కోమటిరెడ్డి అరెస్ట్‌; గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత

Komatireddy Venkat Reddy Fires on KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గాంధీభవన్‌లో యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సోమవారం భారత్‌ బచావో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం ముగిసిన వెంటనే మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర కార్యకర్తలు చలో ప్రగతి భవన్‌ అంటూ రోడ్డు మీదకు దూసుకువచ్చారు. కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో గాంధీభవన్‌ వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొని, భారీగా ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. అరెస్ట్‌ చేసిన వారికి గోషామహల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

కేటీఆర్‌ అధికార మదంతో మాట్లాడుతున్నారు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంటికో ఉద్యోగం ఇస్తామని మాటిచ్చి మరిచిపోయారని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో భారత్‌ బచావో ఆందోళన కార్యమంలో సోమవారం ఆయన మాట్లాడారు. కేటీఆర్‌ సోనియా గాంధీని అమ్మా.. బొమ్మా అని అధికార మదంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకురావటానికి యువత నడుం కట్టాలన్నారు. తెలంగాణలోని యువ నాయకులు, యువజన కాంగ్రెస్‌ నాయకులకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని.. అక్రమ కేసులు పెట్టిన అధికారులు పేర్లు రాసిపెట్టుకోండని, వచ్చేది మన ప్రభుత్వమేనని, అందరి సంగతి తేల్చుదామన్నారు. 

కేసీఆర్‌ దమ్ముంటే ఉస్మానియాలో అడుగుపెట్టు: ఈ సందర్భంగా మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు అమలుపరచలేదన్నారు. జీఏస్టీ, నోట్ల రద్దులాంటి ప్రజలకు నష్టం చేసే కార్యక్రమాలు చేపట్టారని దూషించారు. కోట్ల రూపాయలతో మోదీ విదేశీ పర్యటనలు చేస్తున్నారని, దీని వల్ల దేశానికి ఒక్క రూపాయి ప్రయోజనం అయినా దేశానికి జరిగిందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కోరికని అర్థం చేసుకొని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందీ కానీ.. కేసీఆర్ కుటుంబాన్ని చూసి కాదన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టాలని సవాల్‌ విసిరారు. యువ కాంగ్రెస్ తోనే అధికారం సాధ్యమని తెలిపారు. యువ కాంగ్రెస్ నేతలు నాయకుల వెంట తిరగడం కాకుండా నియోజకవర్గ స్దాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని, అప్పుడే మీకు మంచి భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top