‘పోడు’కు పరిష్కారం చూపుతాం..

KCR Public Meeting In Khammam - Sakshi

58 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ ప్రజలకు చేసిందేమిటి?

సంక్షేమ పథకాల అమలు ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే..

నామా గెలిస్తే నియోజకవర్గ ప్రజలకు నామాలే..

ప్రత్యర్థి పార్టీల డిపాజిట్లు గల్లంతు చేయాలి

మంత్రి తుమ్మల ఆప్తుడు.. పువ్వాడ నా కొడుకు రామ్‌తో సమానం

ఖమ్మం ఎన్నికల బహిరంగ సభలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజనులను పట్టిపీడిస్తున్న పోడు భూముల సమస్యకు రానున్న తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిష్కారం చూపిస్తుందని, ఏడాదిలోపు వారి సమస్యపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సైతం వెనుకాడబోమని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించాలంటూ 58 ఏళ్లు అవకాశం ఇచ్చినా.. కాంగ్రెస్, టీడీపీలు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. పైగా మరోసారి అవకాశం ఇస్తే అంత చేస్తాం.. ఇంత చేస్తామని అవాకులు.. చెవాకులు పేలుతున్నారని, ఇప్పటి వరకు ఏం చేశారో ప్రజలకు తేల్చి చెప్పాల్సిన బాధ్యత ఆ పార్టీలపై ఉందని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఒక శక్తిగా మారుతోందని, గత ఎన్నికల్లో మైనస్‌ ఖమ్మంగా ఉన్న టీఆర్‌ఎస్‌.. ఈ ఎన్నికల నాటికి జిల్లా రాజకీయాల్లో వచ్చిన పెనుమార్పుల వల్ల ప్లస్‌ ఖమ్మంగా మారి.. పది స్థానాలను దక్కించుకునే స్థాయికి ఎదిగిందన్నారు. పేద ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ.. వందలాది పథకాలను ప్రవేశపెడుతుంటే.. తమకు జాతీయస్థాయిలో ప్రశంసలు లభిస్తుంటే కాంగ్రెస్, టీడీపీలు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ.. తమ అక్కసును వెళ్లగక్కుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో కుంటుపడిన అభివృద్ధిని దారిలో పెట్టి.. ప్రజలకు అభివృద్ధి ఫలాలను చూపించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు. చైతన్యం కలిగిన జిల్లా ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తే అభివృద్ధి చెందుతుందో.. ఈ నాలుగేళ్లలో అభివృద్ధిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లింది ఎవరో ఆలోచించి అభివృద్ధి వైపు నిలవాలని ఆకాంక్షించారు.

ఖమ్మం జిల్లా అభివృద్ధిపై పూర్తిస్థాయి స్పష్టత ఉన్న నేతలు తమ పార్టీకి ఉన్నారని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన మనిషి అని.. భక్త రామదాసు ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు నిర్మాణాలకు ఆద్యుడు ఆయనేనని.. ఆయన కోరిక మేరకే తమ ప్రభుత్వం వాటిని మంజూరు చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం నేతలు ప్రజల కోసం చేస్తున్న అభివృద్ధికి ఏమాత్రం సహకరించకుండా ఇష్టారీతిగా మాట్లాడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత తమ పార్టీదేనన్నారు. టీడీపీ ఏదో రకంగా తెలంగాణ రాష్ట్రంపై పెత్తనం చేసే ప్రయత్నం చేస్తోందని, అందులో భాగంగానే కాంగ్రెస్‌తో కలిసి ఈ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేస్తోందని, అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకునే టీడీపీకి ఓటు వేస్తారో.. అభివృద్ధి ఫలాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్తున్న టీఆర్‌ఎస్‌కు అండగా ఉంటారో.. తేల్చుకోవాల్సిన సమయం జిల్లా ప్రజలకు ఆసన్నమైందన్నారు.

ఎన్నికలు రాగానే ఆయా రాజకీయ పార్టీలు అనేక విన్యాసాలు చేస్తుంటాయని, కులాలు.. మతాల పేరుతో ఓట్ల రాజకీయం చేయడానికి తాము వ్యతిరేకమని, వాస్తవాల ప్రాతిపదికనే ఓట్లు వేయాలనేది తమ విధానమని ఆయన అన్నారు. జిల్లా ప్రజల చైతన్యం ముందు ఎవరి టక్కుటమార విద్యలు నడవవు అని, డబ్బుకు, ఇతర ప్రలోభాలకు తాము లొంగబోమని స్పష్టం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై ప్రతిపక్షాలు చేస్తోంది గోబెల్స్‌ ప్రచారమని, ఇళ్ల నిర్మాణం అంత ఆషామాషీ వ్యవహారం కాదని.. ఆరుమాసాలు ఆలస్యమైనా రెండు దశాబ్దాల వరకు లబ్ధిదారుడు ఇంటి గురించి చింతలేకుండా ఉండేలా నిర్మాణం చేయడమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
 
ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకుని ప్రజల్లో కాంగ్రెస్, టీడీపీ అభాసుపాలవుతున్నాయన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా.. అబద్ధాలు చెప్పినా.. తమ పార్టీకి డిపాజిట్లు గల్లంతు చేసే అధికారం ప్రజలకు ఉందని, అదే అభివృద్ధి జరిగిందని ప్రజలు విశ్వసిస్తే మరోసారి ఆశీర్వదించి పార్టీకి పట్టం కట్టి.. ప్రత్యర్థి పార్టీల డిపాజిట్లు గల్లంతు చేయాలని ఆయన కోరారు. గత ప్రభుత్వాలు రైతులను విస్మరించాయని, తమ ప్రభుత్వ హయాంలో చనిపోయిన 2,546 మంది రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున బీమా అందిందన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనకు అత్యంత ఆప్తులని, మరోసారి తుమ్మలను గెలిపించుకోవడం ద్వారా జిల్లా అభివృద్ధిని పరిపూర్ణం చేసుకోవాలని ఆయన కోరారు.
  
నామా నామాలు.. పువ్వాడ పువ్వులు.. 
టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలిస్తే జిల్లా ప్రజలకు నామాలు పెట్టడం ఖాయమని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ను గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలను పువ్వుల్లా చూసుకుంటారని కేసీఆర్‌ అన్నారు. తన కొడుకు రామ్‌తో అజయ్‌ సమానమని అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్‌ కోరారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు పట్టం కడితే జిల్లా అభివృద్ధిలో మరింత ముందుకు పోతుందని ఆయన పేర్కొన్నారు.

సభలో మంత్రి, పాలేరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్, గనుల కార్పొరేషన్‌ చైర్మన్‌ సుభాష్‌రెడ్డి, పార్టీ జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు బాలసాని లక్ష్మీనారాయణ, గడిపల్లి కవిత, బాణోతు మదన్‌లాల్, కోరం కనకయ్య, తాతా మధు, కొండబాల కోటేశ్వరరావు, మువ్వా విజయ్‌బాబు, బేగ్, నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top