మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి.. | kourtla students write letter to high court chief justice | Sakshi
Sakshi News home page

మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి..

Feb 9 2018 10:35 PM | Updated on Sep 15 2018 5:45 PM

kourtla students write letter to high court chief justice - Sakshi

కోరుట్ల జెడ్‌పీహెచ్‌ఎస్‌, విద్యార్థుల ప్రతినిధి.

కోరుట్ల: ‘‘మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి..  అయ్యా! మేం.. కోరుట్ల జెడ్పీ బాలికల హైస్కూల్‌లో చదువుతున్నాం. 540 మందిలో 320 మంది బాలికలం. మా బడిలో సరిపడా మరుగుదొడ్లు, మూత్రశాలలు, నీటి వసతి లేదు. అన్నం తిన్న తర్వాత తాగడానికి నీళ్లు లేక తలా కొన్ని డబ్బులు జమ చేసి కొనుక్కుంటున్నం. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు.

9వ తరగతి సాంఘికశాస్త్రంలో ‘బాలల హక్కులు–పరిరక్షణ’ పాఠంలో బాలలు సమస్యలు ఉంటే నేరుగా ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తే పరిష్కరిస్తారని చదివాం. అందుకే ఈ లేఖ రాస్తున్నాం.. తప్పయితే క్షమించండి’ ఇది.. పది హేను రోజుల క్రితం జగిత్యాల జిల్లా కోరుట్ల జెడ్పీ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ సారాంశం.

లెక్కలేని సమస్యలు..: కోరుట్ల జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఒక్క టాయ్‌లెట్‌ మాత్రమే పనిచేస్తోంది. మిగిలినవి మరమ్మతులు చేయాల్సి ఉంది. పాఠశాలలో బోరు దెబ్బతినగా..బాగు చేయించే వారులేరు. రోజు ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుక్కుంటున్నారు. పిల్లలు ఈ నీటిని తాగలేక బయట కొనుక్కుని తాగుతున్నారు. మధ్యాహ్న భోజనానికి వంటగది, డైనింగ్‌ హాల్‌ లేక విద్యార్థులు ఆరుబయట భోజనాలు చేస్తున్నారు. కూలిన ఎస్సారెస్పీ గదుల్లోనే కొన్ని తరగతులు కొనసాగుతున్నాయి. పాఠశాల సమస్యలపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం దక్కలేదు.

 రూ. 11 లక్షలతో అంచనాలు: విద్యార్థులు లేఖ రాసిన క్రమంలో కదిలిన విద్యాశాఖ వసతుల కల్పనకు రూ.11 లక్షలతో అంచనాలు తయారు చేసింది. దీనిలో 4 మూత్రశాలలు, బోర్‌వెల్, వాటర్‌ ట్యాంకు నిర్మాణానికి రూ.2 లక్షలు, మోటార్‌కు రూ.50 వేలు, 4 గదులకు రూ.8 లక్షలు, మరుగుదొడ్లు.. టాయ్‌లెట్ల మరమ్మతుకు రూ.5 వేలు కేటాయిస్తూ అంచనాలు తయారుచేశారు. నిధుల మంజూరుకు విద్యా శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శికి జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు నివేదిక అందించారు.  


స్పందించిన హైకోర్టు..
విద్యార్థినులు రాసిన లేఖపై హైకోర్టు స్పందించింది. పాఠశాలలో వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి కి ఆదేశాలు జారీచేసింది. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారి, ఆర్‌ఎంఎస్‌ఏ ఇంజనీర్లతో కలసి గురువారం పాఠశాలను పరిశీలించారు.  అవసరమైన వసతులు వెంటనే కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా విద్యా«ధికారి వెంకటేశ్వర్లు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ద్వారా హైకోర్టుకు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement