చాపకింద నీరులా కుష్ఠు | leprosy disease increase in Adilabad | Sakshi
Sakshi News home page

చాపకింద నీరులా కుష్ఠు

Dec 5 2017 10:44 AM | Updated on Aug 17 2018 2:56 PM

leprosy disease increase in Adilabad - Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: కుష్ఠు వ్యాధి జిల్లాలో విజృంభిస్తోంది. చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అంటువ్యాధి కావడంతో ఆందోళనకు గురి చేస్తోంది. తగిన సమయంలో చికిత్స తీసుకోకుంటే దుష్పరిణామాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అవగాహన లేమి, నిరక్షరాస్యత కారణంగా ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. కాగా, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గత నెల 20 నుంచి డిసెంబర్‌ 3 వరకు జిల్లాలో ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది కుష్ఠు వ్యాధి నిర్ధారణ కోసం ఇంటింటా సర్వే చేపట్టారు.

 జిల్లాలో కొత్తగా 35 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు వైద్యశాఖ అధికారులు నిర్ధారించారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా గతంలో వ్యాధి సోకిన వారిని కలుపుకొని 88 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇతర జిల్లాలతో పోల్చితే కుష్ఠు వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్‌ జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 7,89,052 మంది జనాభా ఉన్నారు. 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 పట్ణణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో  ఆశ కార్యకర్తలు 6,71,995 మందికి కుష్ఠు నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

 ఇంకా 36 వేల మందికి వైద్య పరీక్షలు చేయాల్సి ఉంది. ఇంటింటి సర్వేలో 35 మందికి వ్యాధి సోకినట్లు గుర్తించారు. 19 మందికి మల్టీ బాసిల్లరీ, 16 మందికి పాసిబాసిల్లరీ ఉందని అధికారులు తెలిపారు. 8,585 మందికి స్పర్శలేని మచ్చలు ఉండడంతో వ్యాధి ఉన్న అనుమానితులుగా ఆశ కార్యకర్తలు గుర్తించారు. వారికి వైద్య పరీక్షలు చేస్తే ఎంతమందికి వ్యాధి ఉందో తెలుస్తుంది. శరీరంలో కుష్ఠు సంబంధించిన మచ్చలు 1–5 వరకు ఉంటే పాసిబాసిల్లరీ అని, దీని నివారణకు 6 నెలలపాటు చికిత్స అందిస్తారు. 6 కంటే ఎక్కువ మచ్చలు ఉండి నరాలు ఉబ్బినట్‌లైతే మల్టీ బాసిల్లరీగా నిర్ధారిస్తారు. దీని నివారణకు ఒక సంవత్సరంపాటు చికిత్స అందిస్తారు.

కొత్తగా 35 మందికి వ్యాధి..
ఇంటింటి సర్వేలో జిల్లాలో కొత్తగా 35 మందికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ చేశారు. వారికి కుష్ఠు నివారణ మందులను పంపిణీ చేస్తున్నట్లు కుష్ఠు నివారణ ఆధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని ఆయా పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో రోగుల సంఖ్య పరిశీలిస్తే, తలమడుగు పీహెచ్‌సీ పరిధిలో 10 మందికి, ఝరి పీహెచ్‌సీలో ఐదుగురు, తాంసిలో నలుగురు, ఖుర్షీద్‌నగర్‌లో ఇద్దరు, హస్నాపూర్‌లో ఇద్దరికి, హమాలీవాడలో ఒక్కరికి, శాంతి నగర్, ఇంద్రవెల్లి, దంతన్‌పల్లి, నేరడిగొండ, అంకోలి, గిమ్మ, జైనథ్‌లో ఒక్కొక్కరు చొప్పన వ్యాధిగ్రస్తులు ఉన్నారు. బోథ్‌లో నలుగురు వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గతంలో గుర్తించిన కేసుల్లో అత్యధికంగా ఆదిలాబాద్‌ మండలంలో 21 మంది ఉన్నారు. గుడిహత్నూర్‌లో ముగ్గురు, ఒచ్చోడలో ఇద్దరు, బోథ్‌లో ముగ్గురు, తాంసిలో ఒకరు, భీంపూర్‌లో ఇద్దరు, తలమడుగులో నలుగురు, జైనథ్‌లో ఐదుగురు, బేలలో ముగ్గురు, ఉట్నూర్‌లో ఐదుగురు, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడలో ఒక్కరు చొప్పన వ్యాధిగ్రస్తులు ఉన్నారు.

కుష్ఠు వ్యాధి అంటే.. 
కుష్ఠు వ్యాధి మైకో బ్యాక్టీరియం లెప్రి అనే బ్యాక్టీరియాతో సోకుతుంది. శరీరంలోని అన్ని అవయవాలకు సోకుతుంది. సరైన సమయంలో వైద్యం చేయించుకోకపోతే ఒకరి నుంచి మరోకరి సోకుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. వ్యాధి సోకిన తర్వాత 3 నుంచి 15 సంవత్సరాల తర్వాత దుష్పరిణామాలు బయటపడుతాయి. తొలిదశలో వ్యాధిని నిర్ధారించుకుని యండీటీ చికిత్స పొందితే అంగవైకల్యం రాకుండా కాపాడవచ్చు. శరీరంలో ఎరుపు రంగు, రాగి రంగు మచ్చలు స్పర్శ లేకుండా ఉంటే వ్యాధి ఉన్నట్లు నిర్ధారిస్తారు.

35 మందికి వ్యాధి ఉన్నట్లు గుర్తించాం
జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఇంటింటి సర్వేలో 35 మందికి కుష్ఠు ఉన్నట్లు నిర్ధారించాం. వారికి మందులు పంపిణీ చేశారు. కొత్త వారిని కలిపి మొత్తం 88 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. జిల్లాలో మొత్తం 6.71 లక్షల  మందికి వైద్య పరీక్షలు చేశాం. ఇంకా 36 వేల మందికి వైద్య పరీక్షలు చేయాల్సి ఉంది. 8,585 వ్యాధి ఉన్న అనుమానితులుగా గుర్తించాం. వారికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తాం.
– శోభపవార్, జిల్లా కుష్ఠు నివారణ అధికారి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement