ఖమ్మంలో ఉలికిపాటు..

Khammam Person Died In Godavari Boat Accident - Sakshi

పాపికొండల లాంచీ ప్రమాదంతో జిల్లా వాసుల భయాందోళన 

నేలకొండపల్లికి చెందిన విష్ణుకుమార్‌ గల్లంతు 

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ బృందంతో కలిసి వెళ్లిన వైనం 

సాక్షి, నేలకొండపల్లి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలురు సమీపంలో పర్యాటకుల బోటు ఆదివారం మునిగిన సంఘటనలో జిల్లా వాసి ఒకరు ఉండడంతో అతడి కుటుంబం విలవిలలాడుతోంది. ఈ ప్రమాదంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉండగా..నేలకొండపల్లి వాసి రేపాకుల విష్ణుకుమార్‌ అనే 33ఏళ్ల యువకుడు గల్లంతయ్యాడు. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నేలకొండపల్లికి చెందిన రేపాకుల సూరయ్య, రాంబాయి అతడి తల్లిదండ్రులు. తండ్రి నేలకొండపల్లిలో చిన్న దుస్తుల వ్యాపారం చేస్తుంటారు. అతని సోదరుడు కూడా హైదరాబాద్‌లోనే ఉన్నాడు.

విష్ణు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. కొంత కాలంగో రాజధానిలోనే ఉంటున్నాడు. తన స్నేహితులతో కలిసి గోదావరిలో విహారయాత్రకు వెళ్లాడు. అయితే..తాను ప్రాజెక్ట్‌ పనిమీద విశాఖ పట్టణం వెళుతున్నట్లు భార్య శ్రీలక్ష్మికి శనివారం ఫోన్‌లో తెలిపాడు. అయితే..ఆదివారం ఉదయం లాంచీలో వెళుతున్నట్లు ఫొటోలు పంపాడు. ఆ తర్వాత..తాను పాపికొండల పర్యటనకు వెళుతున్నట్లు మెసేజ్‌ పెట్టాడు.

మధ్యాహ్నం సమయంలో పడవ ప్రమాద విషయం తెలియడంతో శ్రీలక్ష్మి తండ్రి టీవీలో చూసి బిడ్డకు తెలపడంతో ఆమె విలపిస్తూ..నేలకొండపల్లిలోని విష్ణు కుటుంబ సభ్యులకు విషయం తెలిపింది. గల్లంతైన విష్ణుకుమార్‌కు ఒక కుమారుడు ఉన్నాడు. స్థానికంగా వీరు కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్నారు. విష్ణు గోదావరిలో గల్లంతు కావడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అతడి తండ్రి ప్రస్తుతం వ్యాపార నిమిత్తం గుంటూరు వెళ్లాడు. రాత్రి వరకు విషయం తెలియదు. గల్లంతైన విష్ణు భార్య శ్రీలక్ష్మి ఆదివారం రాత్రి హైదరాబాద్‌ నుంచి బయల్దేరింది.  

కాకినాడకు మంత్రి అజయ్‌ పయనం.. 
లాంచీ మునిగిన దుర్ఘటనలో గల్లంతైన వారిలో వరంగల్‌ జిల్లా కడిపికొండ వాసులు అధిక సంఖ్యలో ఉండడం, ఖమ్మం జిల్లా నుంచి ఒకరు ఉండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహాయక చర్యలకు ఆదేశించారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కేసీఆర్‌ సూచనలతో ఆదివారం ఏపీలోని కాకినాడకు బయల్దేరి వెళ్లారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ముగ్గురు తహసీల్దార్లు 
సూపర్‌బజార్‌(కొత్తగూడెం): తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం వద్ద ఆదివారం జరిగిన లాంచీ ప్రమాద ఘటనలో బాధితులకు సహాయక చర్యలు అందించేందుకు జిల్లా నుంచి ముగ్గురు తహసీల్దార్లను అక్కడికి పంపారు. ఈ మేరకు కలెక్టర్‌ రజత్‌కుమార్‌శైనీ ఒక ప్రకటనలో తెలిపారు. మణుగూరు తహసీల్దార్‌ మంగీలాల్, ఇల్లెందు తహసీల్దార్‌ శ్రీనివాసరావు, సుజాతనగర్‌ తహసీల్దార్‌ ప్రసాద్‌ వెళ్లారని వివరించారు. 

లాంచీ ప్రమాద వివరాలకు హెల్ప్‌లైన్లు 
కొత్తగూడెంఅర్బన్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద జరిగిన లాంచీ ప్రమాదంలో గల్లంతైన వారి వివరాలు తెలుసుకునేందుకు జిల్లాలోని ఎస్పీ, ఏఎస్పీ కార్యాలయాల్లో హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, వరంగల్‌ నుంచి వెళ్లి ప్రాణాలతో ఉన్న, మృతిచెందిన వారి వివరాల కొరకు వారి కుటుంబ సభ్యులు భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ 9490636555, ఎస్పీ8332861100, భద్రాచలం ఏఎస్పీ, 94407 95319, సీఐ9440795320 నంబర్లలో సంప్రదించవచ్చుని పోలీస్‌ అధికారులు సూచించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top