జూన్‌కల్లా ‘టీ–వర్క్స్‌’ తొలి దశ

KTR review on the progress of many projects - Sakshi

     మంత్రి కేటీఆర్‌ వెల్లడి

     పలు ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష

     డ్రై పోర్టులు, నిమ్జ్, మెగా ఫుడ్, సీడ్‌ పార్కుల పనులపై ఆరా 

సాక్షి, హైదరాబాద్‌: హార్డ్‌వేర్‌ స్టార్టప్‌ కంపెనీల కోసం ఉద్దేశించిన టీ–వర్క్స్‌ ఇంక్యుబేటర్‌ డిజైన్లకు తుది ఆమోదం లభించిందని, ఈ డిజైన్ల ప్రకారం టీ–వర్క్స్‌ తొలిదశ పనులు జూన్‌ నాటికి పూర్తవుతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. పరిశ్రమలు, ఐటీ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై మంగళవారం హైదరాబాద్‌లోని టీఎస్‌ఐఐసీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. టీ–వర్క్స్‌ పనులను సకాలంలో పూర్తిచేసేలా చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. టీ–క్లౌడ్‌ ప్రాజెక్టు కోసం ఇప్పటికే ఇలాంటి ప్రాజెక్టులు అమలు చేసిన రాష్ట్రాలు లేదా దేశాల అనుభవాలను అధ్యయ నం చేయాలని సూచించారు. వరంగల్‌ మెగా టెక్స్‌టైల్‌ పార్కు పనులను వేగంగా పూర్తి చేయాలని, ఇప్పటికే పార్కులో పెట్టుబడులకు అంగీకరించిన కంపెనీల కార్యకలాపాలు క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. పనుల్లో వేగం పెంచేందుకు అవసరమైతే స్థానిక ఎమ్మెల్యే ధర్మారెడ్డి సహకారం తీసుకోవాలని కేటీఆర్‌ టీఎస్‌ఐఐసీ అధికారులకు సూచించారు. ఇంటింటికీ ఇంటర్నెట్‌ కోసం ఉద్దేశించిన తెలంగాణ ఫైబర్‌గ్రిడ్‌ (టీ–ఫైబర్‌) ప్రాజెక్టు ద్వారా కలిగే ప్రయోజనాలను రానున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ సదస్సులో టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్‌ నెట్‌వర్క్‌ (టీడీఎన్‌) ద్వారా ప్రదర్శించాలన్నారు. 

వేగంగా పనులు... 
టీ–ఫైబర్, టీ–వర్క్స్, టీ–క్లౌడ్‌ ప్రాజెక్టుల పురోగతిపై కేటీఆర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. టీ–ఫైబర్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న టీడీఎన్‌ మరో 2 వారాల్లో పూర్తవుతుందని అధికారులు వివరించారు. మహేశ్వరం మండలంలోని 4గ్రామాల్లో ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని, ఇవి పూర్తయితే ఈ–హెల్త్, ఈ–ఎడ్యుకేషన్, ఈ–గవర్నెన్స్‌ రంగాల్లో రానున్న మార్పులను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే వారంలో ఈ నెట్‌వర్క్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ను ఆదేశించారు. వరంగల్‌ మెగాటెక్స్‌టైల్‌ పార్కులో అవసరమైన ప్రభు త్వ కార్యాలయాల ఏర్పాటుకు రెవెన్యూశాఖ 20 ఎకరాల స్థలాన్ని కోరినట్లు అధికారులు తెలిపారు. పార్కుకు సంబంధించిన పర్యావరణ అనుమతులు ఇప్పటికే వచ్చాయని, లే అవుట్‌ పూర్తయిందని, రోడ్లు, నీటి సౌకర్యాల ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయని మంత్రికి వివరించారు. నీటి సౌకర్యం కోసం ఇప్పటికే రూ. 50 కోట్ల నిధులు కూడా మంజూరయ్యాయని, టెక్స్‌టైల్‌ పార్కు పనులు సకాలంలో పూర్తి చేస్తామని మంత్రికి అధికారులు వివరించారు. 

డ్రై పోర్టులపై.... 
రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న డ్రై పోర్టుల గురించి కూడా కేటీఆర్‌ సంబంధిత అధికారులతో సమీక్షించారు. డ్రై పోర్టుల కోసం గతంలో గుర్తించిన భువనగిరి, జహీరా బాద్, జడ్చర్లతోపాటు రాష్ట్రానికి నలువైపులా ఉన్న మరిన్ని ప్రాంతాలనూ పరిశీలించాలన్నా రు. టీఎస్‌ఐఐసీ చేపట్టిన మెడికల్‌ డివైసెస్‌ పార్కు పురోగతి, దండు మల్కాపురంలోని గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ ఎంఎస్‌ఎంఈ పార్కు, జహీరాబాద్‌ నిమ్జ్‌ (నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ జోన్‌), మెగా ఫుడ్‌ పార్కు, సీడ్‌ పార్కు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, టీ–ఫైబర్‌ ఎండీ సుజయ్‌ కారంపూరిలతోపాటు పరిశ్రమలు, ఐటీశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top