శాసనమండలి ఎన్నికల్లో నెలకొన్న గందరగోళానికి ఎట్టకేలకు తెరపడింది...
- శాసనమండలి ఎన్నికల వేడి షురూ
- ఆశావహుల యత్నాలు ముమ్మరం
- టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో పోటాపోటీ
- శాసనమండలి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
- 14 నోటిఫికేషన్.. జూన్ 1న ఎన్నికలు
- ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు ఎవరో?
- కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల్లో మొదలైన చర్చ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : శాసనమండలి ఎన్నికల్లో నెలకొన్న గందరగోళానికి ఎట్టకేలకు తెరపడింది. ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ గురువారం విడుదలైంది. మరో వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుండగా.. జూన్ 1న ఈ ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల నుంచి ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ మొదలైంది. తెలంగాణలో ఆరు స్థానాలకు అవకాశం ఉండగా.. టీఆర్‌ఎస్ ఐదు, కాంగ్రెస్ ఒక స్థానాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జిల్లాకు అవకాశం వస్తే పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ రాష్ర్ట అధ్యక్షురాలు ఆకుల లలిత పోటీలో ఉన్నారు. ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాకు చెందిన పలువురికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. డాక్టర్ భూపతి, మాజీ ఎమ్మెల్యే జనార్ధన్‌గౌడ్, మైనార్టీ నేత ఎస్‌ఏ అలీం, ఎమ్మెల్సీ బి.రాజేశ్వర్‌రావు టీఆర్ ఎస్ నుంచి ఎమ్మెల్సీ పదవి ఆశిస్తుండగా.. తాజాగా మళ్లీ పార్టీలో చేరిన డాక్టర్ బాపురెడ్డి పేరు కూడా వినిపిస్తోంది.
రాష్ట్రపతి ప్రకటన నుంచే ఉత్కంఠ...
రాష్ట్రపతి ప్రకటనతో 20 రోజుల క్రితమే తెలంగాణ ఎమ్మెల్సీ స్థానాలపై స్పష్టత వచ్చింది. పునర్విభజనకు రాష్ట్రపతి ఆమోదముద్రతో ఎమ్మెల్సీ ఎన్నికలు అప్పుడే తెరపైకి వచ్చాయి. ఆంధ్రలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఇక్కడా జరగాల్సి ఉండగా... ఎమ్మెల్సీ స్థానాల్లో నెలకొన్న గందరగోళంతో నోటిఫికేషన్ వెలువడ లేదు. 10-15 రోజుల ఆలస్యంగానైనా గురువారం షెడ్యూల్ వెలువడటంతో ఆయూ పార్టీల నాయకులు రాజధాని బాట పట్డడం చర్చనీయాంశం అవుతోంది.
అధినేతలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఢిల్లీలో అధిష్టానం వద్ద ఎమ్మెల్సీ కోసం పైరవీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్ నేతలు సైతం ఎవరికీ తోచిన విధంగా వారు సీఎం కేసీఆర్, ఎంపీ కవిత, మంత్రి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేల ద్వారా ప్రయత్నాలు మొదలెట్టారు.
టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల్లో ‘ఎమ్మెల్సీ’ చిచ్చు...
మార్చి 29న రాష్ర్ట వ్యాప్తంగా మొత్తం 10 మంది శాసనమండలి సభ్యుల పదవీ కాలం ముగిసింది. ఇందులో జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ దిగ్గజం డి.శ్రీనివాస్ కూడా ఉన్నారు. మళ్లీ ఈ సారి కూడ ఆయన ప్రయత్నంలో ఉండగా... రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించి, తన శిష్యులుగా పేరున్న ఆకుల లలిత, ఆమె భర్త ఆకుల రాఘవేందర్ చేస్తున్న ప్రయత్నాలు డీఎస్‌కు తలనొప్పిగా మారాయి. కాంగ్రెస్‌కు దక్కే సీటును మహిళలకు కేటాయిస్తారన్న ప్రచారంతో ఢిల్లీలోనే మకాం వేసిన ఆకుల లలిత దంపతులు గట్టి ప్రయత్నం చేస్తున్నారు.
ఎమ్మెల్సీ, శాసనసభ ఫ్లోర్ లీడర్‌గా పదవీ విరమణ చేసిన డి.శ్రీనివాస్‌ను పార్టీ అధిష్టానం ఇటీవలే టీపీసీసీ హై-పవర్ కమిటీ చైర్మన్‌గా నియమించగా... ఎమ్మెల్సీ పదవికి కూడా తనకే అవకాశం ఉంటుందన్న ధీమాతో ఉన్నారు. కాగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల సమయంలో పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని పలువురికి హామీ ఇచ్చారు. నిజామాబాద్ రూరల్ టికెట్ బాజిరెడ్డి గోవర్ధన్‌కు కేటాయించిన సందర్భంగా అక్కడ టికెట్ ఆశించిన డాక్టర్ భూపతిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామన్నారు.
ఇదే సమయంలో నిజామాబాద్ అర్భన్ సీటును బిగాల గణేష్‌గుప్తాకు ఇచ్చి బస్వా లక్ష్మీనర్సయ్యకు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. అయితే లక్ష్మీనర్సయ్య ఆ ఎన్నికల్లోనే కాంగ్రెస్‌లో చేరారు. తర్వాత ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే జనార్ధన్‌గౌడ్‌కు కూడ ఎమ్మెల్సీగా చాన్స్ ఇస్తామన్నారు. పార్టీకి అండదండగా ఉంటున్న మైనారిటీ నేత ఎస్‌ఏ అలీం సైతం తమ కోటా కింద ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ నలుగురిలో కేసీఆర్ ఎవరికీ అవకాశం కల్పిస్తారన్న చర్చ జరుగుతుండగా.. ఇటీవలే డాక్టర్ జె.బాపురెడ్డి మళ్లీ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో టీఆర్‌ఎస్ నేతలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు.