మహోగ్రరూపం దాల్చిన కృష్ణ!

Krishna River Water Flowing Increased And Sagar Gates Open - Sakshi

శ్రీశైలం జలాశయంలోకి పోటెత్తుతున్న వరద.. నేడు మరింత పెరిగే అవకాశం 

10 గేట్లు ఎత్తి 4.35 లక్షల క్యూసెక్కులు దిగువకు.. 

18 గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌ నుంచి నీటి విడుదల 

ప్రకాశం బ్యారేజీలో గంటగంటకూ పెరుగుతున్న వరద 

మహోగ్రరూపం దాల్చిన తుంగభద్ర.. మంత్రాలయం, కర్నూలు వద్ద ప్రమాదకర స్థాయికి ప్రవాహం 

నేడు వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలను అప్రమత్తం చేసిన సీడబ్ల్యూసీ 

సాక్షి, హైదరాబాద్‌: పశ్చిమ కనుమల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటం.. తుంగభద్ర ఉరకలెత్తుతుండటంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. శ్రీశైలం జలాశయంలోకి పరవళ్లు తొక్కుతోంది. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం జలాశయంలోకి 4.35 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌.. హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న నీటిని పది గేట్లను ఎత్తి, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 4.35 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. కృష్ణా నది నుంచి నాగార్జునసాగర్‌లోకి 4.47 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి, ఎడమ కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 4.34 లక్షల క్యూసెక్కులను 18 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో పులిచింతల ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. ఆ ప్రాజెక్టులోకి 3.55 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. ముందు జాగ్రత్త చర్యగా జలాశయాన్ని ఖాళీ చేస్తూ 4.18 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పులిచింతల వద్ద వరదను నియంత్రిస్తూ ప్రజలు ముంపు బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజీలోకి వస్తున్న వరద గంటగంటకూ పెరుగుతోంది. బ్యారేజీలోకి 2.10 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా డెల్టా కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 1.88 లక్షల క్యూసెక్కులను 70 గేట్లు ఎత్తి సము ద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకూ 589.937 టీఎంసీల కృష్ణా జలాలు ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలో కలిశాయి. 

సాగర్‌ జలాశయం నుంచి 18 గేట్ల ద్వారా దిగువకు విడుదలవుతున్న నీరు 

శ్రీశైలంలోకి మరింత పెరగనున్న వరద.. 
నదీ పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవడం వల్ల ఆల్మట్టిలోకి కృష్ణా వరద ప్రవాహం పోటెత్తింది. ఆల్మట్టిలోకి 2.11 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో దిగువకు 2.50 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌ నుంచి 3.71 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నా రు. ఉజ్జయినిలోకి బీమా వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. దాంతో మిగులుగా ఉ న్న 65 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నా రు. కృష్ణా, బీమా నదుల నుంచి జూరాలలోకి 3.65 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 3.84 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. 

ఉత్తుంగ తరంగంలా.. 
నాలుగు రోజులుగా తుంగభద్ర పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో తుంగభద్ర ఉగ్రరూపం దాల్చింది. తుంగభద్ర జలాశయంలోకి 1.44 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో 1.69 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. దాంతో తుంగభద్ర నదిలో వరద ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది. మంత్రాలయం, కర్నూలు వద్ద వరద ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరడంతో తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలంలోకి భారీగా వరద చేరుతోంది. బుధవారం ఎగువ నుంచి భారీ వరద దిగువకు విడుదల చేయగా.. గురువారం కూడా నదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ అంచనా వేసిన నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) తెలుగు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top