కురవి పెద్ద చెరువు లూటీ 

Kuravi Pond Looted By Peoples For Fish In Mahabubabad - Sakshi

కురవి : మహబూబాబాద్‌ జిల్లా కురవి మండల కేంద్రంలోని పెద్ద చెరువులో శనివారం సాయంత్రం పెద్ద ఎత్తున ప్రజలు చేరుకుని వలల సాయంతో చేపలను పట్టుకెళ్లారు. అయితే మత్స్యకారులు చేపలు పట్టడం పూర్తయిందనే దష్ప్రచారంతోనే జనం తమ చెరువును లూటీ చేసినట్లు కార్మికులు ఆరోపించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కురవిలోని పెద్ద చెరువులో మత్స్యకార్మికులు కొన్నేళ్లుగా చేపలను పెంచుకుంటున్నారు. అయితే మత్స్యకార్మికులు చేపలు పట్టడం చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో చెరువు వద్ద కాపలాగా ఉన్న కార్మికులపై వందలాది మంది దాడి చేసి చెరువులోకి దిగి చేపలను పట్టుకున్నారని మత్స్యకార్మికులు లింగరబోయిన శ్రీను, రేషబోయిన నారాయణ, కొణతం పెంటయ్య, మామిడి యాకన్న, వెంకన్న, వీరన్న, రాజు, కృష్ణ, వీరేందర్‌ తెలిపారు.

చెరువులో చేపలు పుష్కలంగా ఉన్నాయని చెరువును వదిలిపెట్టలేదని వారు తెలిపారు. కురవికి చెందిన కొందరు వ్యక్తులు కుట్ర చేసి చెరువులో చేపలు పట్టడం పూర్తయిందని దుష్ప్రచారం చేశారని, దీంతో కురవి గ్రామస్తులు, తండా గిరిజనులతోపాటు సమీప గ్రామాల నుంచి ప్రజలు వచ్చి వలలతో చేపలను పట్టుకెళ్లారని పేర్కొన్నారు. ఈ విషయమై కురవి పోలీసులకు ఫిర్యాదు చేశామని కార్మికులు తెలిపారు.  

చేపలు అయిపోయాయనే.. 
చెరువులో చేపలు పట్టడం పూర్తయిందనే సమాచారంతో కురవితో పాటు చుట్టుపక్కల తండాలకు చెందిన గిరిజనులు, పలు గ్రామాలకు చెందిన  ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని చెరువులో చేపలు పట్టుకున్నారు. దీంతో చెరువులో ఎక్కడ చూసినా జనమే కనిపించారు.  

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top