారు. మొయినాబాద్‌లో శనివారం టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ఆపద్ధర్మ మంత్రి మహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ చేవెళ్ల అభ్యర్థి కాలె యాదయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం రోడ్‌ షో నిర్వహించారు. మొయినాబాద్‌లో పార్టీ జెండాను ఎగురవేసిన అనంతరం మహమూద్‌ అలీ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంట్‌లో టీడీపీ అడ్డుకుందని.. అలాంటి పార్టీతో కాంగ్రెస్‌ ఎలా పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లలో సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని నెంబర్‌ వన్‌ స్థానంలో నిలబెట్టారని తెలిపారు.

పథకాలే గెలిపిస్తాయి: రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి 
తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను మళ్లీ గెలిపిస్తాయని ఆపద్ధర్మ మంత్రి మహేందర్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లలో అనేక మందికి అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరిందని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో ఐటీ శాఖ ద్వారా అభివృద్ధికి అధిక నిధులు కేటాయించినట్లు చెప్పారు. జిల్లాలో ఐటీ పరిశ్రమలు వస్తుండడంతో యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. మరోసారి టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధించవచ్చన్నారు.

కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి కాలె యాదయ్యను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు యాదయ్య, పెంటయ్య, నాయకులు సిద్దయ్య, నర్సింహ్మరెడ్డి, శ్రీహరి, రవూఫ్, భీమేందర్‌రెడ్డి, గణేశ్‌రెడ్డి, శ్రీనివాస్, జయవంత్, బాల్‌రాజ్, మల్లేశ్, ఆంజనేయులు, కృష్ణ, సత్తిరెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top