అక్రమాలకు చెక్‌పెట్టేందుకు సీసీఐ పెట్టిన నిబంధనలతో రైతులకు తప్పని తిప్పలు
సామర్థ్యం, సౌకర్యాల ఆధారంగా జిన్నింగ్ మిల్లులను విభజించిన సీసీఐ
ఒక మిల్లులో బేళ్ల సామర్థ్యం నిండాకే మరో దానికి పత్తి కేటాయింపు
ఏ జిల్లా రైతులు ఆ జిల్లాలోని మిల్లుల్లోనే పత్తి విక్రయించాలనే నిబంధన
మొదలైన సీసీఐ కొనుగోళ్లు.. ఇప్పటివరకు 66 క్వింటాళ్ల పత్తినే అమ్మిన రైతులు
సాక్షి, హైదరాబాద్: జిన్నింగ్ మిల్లుల్లో అవకతవకలకు చెక్ పెట్టేందుకు, దళారుల జోక్యాన్ని అడ్డుకోవ డానికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తెచ్చిన నిబంధనలు పత్తి రైతులకు గుది బండగా మారాయి. గతేడాది వరకు సీసీఐ నోటిఫై చేసిన సమీపంలోని జిన్నింగ్ మిల్లుల్లో రైతులు పత్తిని విక్రయించుకొనే వెసులుబాటు ఉండగా ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోవడమే అందుకు కారణం.
సీసీఐ తీసుకొచ్చిన తాజా నిబంధనల ప్రకారం రైతులు కపాస్ కిసాన్ యాప్‌లో వారి వివరాలతో పంట సమాచారాన్ని నమోదు చేసుకొని స్లాట్ బుక్ చేసుకున్నాక సీసీఐ నోటిఫై చేసిన ఆయా జిల్లాల్లోని కొన్ని మిల్లుల్లో ఏదో ఒక దాన్ని మాత్రమే ఎంపిక చేసుకొనే అవకాశం ఉంది. తదనుగుణంగా ఎంత దూరమైనా ఆ జిల్లాలో నిర్దేశించిన మిల్లుల్లోనే రైతులు పత్తిని విక్రయించాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్దేశించిన రోజు పత్తిని విక్రయించకపోతే రైతులు మళ్లీ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 30 జిల్లాలలోని మిల్లులను ఎల్–1, ఎల్–2, ఎల్–3లుగా 12 రకాల సీసీఐ విభజించడంతో ఈ సమస్య తలెత్తింది.
ఎల్–1 నుంచి ఎల్–12 వరకు మిల్లుల విభజన
ఏదైనా పనికి టెండర్లు వేసినప్పుడు తక్కువ ధరకు బిడ్ వేసిన వారిని ఎల్–1గా, ఆ తర్వాత వారిని ఎల్–2, ఎల్–3గా నిర్ణయిస్తారు. పత్తి విక్రయాల్లోనూ ఈసారి సీసీఐ అదే విధానాన్ని అవలంబించింది. పత్తి కొనుగోళ్లకు టెండర్లు పిలిచినప్పుడు 347 మిల్లులు పాల్గొనగా వాటిలో 317 మిల్లులను పత్తి కొనుగోళ్ల కోసం సీసీఐ నోటిఫై చేసింది. వాటిలోనూ తక్కువ ధరకు జిన్నింగ్ చేసేందుకు ముందుకొచ్చిన, నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉండి, మెరుగైన సదుపాయాలు ఉన్న మిల్లులకు ఇచ్చిన మార్కుల ఆధారంగా ఎల్–1, ఎల్–2 నుంచి ఎల్–12 వరకు కేటగిరీలుగా విభజించింది. ఈ లెక్కన రాష్ట్రంలో ఎల్–1 కింద 117 మిల్లులు ఉండగా ఎల్–2 కింద 75, ఎల్–3 కింద 48, ఎల్–4 కింద 26, ఎల్–5 కింద 10 మిల్లులు, ఎల్–12 కింద వరంగల్‌లోని ఒక మిల్లును సీసీఐ ఎంపిక చేసింది.
ఒకటి నిండాకే మరొకటి..
రాష్ట్రంలో ప్రస్తుతం సీసీఐ ద్వారా నోటిఫై చేసిన జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. శుక్రవారం నాటికి ఆదిలాబాద్‌లో 6, కొత్తగూడెంలో 2, ఖమ్మంలో 3, నారాయణపేట, సిద్దిపేటలో ఒక్కో జిన్నింగ్ మిల్లు చొప్పున 13 మిల్లులు మాత్రమే కొనుగోళ్లు ప్రారంభించాయి. వాటిలో ఇప్పటివరకు 26 మంది రైతులు కేవలం రూ. 53 లక్షల విలువైన 66.48 క్వింటాళ్ల పత్తినే విక్రయించారు. వారంతా ఎల్–1 కింద నమోదైన మిల్లుల్లోనే పత్తిని విక్రయించారు.
ఎల్–1 కింద కేటాయించిన 117 మిల్లుల్లో వాటి సామర్థ్యం మేరకు పత్తి బేళ్లు నిండాకే ఎల్–2, ఆ తర్వాత ఎల్–3కి కేటాయిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లకు పత్తి తక్కువగా వస్తున్న నేపథ్యంలో ఎల్–1 మిల్లులకే రైతులు పత్తిని విక్రయించాల్సి వస్తోంది. వచ్చే నెలలో పత్తి ఎక్కువగా మార్కెట్లకు వచ్చే వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఎల్–1లో లేని మిల్లులు తమ వంతు వచ్చే వరకు మిల్లింగ్ చేయకుండా వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అంశంపై మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


