కబ్జా కోరల్లో క్వార్టర్స్‌ భూములు

Land Mafia Eye On Government Lands In Nalgonda - Sakshi

ప్రభుత్వ ఆస్తులపై అక్రమార్కుల కన్ను

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

సాక్షి, మాడుగులపల్లి (నల్లగొండ) : అధికారుల  అలసత్వం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ క్వార్టర్స్‌ కబ్జాకు గురవుతున్నాయి. దాదాపు పాతికేళ్ల కిత్రం ప్రభుత్వం కట్టించిన క్వార్టర్స్‌ భూములు, భవనాలను  భూకబ్జదారులు ఆక్రమించుకుంటున్నారు. నిరుపయోగంగా ఉన్న క్వార్టర్స్‌ను పూర్తి స్థాయిలో కబ్జా చేసేందుకు కొంత మంది పావులు కదుపుతున్నారు. ఇది మాడ్గులపల్లి మండలంలోని కుక్కడం గ్రామంలో నిరుపయోగంగా ఉన్న ఎస్‌ఎల్‌బీసీ క్వార్టర్స్‌కు రక్షణ కరువైంది. వివరాల్లోకి వెళితే 1984 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నక్కలగండి రిజర్వార్‌ ద్వారా చెరువులు, కుంటలు, నల్లగొండలోని ఉదయ సముద్రం నింపెందుకు ప్రణాళికలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లా వెనుకబడటంతో కుక్కడం,తిప్పర్తి గ్రామాల్లో చెరువులను,కాలవలను అధికారులు పర్యవేక్షించేందుకు కూలీల కోసం అయా గ్రామాల్లో ప్రభుత్వం కొంత భూమిని తీసుకుని ఎస్‌ఎల్‌బీసీ క్వార్టర్స్‌ పేరుతో భవనాలను నిర్మించింది. కుక్కడం గ్రామంలో సర్వే నంబర్‌ 145,146  సుమారు 6 ఎకరాల భూమిని తీసుకొని క్వార్టర్స్‌ నిర్మాణం చేసింది. కొన్నేళ్ల వరకు పనులు జరిగిన తర్వాత క్వార్టర్స్‌ను అధికారులు వదిలి వెళ్లారు.

కాలక్రమంలో ఈ క్వార్టర్స్‌ను గ్రామ పంచాయతీ సిబ్బంది వాడుకున్నారు.ఇటీవల కాలంలో గ్రామానికి చెందిన కొంత మంది అ క్వార్టర్స్‌  భూముల్లో  గడ్డివాములు, ముగజీవాలకు నిలపడం, వ్యవసాయ  యంత్రాలు ట్రాక్టర్లును సైతం నిలుపుతూ హద్దులను పెట్టుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. గత సంవత్సరం అధికారులు హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన ప్రస్తుతం అక్కడ అవి కనిపించడం లేదు. అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చినా ఎలాంటి స్పందన లేదని వాపోతున్నారు. 

డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి ఇస్తే ప్రయోజనం
కుక్కడంలో ఎస్‌ఎల్‌బీసీ క్వార్టర్స్‌ భూములు ప్రస్తుతం నిరుపయోంగా ఉన్నాయి. అవి ఆక్రమణకు గురికాకముందే ప్రభుత్వం ఆదీనంలోకి తీసుకొని పేదలు ఎక్కువగా ఉన్నటువంటి కుక్కడం గ్రామంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల స్థలాలకు కేటాయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇళ్లు ఇవ్వకపోయిన స్థలం ఇచ్చిన అందులో ఇల్లు కట్టుకునేందుకు ఇవ్వాలనీ కోరుతున్నారు.

క్వార్టర్స్‌ ఆస్తులు రక్షించాలి
కుక్కడం గ్రామంలో సుమారు 6ఎకరాల ప్రభుత్వ క్వార్టర్స్‌ భుములు ఉన్నాయి.ప్రస్తుతం అవి నిరుపయోగంగా మారాయి. కొంత ఇప్పటికే అందులో గడ్డివాములు,తదితర సామగ్రిని నిలిపారు.కొంత మంది హద్దులు పెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ప్రభుత్వ క్వార్టర్స్‌ భూములు రక్షించాలి.
– ఊరిబిండి శ్రీనివాస్, కుక్కడం

మా దృష్టికి రాలేదు 
కుక్కడం గ్రామంలో ఎస్‌ఎల్‌బీఈ  క్వార్టర్స్‌ భూములు కబ్జాకు గురవుతున్నాయనన్న విషయం ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు. కుక్కడంలో గ్రామంలో క్వార్టర్స్‌ను భూములు పరిశీలించి అధికారులతో సర్వే చేయించి ,ఎవరైన ఆక్రమించుకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– చంద్రశేఖర్‌ , తహసీల్దార్‌ మాడ్గులపల్లి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top