ఆ ..భూమి ఎవరికి దక్కేనో..?

Land Disputes in Nagarjuna Sagar Tribal Farmers - Sakshi

ఆందోళన వ్యక్తం చేస్తున్న గిరిజన రైతులు

ఫారెస్ట్‌ అధికారుల వేధింపులతో సతమతం

పట్టించుకోని రెవెన్యూ అధికారులు

త్రిపురారం (నాగార్జునసాగర్‌) : మండలంలోని అంజనపల్లి గ్రామ శివారు పాల్తీ తండా పరిధి సర్వే నంబర్‌ 335లో సుమారు 361 ఎకరాల భూమి ఎవరికి దక్కేనో అని గిరిజన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వే నంబర్‌లోని డీఫారెస్ట్‌ భూమిని  గిరిజనులు 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ డీ ఫారెస్ట్‌ భూములకు అక్కడి ప్రాంత గిరిజనులకు అప్పటి ప్రభుత్వం నుంచి నిబంధనల ప్రకారం పట్టాదారు పాస్‌బుక్, టైటిల్‌ డీడ్‌ పొంది అంజనపల్లి గ్రా మీణ వికాస్‌ బ్యాంక్‌లో వ్యవసాయ రుణాలు సైతం తీసుకున్నారు. పలు దఫాలు ప్రభుత్వం అందించిన రుణమాఫీ పథకం సైతం పొందారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భూ ప్రక్షాళన కార్యక్రమంలో 335 సర్వే నంబర్‌లో ఉన్న 361 ఎకరాల భూమి డీ ఫారెస్ట్‌కు చెందుతుందని అటవీ అధికారులు తేల్చి చెప్పడంతో గిరిజనలు తిరగబడ్డారు. దీంతో వివాదాస్పదం కావడంతో ఈ భూమిని పార్ట్‌ బీలోకి చేర్చారు. అప్పటి నుంచి గతంలో పట్టా పొంది డీ ఫారెస్ట్‌లో భూమి కలిగి ఉన్న రైతులకు నూతన పట్టాదారు పుస్తకాలు రాక రైతుబంధు, రైతుబీమా వర్తించకపోవడంతో గిరిజన రైతులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. 

గిరిజన రైతులకు భూమి వర్తించింది ఇలా..
నాగార్జునసాగర్‌ డ్యాం నిర్మాణం జరగకముందు పెద్దవూర మండలంలోని పర్వేదుల గ్రామ పరిధిలో పాల్తీ తండా ఉంది. అయితే సాగర్‌ డ్యాం నిర్మాణం చేసినప్పుడు ముంపునకు గురైంది. దీంతో అప్పటి అధికారులు నిబంధనల ప్రకారం పాల్తీ తండాను త్రిపురారం మండలంలోని అంజనపల్లి గ్రామ శివారులోకి తరలించి శాశ్వత ఇళ్ల స్థలాలు ఇచ్చి ముంపునకు గురైన ప్రతి గిరిజన కుటుంబానికి అక్కడ ఉన్న డీ ఫారెస్ట్‌ భూముల్లో 5 ఎకరాల చొప్పున కేటా యించి 2 ఎకరాలు మాత్రమే ఇచ్చి పట్టాదారు పాస్‌ పుస్తకం, టైటిల్‌ డీడ్‌ మంజూరు చేశారు. అప్పటి నుంచి గిరిజనులు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top