పత్తి రైతులకు అండగా ఉందాం

Let's cater to cotton farmers - Sakshi

     జిన్నింగ్‌ మిల్స్‌ యజమానులకు కేటీఆర్‌ పిలుపు

     మిల్స్‌ యాజమాన్యాలతో మంత్రుల సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: పత్తి రైతులకు అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి జిన్నింగ్‌ మిల్స్‌ యాజమాన్యాలు కూడా తమవంతు సహకారం అందించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు కోరారు. జిన్నింగ్‌ మిల్స్‌ పరిశ్రమకు అవసరమైన సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతులు మార్కెట్‌కు తెస్తున్న పత్తికి గిట్టుబాటు ధర అందించడంలో భాగంగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, మార్కెటింగ్‌ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం రాష్ట్రంలోని జిన్నింగ్‌ మిల్స్‌ యాజమాన్యాలతో సమావేశమై ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చారు.

మంత్రుల పిలుపునకు స్పందించిన జిన్నింగ్‌ మిల్స్‌ సంఘం అధ్యక్షుడు రవీందర్‌ రెడ్డి.. తమకు ప్రభుత్వం నుంచి రావలసిన ప్రోత్సాహకాలను వెంటనే విడుదల చేయాలని కోరారు. దీనికి స్పందించిన మంత్రులు.. సుమారు రూ. వంద కోట్ల ప్రోత్సాహకాల బకాయిలు వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఖాయిలాపడ్డ జిన్నింగ్‌ మిల్స్‌ను తెరిపిం చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ను కేటీఆర్‌ ఆదేశించారు. ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌ వ్యవస్థను ఈ ఖాయిలాపడ్డ జిన్నింగ్‌మిల్స్‌ను పునఃప్రారంభించేందుకు ఉపయోగించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ శాఖ వేసిన జరిమానాలను ఎత్తివేయాలని పరిశ్రమ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.  

నేటి నుంచి కొనుగోళ్లు పెంచండి.. 
ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుని జిన్నింగ్‌ పరిశ్రమ ప్రతినిధులు బుధవారం నుంచే పత్తి కొనుగోళ్లు పెంచాలని మంత్రులు ఈటల, హరీశ్‌ రావు, కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఇటీవల గుజరాత్‌లో జరిగిన ఓ సమావేశంలో సౌత్‌ ఇండియా మిల్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ సెంథిల్‌ కుమార్‌ను కలిశానని, తెలంగాణలో పండిస్తున్న పత్తి నాణ్యమైనదని ఆయన చెప్పారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నాణ్యమైన పత్తిని పండిస్తున్న తెలంగాణ రైతన్నను ఉన్నత స్థితికి తీసుకెళ్లాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పం అని పేర్కొన్నారు. జిన్నింగ్‌ మిల్స్‌ యజమానులు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే త్వరలోనే రాష్ట్రంలో డిలింట్, సాల్వెంట్‌ పరిశ్రమ పార్కును నెలకొల్పుతామని ప్రకటించారు. వరంగల్‌లో ఇటీవల సీఎం శంకుస్థాపన చేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో తమకు కూడా పరిశ్రమలు పెట్టుకునే అవకాశం ఇవ్వాలని జిన్నింగ్‌ మిల్స్‌ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top