నేడు విజయవాడకు కేసీఆర్‌

KCR to Vijayawada today - Sakshi

కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్‌ను ఆహ్వానించనున్న ముఖ్యమంత్రి 

విభజన సమస్యలపై ఇరువురు సీఎంల మధ్య మరోదఫా చర్చలకు అవకాశం 

వివాదాల స్థితిగతులపై నివేదికలు సమర్పించిన సంబంధిత శాఖలు 

అంతకు ముందు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కొత్త క్వార్టర్లను ప్రారంభించనున్న కేసీఆర్‌ 

సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు సోమవారం విజయవాడకు రానున్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ వద్ద శిష్యరికం చేస్తున్న కిరణ్‌ బాలస్వామికి పీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు అప్పగింత కార్యక్రమం సోమవారంతో ముగియనుంది. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ పాల్గొంటారు. నరసింహన్‌ సోమవారం ఉదయం విజయవాడకు చేరుకుంటారు. గేట్‌వే హోటల్‌లో బస చేస్తారు. సాయంత్రం కృష్ణాతీరంలో జరిగే సన్యాసాశ్రమ దీక్షల ముగింపు కార్యక్రమానికి గవర్నర్‌తో పాటు ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు. 

విభజన వివాదాలపై నేడు జగన్, కేసీఆర్‌ చర్చలు! 
రాష్ట్ర విభజన వివాదాల పరిష్కారం దిశగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ సోమవారం మరోసారి సమావేశమై చర్చలు జరిపే అవకాశముంది. ఈ సందర్భంగా ఇరువురు ముఖ్యమంత్రులు రాష్ట్ర విభజన వివాదాలపై మరోసారి చర్చించనున్నారు. ఈ సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర విభజన వివాదాల స్థితిగతులపై సంబంధిత శాఖలు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాయి. ఏపీ, తెలంగాణ మధ్య సత్సంబంధాలు నెలకొల్పే దిశగా ఇప్పటికే ఇరు రాష్ట్రాల సీఎంలు రెండు దఫాలుగా చర్చలు జరిపారు. ఇచ్చిపుచ్చుకొనే పద్ధతిలో సమస్యలను పరిష్కరించుకోవాలనే ధోరణితో ఇద్దరు సీఎంలు సహృద్భావ వాతావరణంలో చర్చలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌లో ఏపీ కార్యాలయాల కోసం కేటాయించిన భవనాలు గత నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉండటంతో వాటిని తెలంగాణకు అప్పగిస్తూ గవర్నర్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల సీఎంల మధ్య ఇప్పటి వరకు జరిగిన చర్చల ఫలితంగానే ఈ మేరకు ముందడుగు పడింది. ప్రధానంగా షెడ్యూల్‌ 9, 10లోని ప్రభుత్వ రంగ సంస్థల విభజన, విద్యుత్‌ ఉద్యోగుల పంపకాలు, విద్యుత్‌ బిల్లుల బకాయిలు తదితర సమస్యలను రెండు రాష్ట్రాల పరిష్కరించుకోవాల్సి ఉంది. సోమవారం ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో వీటిలో కొన్నింటికి పరిష్కారం లభించే అవకాశాలున్నాయి.

కేసీఆర్‌ పర్యటన ఇలా...
తెలంగాణ సీఎం కేసీఆర్‌ సోమవారం ఉదయం 11.45కు హైదరాబాద్‌ హైదర్‌గూడలో నూతన ఎమ్మెల్యే క్వార్టర్లను ప్రారంభించాక బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు పయనమవుతారు. మధ్యాహ్నం 1.25కు గేట్‌వే హోటల్‌కు చేరుకొని అక్కడి నుంచి 1.45కు దుర్గామల్వేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకొని పూజల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.15 గంటల వరకు అక్కడే ఉంటారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు వైఎస్‌ జగన్‌ నివాసానికి చేరుకొని ఆయనకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను అందించనున్నారు. అక్కడే భోజనం చేసి సాయత్రం 4.15కు గేట్‌వే హోటల్‌కు చేరుకొని తిరిగి సాయంత్రం 5 గంటలకు కృష్ణా తీరంలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో జరిగే శారదాపీఠం ఉత్తరాదికారి ఆశ్రమ దీక్షా స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటల వరకు అక్కడే ఉంటారు. తర్వాత గన్నవరం విమానాశ్రయం చేరుకొని హైదరాబాద్‌కు తిరిగి పయనమవుతారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top